తెలంగాణ హైకోర్టు: 'ఆర్టీసీ కార్మిక సంఘాలకు సమ్మె విరమించాలని చెప్పలేం'

తెలంగాణ హైకోర్టు, ఆర్టీసీ లోగో

ఫొటో సోర్స్, Getty Images/BBC

సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు తాము చెప్పలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

సమ్మె వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్టీసీ యాజమాన్యం వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

జీహెచ్ఎంసి నుంచి ఆర్టీసీకి రావాల్సిన రూ.335 కోట్ల బకాయిల గురించి అధికారులను కోర్టు ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

తదుపరి విచారణకు ఆర్టీసీ ఇంచార్జి ఎండీతో పాటు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ఆదేశించింది.

సమ్మె చట్టవ్యతిరేకం అని రూలింగ్ ఇచ్చి, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఓ పిటిషనర్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.

ఈ కేసును కోర్టు శుక్రవారానికి (నవంబర్ 1) వాయిదా వేసింది. జీతాల చెల్లింపు అంశం కూడా అదే రోజు విచారణకు రానుంది.

మరోవైపు కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు కూడా కోర్టు అనుమతి మంజూరు చేసింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఈ సభను కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి.

అంతకుముందు విచారణలో..

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సోమవారం (అక్టోబర్ 28న) కూడా కోర్టు విచారణ జరిపింది.

కార్మిక సంఘాలతో చర్చల వివరాలతో అదనపు కౌంటర్ పిటిషన్‌ను ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసింది. అన్ని డిమాండ్లపై చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.

ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యయనం చేసి ఎండీకి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి ఆర్టీసీ పరిస్థితి బాలేనందున, రెండు డిమాండ్లు మాత్రమే అంగీకరించడం సాధ్యమని నివేదికలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు.

మొత్తం 21 డిమాండ్లలో 2 ఆమోదయోగ్యంగా ఉన్నాయని, 16 డిమాండ్లు అంగీకరిస్తే దానివల్ల సంస్థపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుందని, మరో 2 డిమాండ్లు అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేనివని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఆ నివేదికను కోర్టుకు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆర్టీసీ వాదనేంటి?

2015లో కూడా ఇలాంటి డిమాండ్లే పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ రూ.4000 కోట్ల నష్టాల్లో ఉంది. బ్యాంక్‌లకు బకాయి పడ్డ రూ.340 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు రోజుల్లో రోజుకు రూ.10 కోట్లు, పండుగ రోజుల్లో రూ.13 కోట్లు ఆదాయం రావాలి. సమ్మె కాలంలో రూ.175 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయి.

కార్మిక సంఘాలు ఏమంటున్నాయి?

ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.720 కోట్ల సబ్సిడీ ఇవ్వాలి. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. ఉద్యోగులు తగ్గారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల సంస్థ నష్టాల్లో ఉంది. మొత్తం 26 డిమాండ్లపై చర్చించాలి. ఆర్థిక భారం అనేది ఓ సాకు మాత్రమే. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తే ఈ గొడవే లేదు.

ఫొటో సోర్స్, TS HIGH COURT

కోర్టు ఆగ్రహం

సోమవారం వాదనల సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం అడ్వొకేట్ జనరల్‌ను పిలిపించాలని సూచించింది. తమ అధికారాలను తమకే గుర్తు చేయనక్కర్లేదని మండిపడింది.

కార్మిక సంఘాలు, యాజమన్యం మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు, తెలంగాణలో రోడ్డు రవాణా కీలకమనీ, రోగులు ఆసుపత్రులకు కూడా వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం రూ.46 కోట్లు ఇవ్వలేకపోతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

విలీనం రాత్రికి రాత్రి సాధ్యపడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, తమ ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని, ఆర్థిక భారం లేని అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని సూచిస్తూ, మంగళవారం మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)