చదువు 7వ తరగతి.. వయసు 12 ఏళ్లు.. జీతం 25 వేలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం: తెలుగు బాలుడి రికార్డు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఓ 12 ఏళ్ల తెలుగు బాలుడు ఏడో తరగతి చదువుతూనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ విద్యార్థి వారంలో మూడు రోజులు మాత్రమే స్కూలుకు వెళ్లి పాఠాలు వింటాడు. మరో మూడు రోజులు సాఫ్ట్‌వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు.
చిన్నప్పిటి నుంచే తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. దీంతో ఆసియా ఖండంలోనే అతిచిన్న వయసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రికార్డును సొంతం చేసుకున్నాడని సాక్షి పత్రిక పేర్కొంది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.రాజ్‌కుమార్, ప్రియ దంపతులు హైదరాబాద్‌లోని క్యాప్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్ ఏడో తరగతి చదువుతున్నాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరూ రోజూ ల్యాప్‌టాప్లలో పనిచేస్తుండటాన్ని చిన్నప్పటి నుంచే నిశితంగా గమనిస్తూ వస్తున్నాడు. దీంతో ఏడేళ్ల వయసులోనే అతడిలో కోడింగ్, జావా తదితర సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి పెరిగింది.
అతడిలోని టాలెంట్‌ను గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికి వస్తాడని భావించటంతో శరత్ పలు ఐటీ సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.
ఈ క్రమంలో ఇటీవల మాంటైగ్నే సంస్థలో నెలకు రూ. 25 వేల జీతంతో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం లభించింది. తల్లిదండ్రులతో పాటు తనను కలిసిన శరత్‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
ఫొటో సోర్స్, @RachakondaCop
రాచకొండ పోలీసు కమిషనర్‌గా 17 ఏళ్ల అమ్మాయి
రాచకొండ పోలీసు కమిషనర్‌గా ఓ 17 ఏళ్ల అమ్మాయి ఒక రోజు విధులు నిర్వహించిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్‌కు చెందిన రమ్య (17) అనే అమ్మాయి మేడ్చల్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ (ఎంపీసీ) చదువుతోంది. రమ్య చాలా తెలివైన అమ్మాయి. చదువులో ఎప్పటికీ ఫస్టే.
ఈ అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బ్లడ్ క్యాన్సర్ (ల్యూకేమియా) బారిన పడింది. నిమ్స్‌లోని ఆంకాలజీ డాక్టర్ ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. రమ్య పరిస్థితి దినదనం బలహీనమవుతోంది.
రమ్యకు జీవితంలో పోలీసు ఆఫీసర్‌గా అవ్వాలని కోరిక ఉండేది. దీంతో ఈ విషయాన్ని రమ్య తల్లిదండ్రులు నరసింహ, పద్మ.. మేక్ ఏ విష్ ఫౌండేషన్‌ను సంప్రదించి, తమ కూతురి కోరికను తెలిపారు. ఫౌండేషన్ నిర్వాహకులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కలిసి విషయాన్ని తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహించే సీపీ.. రమ్య కోరికను నెరవేర్చారు. రమ్య పోలీసు యూనిఫాం ధరించి రాచకొండ పోలీసు కమిషనర్‌గా విధులు చేపట్టారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు, 5ఎస్ ఇంప్లిమెంట్ చేయడం, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్తను ప్రోత్సహిచడం లాంటివి తన విధిలో నిర్వహించింది.
మహిళలకు పూర్తి రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్‌ను విస్తరించాలని ఆమె పోలీసు అధికారులకు విన్నవించింది. పెట్రోలింగ్ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆమె కోరారు. ఒక రోజు పూర్తిగా ఆమె సీపీ సీట్లో కూర్చొని, విధులు సక్రమంగా నిర్వహించింది.
రాచకొండ సీపీగా సామాన్యులు, ముఖ్యంగా చిన్నారులు ఒక్క రోజు భాద్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. 2017లో చిన్నారి బాలుడు ఎహ్‌సాన్ ఒక రోజు పోలీసు కమిషనర్‌గా భాద్యతలు నిర్వర్తించాడు. ఆ చిన్నారి కూడా ప్రాణాంతక వ్యాధితో భాదపడ్డాడు.
మేకవన్నె మామలు.. తోడేలు తాతయ్యాలు... నిందితులంతా చిన్నారి బాధితులకు తెలిసినవారే...
చాక్లెట్ ఇస్తాను.. ఐస్‌క్రీం పెట్టిస్తాను.. రమ్మని పిలిచే తాతయ్యో.. మామయ్యో.. ఈ వరుసలను అడ్డుపెట్టుకుని చిన్నారులను చిదిమేస్తున్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలపై జరిగిన అత్యాచార కేసుల్లో దాదాపు నిందితులంతా బాధితులకు దగ్గరివారే. బంధువులు, కుటుంబ స్నేహితులు, ఇరుగు పొరుగులు.. ఇలా పలురూపాల్లో కాలనాగులై కాటేస్తున్నారు.
2017లో ఏపీలో 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు సంబంధించి పోక్సో చట్టం కింద 183 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిలోనూ నిందితులు బాధితులకు తెలిసినవారు.
కొందరు తమ వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు హత్యలూ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వారూ అత్యాచారాలు చేస్తున్నారు.
మహిళలపై జరిగే అత్యాచార కేసుల్లోనూ ఇదే తీరు. 2017లో 988 అత్యాచార కేసులు నమోదవగా.. వాటిల్లో 934 కేసుల్లో (94.53 శాతం) నిందితులు.. బాధితులకు పరిచయస్తులే.
సగానికి పైగా కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారే ఉన్నారు. మొత్తం కేసుల్లో కేవలం 54 కేసుల్లోనే నిందితులు.. బాధితులకు తెలియనివారు.
తెలిసినవారెవరైనా.. ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ప్రవర్తనలో తేడాలు, తాకడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి దూరంగా ఉండాలని.. మొదటే కుటుంబ సభ్యులకు చెప్పాలని విజయవాడలోని వాసవ్వ మహిళామండలి అధ్యక్షురాలు కీర్తి సూచించారు.
‘‘సహోద్యోగులు తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలి. పిల్లలను ఎవరితో ఒంటరిగా వదలకుండా జాగ్రత్తపడాలి’’ అని ఆమె అప్రమత్తంగా ఉండటం గురించి వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
''ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ వరకూ ఉచిత నిర్బంధ విద్య''
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో అభ్యసన అంతరాన్ని తగ్గించేందుకు, రాత, పఠనా సామర్థ్యాలను పెంచేందుకు 'అక్షర యజ్ఞం' పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని విద్యారంగ సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ కీలక సూచన చేసినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్రతి పంచాయతీలోనూ పూర్తి సదుపాయాలతో ప్రైమరీ స్కూలును ఏర్పాటు చేయాలని.. ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టాలని, హైస్కూల్ స్థాయిలో ఏ విద్యార్థీ మధ్యలోనే చదువు ఆపేయకుండా(డ్రాపౌట్) తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో సీఎం జగన్‌ని కలిసి.. నివేదికను అందించింది. కమిటీ పేర్కొన్న అంశాలు..
ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను వెంటనే చక్కదిద్దాలి. డిజిటల్ ఎడ్యుకేషన్‌పై భారీగా ఖర్చు చేయాలి.
అమ్మఒడి, విద్యా నవరత్నాల కార్యక్రమాలు బాగున్నాయి. అయితే, వీటిని అర్హులకు పూర్తిగా అందేలా చూడాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పారదర్శకత లేదు.
ఎనిమిదో తరగతి నుంచి వృత్తి విద్య ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నందున.. టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇంటర్మీడియెట్ వరకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాలి.
అన్ని హైస్కూళ్లను జూనియర్ కాలేజీల వరకు అప్‌గ్రేడ్ చేయాలి. ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్ బోర్డులను కలిపి ఒకే కమిషనరేట్ పరిధిలోకి తేవాలి. అన్ని స్కూళ్లలోనూ ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్ ఉండాలి.
వచ్చే ఐదేళ్ల లక్ష్యాలు 6 నుంచి 16 ఏళ్లలోపు వారికి విద్యను అందించే ఏర్పాటు చేయాలి. హైస్కూలు స్థాయిలో ఏ విద్యార్థీ మధ్యలోనే స్కూల్ మానకుండా పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులు పదో తరగతి వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌఖిక, డిజిటల్ సదుపాయాలు ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- బగ్దాదీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అంతం చేసిన అమెరికన్ సీక్రెట్ ఆపరేషన్
- కాస్మటిక్ సర్జరీ ఫెయిల్... 97 లక్షల పరిహారం చెల్లించకుండా డాక్టర్ పరార్
- ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఎందుకు దొరకడం లేదు? ప్రభుత్వం ఏమంటోంది?
- కశ్మీర్లో 27 మంది యూరప్ ఎంపీల పర్యటనపై మోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల ప్రశ్నలు
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)