నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా?

  • అభిజీత్ శ్రీవాస్తవ్
  • బీబీసీ ప్రతినిధి
మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, హరియాణాలో 11 నెలల క్రితమే దుష్యంత్ చౌటాలా ఏర్పాటు చేసిన జన్‌నాయక్ జనతా పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన ఘనవిజయం చూశాక, ఈ రెండు రాష్ట్రాల్లో ఈ తరహా ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ, ప్రస్తుత పరిస్థితులు నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా అన్న ప్రశ్నను తెరమీదకు తెచ్చాయి.

ఫొటో సోర్స్, COURTESY CHAUTALA FAMILY

అయితే, ఇప్పుడే ఆ అభిప్రాయానికి రావడం తొందరపాటు చర్య అవుతుందని సీనియర్ పాత్రికేయురాలు రాధికా రామశోషణ్ అంటున్నారు. ''కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేవు. 2018 డిసెంబర్‌లో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీనే మంచి ప్రదర్శన చేసింది'' అని ఆమె చెప్పారు.

అయితే, బీజేపీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న చోట్ల అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రాంతీయ పార్టీలు సవాలు విసరొచ్చని అభిప్రాయపడ్డారు.

''కాంగ్రెస్ బలహీనపడ్డ, లేక ఆ పార్టీ ఉనికి దాదాపు లేని చోట్ల బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో శూన్యత ఎక్కువ కాలం కొనసాగదు'' అని రాధిక అన్నారు.

రాబోయే రోజుల్లో బీజేపీని ఢీకొట్టే స్థితిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయని తాను భావించడం లేదని సీనియర్ పాత్రికేయురాలు అదితి ఫడ్నవీస్ చెప్పారు.

''ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఆయా రాష్రాల ఎన్నికల వరకే పరిమితం. మోదీ జాతీయ స్థాయి నేత. ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో రాజీకి రావాల్సి వచ్చుండొచ్చు. కానీ కేంద్ర రాజకీయాల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండదు'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, PTI

తృతీయ ఫ్రంట్ మళ్లీ తెరపైకి వస్తుందా?

''దిల్లీ, ఝార్ఖండ్‌ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత బిహార్ ఎన్నికలు వస్తాయి. అందరి చూపు బిహార్‌పైనే ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో నీతీశ్ కుమార్ పార్టీ జేడీయూ కూడా ప్రముఖమైంది'' అని రాధికా అన్నారు.

బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలవాల్సి వస్తుందని, అది సాధ్యం కాదని అదితి అన్నారు.

గతంలో ఇందిరా గాంధీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. మరి, మోదీని కూడా ఎదుర్కొనేందుకు ఇలా కలవడానికి ఉన్న అడ్డంకులు ఏంటి?

''అప్పుడు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు వాటిని తమతో కలిసివచ్చేలా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ, చాలా చోట్ల ఆ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి'' అని అదితి వివరించారు.

''ప్రాంతీయ పార్టీలు తమ తమ ప్రాంతాల్లో బలంగానే ఉన్నాయి. జనాదరణ, బలమైన నాయకులు ఉన్నారు. ఆ పార్టీల్లో కొన్ని బీజేపీతో కలవొచ్చు. కొన్ని పార్టీలే కలిసి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదు'' అని రాధికా అన్నారు.

''కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీచేసినా ఎన్నికలయ్యాక మళ్లీ విడిపోతాయి. బీజేపీతోనో, కాంగ్రెస్‌తోనో రాజీకి వస్తాయి'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, SAT SINGH

భవిష్యత్తులో అవకాశాలున్నాయా?

ఝార్ఖండ్‌లో జేఎంఎం లేదా జేవీఎం లాంటి ప్రాంతీయ పార్టీలు కలిసి బీజేపీని ఓడించగలిగితే తృతీయ కూటమి ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని రాధికా అన్నారు.

తృతీయ ఫ్రంట్‌లో ఎస్పీ, బీఎస్పీలు ఉండటం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా, ఆ తర్వాత విడిపోయాయి. వచ్చేసారి ఆ రెండూ మళ్లీ కలవడం అంత సులభం కాదు. బీఎస్పీ తృతీయ ఫ్రంట్ బయటే ఉంటే, ఎస్పీ అవకాశాలు దెబ్బతింటాయి. బీజేపీకి లాభం కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక మందగమన ప్రభావం..

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగిస్తుందని భావించినా, అది జరగలేదు.

''హరియాణా, మహారాష్ట్రల్లో ఆర్థిక మందగమనం ప్రభావం పడింది. మహారాష్ట్రలో పార్లే సంస్థ వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగంపై విధించిన ఆంక్షలతో వాటి ఉత్పత్తి ద్వారా ఉపాధి పొందుతున్నవారు, అసంఘటిత రంగంలోని రిటైలర్లు ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు'' అని అదితి వివరించారు.

ఆర్థిక మందగమన ప్రభావం జాతీయవాదం అంశాన్ని వెనక్కినెట్టిందని, అందుకే విజయ పథంలో ఉన్న బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల్లోనూ అవరోధాలు ఎదురయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు.

''హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయమే ఉంటుందని భావించరంతా. కానీ, ఈ ఫలితాలను చూసి నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఎక్కడో ఒక చోట ఆ పార్టీకి ప్రతిఘటన మొదలైంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ వ్యూహం మార్చుకుంటుందా?

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించినా, ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. బీజేపీ రాజకీయ వ్యూహాల్లో ఏదో లోపం ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. మరి, రాబోయే రోజుల్లో ఆ పార్టీ పంథా మారుతుందా?

''రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల అంశాలే ప్రధానమవుతాయి. సమయానికి తగ్గట్లు బీజేపీ వ్యూహాన్ని మార్చుకుంటుంది. దానిపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదు'' అని అదితి చెప్పారు.

''కుల రాజకీయాలకు తాము దూరమని ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ డప్పు కొట్టకుని మరీ చెప్పింది. కానీ, హరియాణాలో ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించింది. కుల సమీకరణాల కారణంగానే ఖట్టర్‌ను ముఖ్యమంత్రిని చేసింది'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)