సుజిత్ విల్సన్ మృతి... బోరు బావి మిగిల్చిన మరో విషాదం

సుజిత్ విల్సన్

తమిళనాడు తిరుచ్చిలోని నడుకాట్టుపట్టి గ్రామంలో శుక్రవారం ఇంటి పెరట్లో ఆడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయిన సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీయడం సాధ్యపడలేదు.

బాలుడు పడిపోయిన బోరు బావి నుంచి దుర్గంధం వెలువడుతోందని, ఇది దురదృష్టకరమని తమిళనాడు ప్రభుత్వ అధికారి రాధాకృష్ణన్ మీడియాతో అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

బాలుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు కోయంబత్తూరు నుంచి బీబీసీ తమిళ్ కోసం పనిచేస్తున్న హరిహరన్ చెప్పారు. బాలుడిని రక్షించేందుకు సమాంతరంగా మరొక బోరుబావిని తవ్వారు. కానీ, బాలుడి మృతదేహాన్ని మాత్రం అతను పడిపోయిన బోరు బావి నుంచే వెలికితీశారు.

ప్రమాదం ఎప్పుడు జరిగింది?

శుక్రవారం తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ సుజిత్ బోరుబావిలో పడిపోయాడు.

బోరు బావిలో 26 అడుగుల లోతులో ఉన్న సుజిత్‌ను కాపాడేందుకు అతని తల్లితండ్రులు పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని ఆశ్రయించారు.

అదేరోజు సాయంత్రం 6 గంటలకల్లా సుజిత్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

సుజిత్‌ను కాపాడేందుకు ఏం చేశారు?

బాలుడికి తొలుత ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు.

జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

సుజిత్‌ పరిస్థితిని తెలుసుకునేందుకు సీసీటీవీ కెమెరాను బోరు బావిలోకి పంపించారు.

బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన ఆరు బృందాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన సిబ్బంది మూడు రోజులకు పైగా ప్రయత్నించారు.

చేతులు కట్టేసి బయటకు తీసే ప్రయత్నాలు విఫలం

బాలుడిని కాపాడే క్రమంలో ఈ బృందాలకు తొలుత చేతులు కనిపించాయి.

దీంతో సుజిత్ చేతుల్ని తాడుతో కట్టి బయటకు తీయాలని చూశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

బాలుడు పడిపోయిన బోరు బావికి సమాంతరంగా మరొక బోరు బావి తవ్వాలని నిర్ణయించారు.

శనివారం అర్థరాత్రి కల్లా యంత్రాలతో బోరు తవ్వడం ప్రారంభించారు. అలా 10 అడుగులు తవ్వగానే రాళ్లు తగిలాయి.

పని ప్రారంభించిన కొన్ని గంటలకే యంత్రం పాడైపోయింది. దీంతో మరొక యంత్రాన్ని తీసుకొచ్చి పని కొనసాగించారు.

ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వచ్చారు. బాలుడిని కాపాడే కార్యక్రమాలను పర్యవేక్షించారు.

బాలుడు సుమారు 80 అడుగుల లోతులో ఉన్నాడని, అప్పటి వరకు 35 అడుగుల బోరు బావిని సమాంతరంగా తవ్వారని, మరొక 45 అడుగులు తవ్వాల్సి ఉందని చెప్పారు.

నీళ్ల కోసం బోరు బావిని తవ్వగా, నీళ్లు పడలేదని.. దీంతో బోరు బావిని ఇసుకతో మూసేశారని, అయితే.. వర్షాల కారణంగా ఆ ఇసుక కొట్టుకుపోవడంతో సుజిత్ బోరులో పడిపోయాడని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)