ఇద్దరితో ప్రేమ ఎందుకన్నందుకు తల్లిని చంపిన కూతురు - ప్రెస్ రివ్యూ

మృతదేహం ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

చెడు తిరుగుళ్ళు వద్దని మందలించినందుకు ఒక కూతురు తల్లినే అతి కిరాతకంగా హతమార్చిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

తల్లిని చంపిన కూతురు అదే ఇంట్లో ఓ స్నేహితుడితో రహస్యంగా మూడురోజులపాటు గడిపిందని ఇందులో చెప్పారు.

హత్యను తండ్రిపై నెట్టేందుకు ఆమె ప్రియుడి ఇంట్లో మరో మూడు రోజులు దాక్కుంది. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

హత్య జరిగిన వారంరోజుల తర్వాత అసలు మిస్టరీ బయటపడటంతో కలకలం రేగిందని కథనంలో చెప్పారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లాకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి, రజిత దంపతులు కూతురు కీర్తితో హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మునుగనూరులోని ద్వారకానగర్‌లో ఉంటున్నారు.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు కీర్తిని చెడు తిరుగుళ్ళు తిరుగొద్దని తల్లి ఈ నెల 19న మందలించింది. దీనిపై ఇద్దరూ గొడవపడ్డారు. అదేరోజు రాత్రి స్నేహితుడు శశితో కలిసి తల్లి మెడకు చీరతో ఉరి బిగించి చంపిన కీర్తి, బయటి నుంచి తాళం వేసి తల్లి మృతదేహం ఉన్న ఇంట్లోనే శశితో కలిసి మూడురోజులు రహస్యంగా గడిపిందని వివరించారు.

నాలుగోరోజున శశి సాయంతో కారులో తల్లి శవాన్ని తీసుకెళ్లి సొంతూరు నీర్నాముల దగ్గర రైల్వే ట్రాక్‌పై పడేసింది. హయత్‌నగర్‌లో నివసించే ప్రియుడు బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్‌ చేసి తల్లి రజితలాగా మాట్లాడి తాము బయట ఉన్నామని, అప్పటివరకు కూతుర్ని మీ ఇంట్లో ఉండనీయండని బతిమాలింది. బాల్ రెడ్డి తండ్రి నిజమని నమ్మారు. అలా వారి ఇంట్లో మరో మూడు రోజులు గడిపారు.

రైల్వే ట్రాక్‌పై రజిత మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కానీ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కీర్తి పోలీసులకు దొరికిపోయిందని కథనంలో చెప్పారు.

అందరి ఫోన్ల లొకేషన్ మ్యాప్ చేసిన పోలీసులు వైజాగ్ వెళ్లినట్లు చెప్పిన కీర్తి ఫోన్ లొకేషన్ హయత్‌నగర్‌లో ఉన్నట్టు గుర్తించారు. తర్వాత ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించడంతో శ్రుతి తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకుందని నమస్తే తెలంగాణలో చెప్పారు. ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం తప్పని చెప్పినందుకు తల్లినే కడతేర్చాలని కూతురు కుట్ర పన్నినట్టుగా తెలుస్తోందని కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, MLA VAMSI MOHAN/facebook

అందుకే రాజీనామా

మా వాళ్ల కోసమే టీడీపీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడమే గాకుండా.. క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగా ఉండదలిచినట్లు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపిందని ఆంధ్రజ్యోతి రాసింది.

నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి కక్షసాధింపు ధోరణి వల్ల తనను నమ్ముకున్నవారంతా పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని.. తాను క్రియాశీలంగా ఉండడం వల్ల వారి కష్టాలు రెట్టింపవుతున్నాయని తెలిపారు. అందుకే వారి కోసం తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు దీపావళి రోజున లేఖ రాశారని చెప్పారు.

దీనికి స్పందించిన చంద్రబాబు అండగా ఉంటాం.. పోరాడదామని ప్రతిలేఖ రాశారు. దానిపై వంశీ మరో లేఖను వాట్సాప్‌ ద్వారా పంపించారు.

దానికీ స్పందించిన టీడీపీ అధినేత.. అన్ని విషయాల్లోనూ అండగా ఉంటానని, సమస్యలపై మద్దతిచ్చేందుకు పార్టీ ఎంపీ కేశినాని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను నియమిస్తున్నానని తెలిపారు.

వారిద్దరూ మంగళవారం వంశీతో చర్చలు జరిపే అవకాశాలున్నాయని కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య 2017 సెప్టెంబర్ 7వ తేదీన లార్డ్స్ మైదానంలో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ చిత్రం

భారత్‌లో తొలి డే అండ్ నైట్ టెస్ట్

భారత్‌లో తొలి డే అండ్ నైట్ టెస్ట్ నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయని ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనం ప్రచురించాయి.

దీనిపై ఎప్పట్నుంచో సానుకూలత వ్యక్తం చేస్తున్న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఫ్లడ్ లైట్ల వెలుగులో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సుముఖంగా ఉన్నాడని ఇటీవలే వెల్లడించిన సౌరభ్.. రాబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన రెండో టెస్టును గులాబీ రంగు బంతితో ఆడాలని తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డుకు ప్రతిపాదన కూడా పంపాడు.

ఈనెల 22న జరిగే ఈ టెస్టును డే అండ్ నైట్‌లో నిర్వహిస్తామనే ప్రతిపాదనకు బంగ్లాదేశ్ బోర్డు అంగీకారం తెలిపితే చాలు గులాబీ టెస్టు మజాను భారత అభిమానులు ఆస్వాదించవచ్చు అని ఈనాడు చెప్పింది.

ఈ విషయంపై రెండ్రోజుల క్రితమే బీసీసీఐ నుంచి లేఖ అందింది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

డై అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అభ్యంతరం ఉండదని, కానీ తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్ లేకపోవడం పెద్ద సమస్య అని బంగ్లాదేశ్ కెప్టెన్ అక్రమ్ ఖాన్ అన్నట్టు కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, JAGAN/FB

కరువు లేకుండా ప్రతి బొట్టూ పట్టాలి

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని.. కరవు నేలను సుభిక్షం చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సాక్షి చెప్పింది.

గోదావరి వరద జలాలను కరవు నేలకు మళ్లించడానికి అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో ప్రతిపాదనపై దృష్టి పెట్టింది.

పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారు చేయిస్తోంది.

గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల్లో రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున అంటే 2 టీఎంసీల నీటిని.. 105 రోజులపాటు తరలించి.. మొత్తంగా 210 టీఎంసీలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అని కథనంలో చెప్పారు.

తద్వారా నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జునసాగర్‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని ఇందులో రాశారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలని యోచిస్తోంది.

దీనిపై ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై అధ్యయనం చేసి.. డీపీఆర్‌ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ ప్రతిపాదనలపై వ్యాప్కోస్‌ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా పనులు చేపట్టనున్నారు అని సాక్షి కథనంలో వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)