కశ్మీర్లో 27 మంది యూరప్ ఎంపీల పర్యటనపై మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల ప్రశ్నలు

కశ్మీర్లో 27 మంది యూరప్ ఎంపీల పర్యటన

ఫొటో సోర్స్, Pib

ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత మొదటిసారి యూరప్‌కు చెందిన 27 మంది ఎంపీల బృందం అక్కడ పర్యటిస్తోంది. ఈ యూరోపియన్ ఎఁపీలు జమ్ము-కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తారని చెబుతున్నారు.

జమ్ము-కశ్మీర్ పర్యటనకు ముందు ఈ బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ను కలిసింది.

ఈ ఎంపీలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్‌కు చెందిన వారు. ఇది అధికారిక పర్యటన కాదని, వ్యక్తిగత హోదాలో వీరు పర్యటిస్తున్నారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఎంపీలు మితవాద ధోరణి ఉన్నవారని, ఈ పర్యటనలో భారత్ ఎన్ఎస్ఏ కార్యాలయానికి కూడా కీలక పాత్ర ఉందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

ఇంతకు ముందు, కశ్మీర్ వెళ్లాలన్న అమెరికా సెనేటర్ క్రిస్ వాన్ హాలెన్‌ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. భారత నేతలు, ఎంపీలు కశ్మీర్ వెళ్లకుండా నిషేధించిన ప్రభుత్వం, విదేశీ ఎంపీలను మాత్రం అక్కడికి వెళ్లనిస్తోందని విపక్షాలు కాంగ్రెస్, సీపీఎం ప్రశ్నించాయి.

"భారత ఎంపీలు వెళ్లకుండా నిషేధం ఉన్నప్పుడు, జమ్ము-కశ్మీర్లో ఒక నిర్దేశిత పర్యటనకు యూరప్ ఎంపీలకు మాత్రం స్వాగతం పలుకుతున్నారని" కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Pib

ప్రధానితో ప్రతినిధి బృందం భేటీ

సోమవారం సాయంత్రం యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో కశ్మీర్ సహా పలు వాణిజ్య అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఏ దేశాల పేర్లు ప్రస్తావించని ప్రధాని నరేంద్ర మోదీ "ప్రపంచం ముందు ఇప్పుడున్న అతిపెద్ద సమస్య తీవ్రవాదం, తీవ్రవాదాన్ని పెంచి పోషించేవారే. భారత్, యూరప్ లాంటి వివిధ గణతంత్ర సమాజాల ముందు తీవ్రవాదం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా నిలిచింది. దానిపై పోరాడేందుకు అంతర్జాతీయ సహకారం అవసరం" అన్నారు.

"తీవ్రవాదాన్ని ఎవరు సమర్థించినా, వారికి సాయం అందించినా లేదా అలాంటి పనులు చేసేవారికి, సంస్థలకు సాయం అందించినా, తీవ్రవాదాన్ని సమర్థించే విధానాన్ని అనుసరించినా వారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాదాన్ని సహించేది లేదు" అని మోడీ అన్నారు.

జమ్ము-కశ్మీర్ పర్యటన గురించి యూరోపియన్ యూనియన్ నేతలు కూడా తమ పర్యటన పట్ల చాలా ఉత్సాహంగా కనిపించారు.

ఈ ప్రతినిధి బృందంలోని బ్రిటన్ లిబరల్ పార్టీ నేత బిల్ న్యూటన్ డన్ "నేను కశ్మీర్ పరిస్థితి గురించి, అక్కడి ప్రజల గురించి చాలా విన్నాను. మేం ఇక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవం ఏంటో, అక్కడి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం" అన్నారు.

"మేం స్థానికులు కొందరితో మాట్లాడుతాం ఎందుకంటే మేం అందరి జీవితాలూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాం" అని తెలిపారు.

అటు "ప్రభుత్వం ఈ యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందాన్ని సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల వరకూ తీసుకెళ్లాలి" అని జమ్ము-కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కవిందర్ గుప్తా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, EPA

పర్యటన రద్దుకు డిమాండ్

ఈయూ నుంచి అనధికార పర్యటన కోసం వచ్చిన ఈ 27 మంది సభ్యుల బృందం అక్టోబర్ 29న జమ్ము-కశ్మీర్‌లో పర్యటిస్తుంది.

కానీ, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఈ పర్యటనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆయన ట్విటర్‌లో "యూరోపిన్ యూనియన్‌కు సంబంధించిన నేతలను జమ్ము-కశ్మీర్ పర్యటనకు పంపించే ఏర్పాట్లను విదేశాంగ శాఖ వ్యక్తిగత స్థాయిలో చేయడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది మన జాతీయ విధానానికి వ్యతిరేకం. ఇది అనైతికం, దీనిని వెంటనే రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా" అన్నారు.

జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ నేత మహబూబా ముఫ్తీ ఇదే అంశంపై సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జమ్ము-కశ్మీర్‌కు చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల సహా చాలా మంది నేతలు ఇప్పటికీ అరెస్టు లేదంటే, గృహనిర్బంధంలో ఉన్నారనే విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నారు. వారిలో మహబూబా ముఫ్తీతోపాటూ ఫారూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు.

"కశ్మీర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి, అక్కడికి వెళ్లడానికి యూరోపియన్ యూనియన్ నేతలను అనుమతించినపుడు, అమెరికా సెనేటర్లను ఎందుకు అనుమతించరు" అని మహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్లో ఆమె, "ప్రతినిధి బృందాన్నిరాష్ట్రంలోని ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ఎందుకు కలవనివ్వడం లేదు. ఎలాగైనా, రెండు పరిణామాలు జరగవచ్చు. పరిస్థితి సాధారణంగానే ఉందని ఈ ప్రతినిధి బృందం చెబితే, అదుపులో ఉన్న వారిని విడుదల చేసి, ఇంటర్నెట్ సేవలు కూడా పునరుద్ధరించాలి. వారు పరిస్థితి సాధారణంగా లేదని చెబితే, అది ప్రభుత్వానికే సిగ్గుచేటు" అన్నారు.

భారత ప్రభుత్వం ఇటీవల కశ్మీర్‌లో పర్యటించడానికి అమెరికా సెనేట్ నేత అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చాలా చర్చ జరిగింది.

అక్టోబర్ 31న జమ్ము-కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌గా విడిపోతుంది.

ఈలోపు యూరోపియన్ యూనియన్ బృందం ఈ పర్యటనను కీలకంగా భావిస్తున్నారు. కానీ, సామాన్యుల మనసులో మాటను ప్రతినిధి బృందం తెలుసుకోగలదా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

జేకేఎల్ఎఫ్ నేత యాసీన్ మలిక్ భార్య ముషాల్ మలిక్ ఆందోళన

కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భసీన్ అభిప్రాయం

గత మూడు నెలల నుంచీ ప్రభుత్వం రాజకీయ ప్రతినిధి బృందాలను, ఎన్జీవోలను ఎవరినీ రానీయలేదు. విదేశీ జర్నలిస్టులపై కూడా ఒక విధంగా నిషేధం లాంటిది ఉంది.

అయితే, హఠాత్తుగా ఒక కొత్త ప్రతినిధి బృందం వస్తోంది. ఇది స్వతంత్రంగా పనిచేస్తుందా? లేక ఒక నిర్దేశిత పర్యటన అవుతుందా? అనేది చూడాలి.

ఈ పర్యటనకు ముందు కశ్మీర్లో విధించిన నిషేధాలను ఎత్తివేస్తారు. నాకు దీని గురించి అప్పుడే ఏదైనా చెప్పడం సరికాదనిపిస్తోంది. ఎందుకంటే, దీని ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇది ముఖ్యమైనది అవుతుందా లేక చూపుల కోసమే పర్యటిస్తున్నారా అనేది చూడాలి.

ఎంపిక చేసిన ఒక బృందాన్ని కశ్మీర్ వెళ్లనిస్తున్నారంటే, వారి స్వేచ్ఛపై కూడా ప్రశ్నలు వస్తాయి.

ఈ పర్యటనను రద్దు చేయాలని నేను అనడంలేదు. ఈ ప్రతినిధి బృందం సహా అందరికీ తలుపులు తెరవాలి.

ప్రభుత్వం అంతా బాగుందని చెబితే, ఈ పర్యటన కోసం కశ్మీర్‌ను తెరిచినట్లే. కానీ అక్కడకు రాజకీయ నేతలు గానీ, మీడియాగానీ వెళ్లలేరు. ఇలాంటి నిషేధం ఉంటే అక్కడ ఏదో సమస్య ఉందనేది స్పష్టం అవుతోంది.

ప్రభుత్వం నిర్దిష్టంగా కొందరి రాకపోకలను ఆపివేయాలని అనుకుంటోంది. కశ్మీర్లో ఉన్న వాస్తవాలు వెలుగుచూడాలంటే అలా చేయకూడదు.

అక్టోబర్ 31న జమ్ము-కశ్మీర్ రాష్ట్రం చివరికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవుతుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌గా మారుతుంది. ఈ పర్యటన అంతర్జాతీయ సమాజానికి ఏదైనా సంకేతమా?

నాకు తెలిసి ఇది మనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకునేందుకే. బహుశా దానివల్ల ఎలాంటి తేడా కనిపించదు. కానీ దీనివల్ల పరిస్థితిలో ఏదైనా, సానుకూల లేదా ప్రతికూల ప్రభావం ఉంటుందని అయితే నాకైతే అనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రతినిధి బృందం ఎవరితో మాట్లాడుతుంది?

"దక్షిణ కశ్మీర్ లేదా శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో ప్రజలపై ఎక్కువ ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో, ప్రజలపై ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అందిన నివేదికల ద్వారా తెలిసింది ఏంటంటే, అక్కడి ప్రజలు భయం వల్ల ఎవరికీ ఏం చెప్పడం లేదు".

"ఇలా, ఒక వీఐపీ టీమ్‌ను తీసుకెళ్లి వాళ్లను దూరంగా కూచోబెడితే, వాళ్లు ఎలాంటి ప్రజలను కలవగలరు. ప్రతినిధి బృందం భద్రత కోసం కఠిన ఏర్పాట్లు చేసుంటారు. అందుకే, వాళ్లు ఒక్కో ఊరికీ వెళ్లి అక్కడి ప్రజలను కలవడం సాధ్యం కాదు".

"ప్రజలు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఏదైనా చెబితే, తర్వాత నుంచి తాము ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడాల్సుంటుందని వారికి అనిపిస్తోంది".

‘‘స్థానికులు ప్రతినిధి బృందం ముందు నిస్సంకోచంగా మనసులో మాట చెప్పగలరా. అన్నిటికంటే పెద్ద ప్రశ్న అదే. అలాంటప్పుడు, ఈ బృందం చెప్పేది కూడా ఒక వైపే ఉంటుంది. అందులో అన్ని పక్షాల వారూ ఉండరు".

"ఇప్పటికీ పెద్ద నేతలు, వేర్పాటువాద నేతలు చాలా మంది అదుపులో లేదంటే గృహనిర్బంధంలో ఉన్నారు. అగ్ర నేతలే కాదు, చిన్న స్థాయి వారు కూడా జైళ్లలో ఉన్నారు".

"వ్యాపారులు, లాయర్లు, ఎన్జీవో కార్యకర్తలు, విద్యావేత్తలు కూడా జైళ్లలో, లేదంటే నిర్బంధంలో ఉన్నారు. అలాంటప్పుడు ఈ ప్రతినిధి బృందం ఎవరితో మాట్లాడుతుంది" అని భసీన్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)