క్షయ వ్యాధి చికిత్సకు కొత్త టీకా... హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ఇండియా కరస్పాండెంట్
క్షయ

ఫొటో సోర్స్, copyrightTHINKSTOCK

ట్యూబర్ క్యులాసిస్(క్షయ) చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల వ్యాక్సిన్‌ను పరిశోధకులు ఆవిష్కరించారు.

ఏటా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది మరణానికి కారణమవుతున్న వ్యాధి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నారు.

ఒకరి నుంచి ఒకరి సులభంగా సోకే ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న బీసీజీ జబ్ పెద్దగా ప్రభావవంతంగా లేదు.

కొత్త వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు విజయవంతమైనప్పటికీ అందుబాటులోకి రావడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు.

హైదరాబాద్‌లో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి నిర్వహించిన ఓ అంతర్జాతీయ సదస్సులో పరిశోధకులు తాజాగా ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు.

క్షయ ప్రబలంగా ఉన్న దక్షిణాఫ్రికా, కెన్యా, జాంబియాల్లో 3500 మందిపై దీన్ని ప్రయోగించి చూసినట్లు పరిశోధకులు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP

విప్లవాత్మక వ్యాక్సిన్ అంటున్నారెందుకు?

ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా టీబీ చికిత్సలో ఇది సానుకూల మార్పులు తేనుందని క్షయ చికిత్స నిపుణుడు డేవిడ్ లూయిన్సన్ బీబీసీతో చెప్పారు.

మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బారిన పడిన వారికి ఈ టీకా వేసినా వ్యాధి తగ్గుతుందని ఆయన చెప్పారు.

''నిజానికి టీబీకి కారణమైన మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బారిన పడిన అందరికీ క్షయ వ్యాధి సోకదు. ఈ ఇన్ఫెక్షన్‌ను నిరోధించే శక్తి కొందరి శరీరంలో ఉండొచ్చు. ఈ సహజమైన రోగ నిరోధక శక్తిని మరింత పెంపొందించడానికి ఈ వ్యాక్సిన్ సహాయపడుతుంది'' అన్నారాయన.

అయితే, దీనికి అనుమతులు పొందడానికి ముందే మరింతమందిపై ప్రయోగించి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, copyrightREUTERS

ఫొటో క్యాప్షన్,

ట్యూబర్ క్యులోసిస్ బ్యాక్టీరియా మైక్రోస్కోపిక్ చిత్రం

మార్కెట్లోకి రావడానికి ఎంతకాలం పట్టొచ్చు?

అంతా సవ్యంగా సాగితే ఈ వ్యాక్సిన్ 2028లో అందుబాటులోకి రావొచ్చని డేవిడ్ లూయిన్సన్ చెప్పారు.

ఔషధ తయారీ సంస్థ గ్లాస్కో స్మిత్‌క్లైన్ 20 ఏళ్లుగా టీబీ వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది.

2018లో సుమారు కోటి మంది టీబీ బారినపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

2015 - 2035 మధ్య టీబీ కేసులు 90 శాతం.. టీబీ వల్ల మరణాలు 95 శాతం తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)