డేటింగ్ పేరుతో యువకులకు వల, 26మంది యువతుల అరెస్ట్: ప్రెస్ రివ్యూ

డేటింగ్ పేరుతో యువకులకు వల

డేటింగ్ పేరుతో యువకులకు వల వేస్తూ, భారీగా నగదు వసూలు చేసి మోసం చేస్తున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఆన్ లైన్లో డేటింగ్ పేరిట మోసం చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఒక ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

కోల్‌కతా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని వెబ్ సైట్లు నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైటులో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేస్తే.. యువతులు వారికి ఫోన్ చేస్తారు.

తియ్యని మాటలతో ముగ్గులోకి దింపుతారు. మరింత మాట్లాడాలన్నా.. ఇతర సేవలు అందించాలన్నా కొంత నగదు జమ చేయాలని సూచిస్తారు అని కథనంలో వివరించారు.

ఈ యువతుల మాటలు నమ్మిన విశాఖకు చెందిన ఒక యువకుడు సుమారు 18 లక్షలు ఖాతాలో జమ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకుని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

సీఐ గోపీనాథ్ నేతృత్వంలో బృందం కోల్‌కతా వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. వెబ్‌సైట్లో నిర్వాహకులు సూచించిన బ్యాంకు ఖాతాలు, వాడుతున్న ఫోన్ల ఆధారంగా ఒక్యులిమ్ ఐ.టి. సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌ను ఈ కార్యకలాపాలకు వేదికగా గుర్తించారు.

ఈ కాల్ సెంటరుపై దాడులు చేసి నిందితులు ఉపయోగిస్తున్న 36 ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, ఒక హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు 26 మంది యువతులను అరెస్టు చేశారు. వీరు సుమారు 48 బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల నుంచి 6 లక్షల నగదు ఉన్నట్లు వెల్లడైందని ఈనాడు చెప్పింది.

వందలాది యువకులు వీరి బారిన పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోల్‌కతా కోర్టులో ప్రవేశపెట్టినట్లు కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ-కామర్స్ సంస్థల డిస్కౌంట్ల వ్యాపారానికి ముగింపు పలకాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఆన్ లైన్ షాపింగ్ నిబంధనలు కేంద్రం కఠినతరం చేసింది. వీటిని పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజంగానే ఈ నిబంధనలను అనుసరించడం అంటే... 'ఆఫర్ల'కు తెరదించడమే అని ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

దసరా, దీపావళి కలిసి వచ్చిన ఈ అక్టోబరులో రెండు ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా జరిగిన వ్యాపారం దాదాపు వందకోట్ల డాలర్లు! మన లెక్కల్లో చెప్పాలంటే... 7 వేల కోట్ల రూపాయలు!

మొత్తం ఏడాది వ్యాపారంలో సగం... ఈ పండగ సీజన్‌లోనే జరుగుతుంది.

అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వీటిపై వరుస ఫిర్యాదులు చేయడంతో ఈ-వ్యాపారంపై మోదీ సర్కారు దృష్టి సారించిందని కథనంలో చెప్పారు.

మార్కెట్‌లో మరొకరికి అవకాశం లేకుండా, పోటీకి రాకుండా చేస్తున్న 'డిస్కౌంట్‌ దందా'కు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థల వ్యాపార పద్ధతి చట్ట విరుద్ధమని... వాటిపై చర్యలు తీసుకుంటామని గత వారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. డిస్కౌంట్‌ దందాపై దర్యాప్తు కూడా జరుపుతామని ప్రకటించారు.

అదే జరిగితే... ఇకముందు, దసరా సేల్స్‌, దీపావళి ధమాకాలు, న్యూ ఇయర్‌ ఫీవర్లు ఉండకపోవచ్చని ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు.

అసలు ఏమిటీ ఆఫర్లు? ఎవరు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? అనే అంశాలపై కేంద్రం ఆరా తీస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలకు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రశ్నావళి పంపి... సమాధానాలు ఇవ్వాలని ఆదేశించినట్లు కథనం తెలిపింది.

ముఖ్యంగా... తమ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విక్రయాలు జరుపుతున్న ఐదు అతిపెద్ద విక్రేతల వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. వీటిపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా స్పందించలేదు. ఈ-కామర్స్‌ సంస్థల ప్రతినిధులతోపాటు సీఏఐటీ సభ్యులతో కేంద్ర అధికారులు ఇప్పటికే పలు విడతలు చర్చించారని కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Dept. Of Transport, Roads and Buildings, Governmen

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

దీనికోసం సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్‌ విధానంలో జరిగే ఈ డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది.

డ్రైవింగ్‌ టెస్ట్‌ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. వాహనాన్ని సరిగ్గా డ్రైవింగ్‌ చేయకుంటే మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లైసెన్సు జారీ చేయలేరు.

ఆటోమేషన్‌ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో అమలవుతోంది. అక్కడ 'సాఫ్ట్‌' ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారని ఈ కథనంలో వివరించారు.

రాష్ట్రంలో మొత్తం తొమ్మిది చోట్ల అధునాతన సైంటిఫిక్‌ టెస్ట్‌ ట్రాక్‌లు నిర్మించడానికి రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒక్కో ట్రాక్‌ను రూ. కోటి ఖర్చుతో నిర్మించనున్నారు.

ఈ ట్రాక్‌ల కోసం కేంద్రం రూ. 9 కోట్లు సాయం చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు వెచ్చించనుంది.

విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఈ ట్రాక్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు సాక్షి కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, 2bhk.telangana.gov.in

తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లపై సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

నిజమైన పేదవారికే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, మున్సిపల్‌ పరిపాలనశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పూర్తికావచ్చిన ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన చిన్నచిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించినట్లు కథనంలో చెప్పారు.

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకంపై ప్రగతిభవన్‌లో శనివారం మంత్రి కేటీఆర్‌, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ సమీక్షించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు అవసరమైన తాగునీరు, ఇతర కనీస అవసరాలు, మౌలిక సదుపాయాల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది.

అలాగే హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇండ్లను వెంటనే పూర్తిచేసి పేదలకు అప్పగించాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌ నగరం పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇండ్ల నిర్మాణాలు పూర్తయినందున.. లబ్ధిదారుల ఎంపికను నెలరోజుల్లో పూర్తిచేయాలన్నారు.

జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు నిర్దిష్టమైన ప్రక్రియను వెంటనే తయారుచేయాలని గృహనిర్మాణశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లను మంత్రులు ఆదేశించినట్లు కథనంలో చెప్పారు.

డబుల్‌ బెడ్రూం ఇల్లు పొందిన లబ్ధిదారుడు మరోచోట ఇంటి కోసం దరఖాస్తు చేయకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)