కశ్మీర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో పర్యటించనున్న తొలి విదేశీ ప్రతినిధి బృందం

  • జుబేర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
యూరోపియన్ యూనియన్ సభ్యులు

ఫొటో సోర్స్, Getty Images

28 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం కశ్మీర్‌లో మంగళవారం (అక్టోబర్ 29) నాడు పర్యటించనుంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో విదేశీ ప్రతినిధులు పర్యటించడం ఇదే తొలిసారి.

సోమవారంనాడు ఈయూ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

"ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకాలాపాలను ప్రోత్సహించడం, మద్దతు తెలపడం వంటి చర్యలను ఓ విధానంగా పెట్టుకున్నవారు వ్యక్తులైనా, సంస్థలైనా వారిపై తక్షణం చర్య తీసుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు" అని మోదీ వారితో వ్యాఖ్యానించారు.

కశ్మీర్లోని సాధారణ ప్రజలతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటామని ఎంపీల బృందంలో సభ్యుడైన బీఎన్ డన్ తెలిపారు.

"రేపు మేం జమ్ము, కశ్మీర్‌కు వెళ్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు గురించిన పూర్తి సమాచారాన్ని ప్రధాని మోదీ మాకు వివరించారు. కానీ, మేం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో చూడాలనుకుంటున్నాం. మేం కొందరు స్థానిక ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాం" అని డన్ అన్నారు.

భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకే ఈయూ బృందం కశ్మీర్లో పర్యటించనుంది. అయితే ఇది అధికారిక పర్యటన కాదు అని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్లో పర్యటించాలని భారత్ నుంచి బ్రిటన్‌లోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నేత, ఈయూ ఎంపీ క్రిస్ డేవిస్‌కు కూడా ఆహ్వానం అందినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, స్థానికులతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు తనను అనుమతించాలని కోరడంతో ఆ ఆహ్వానం రద్దైందని చెప్పాయి. అయితే దీన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించలేదు.

"అక్కడంతా సజావుగా ఉందని చూపించుకునేందుకు భారత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నాకు లేదు. కశ్మీర్లో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచం దీన్ని గుర్తించడం ప్రారంభించాలి" అని డేవిస్ అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. కశ్మీర్ లోయలో లాక్‌డౌన్ కారణంగా సాధారణ ప్రజా జీవితం ప్రభావితమైంది.

లోయలో భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించారు. 144 సెక్షన్ విధించారు. ముఖ్య నేతలందర్నీ గృహనిర్బంధం లేదా జైళ్లలో ఉంచారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సాధారణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ లోయలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఆగస్టు 5 తర్వాత ఎలాంటి అనూహ్య ఘటనలూ చోటుచేసుకోలేదని భారత ప్రభుత్వం చెబుతోంది. భారత్ సరైన చర్యే తీసుకుందని పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన రిటైర్డ్ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా అభిప్రాయపడ్డారు.

"పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యయి. విదేశీ జర్నలిస్టులు, దౌత్యవేత్తలను కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించడం ద్వారా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భారత్ సందేశం ఇస్తోంది" అని డోగ్రా తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ చేసిన చట్టం అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానుంది.

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్తాన్, దీన్ని ఐక్యరాజ్య సమితి వేదికపై లేవనెత్తడమే కాకుండా, దీన్ని ఓ అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నించింది.

భారత దాడుల్లో పౌరులు మరణించారని పాకిస్తాన్ చెబుతున్న ప్రాంతాల్లో విదేశీ దౌత్యవేత్తల బృందం ఇటీవలే పర్యటించింది.

గత 70 ఏళ్లలో జమ్ము, కశ్మీర్ ఇరుదేశాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. భారత పాలిత కశ్మీర్‌ భూభాగం కాకుండా అధిక భాగం పాకిస్తాన్ పరిపాలనలో ఉంది. అయితే, కశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని భారత్ భావిస్తుండగా, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని పాకిస్తాన్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)