వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో సందేశాల మీద పర్యవేక్షణ, జోక్యం, వాటి మూలాలను తెలుసుకోవటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగదారులు, వ్యక్తిగత గోప్యత ఉద్యమకారులతో పాటు ఆయా సోషల్ మీడియా వేదికల మీద నడిచే సంస్థలకు చెందినవారు ఈ ప్రయత్నాలను ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడితే వాటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ప్రశాంతో కె. రాయ్ విశ్లేషణ:

భారత సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ.. మధ్యశ్రేణి సోషల్ మీడియా వేదికల మీద 2020 జనవరి నాటికి కొత్త నియమవాళిని ప్రచురిస్తుంది.

సందేశాలను పంపించుకోవటానికి, షేర్ చేసుకోవటానికి ప్రజలకు వీలు కల్పించే వేదికలివి. ఈ శ్రేణిలో ఈ-కామర్స్ రంగం సహా అనేక రకాల యాప్‌లు, వెబ్‌సైట్లు కూడా ఉంటాయి.

మూక హింసకు, హత్యలకు దారితీసిన ఫేక్ న్యూస్ విస్ఫోటనానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ చర్య చేపడుతోంది. వాట్సాప్ తదితర వేదికల్లో పిల్లలను కిడ్నాప్ చేసేవారు వస్తున్నారన్న వదంతులు అధికంగా, తరచూ వ్యాప్తి చెందుతున్నాయి. ఎటువంటి వాస్తవ ప్రాతిపదిక లేని ఆ మెసేజ్‌ల వల్ల అమాయకులు, సాధారణ పౌరులు అనేక మంది మూక దాడుల్లో చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇటువంటి వదంతులతో కూడిన సందేశాలను 'ఫార్వర్డ్' చేస్తుండటంతో కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి వ్యాపిస్తున్నాయి. ఒకసారి అవి అలా వ్యాపించిన తర్వాత వాటిని తిప్పికొట్టటం దాదాపు అసాధ్యంగా మారుతోంది.

2018లో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే ఇటువంటి వదంతులను నమ్మవద్దంటూ గ్రామాలకు వెళ్లి లౌడ్‌స్పీకర్‌లో స్థానికులకు చాటి చెప్పటానికి ప్రభుత్వ అధికారులు నియమించిన ఒక వ్యక్తి కూడా అదే మూక దాడులకు బలయ్యాడు.

భారతదేశంలో గత రెండేళ్లలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన తప్పుడు సమాచారం వల్ల మూక దాడులు జరిగిన కేసులు 50 కన్నా ఎక్కువే నమోదయ్యాయి.

ఇందులో ఫేస్‌బుక్, యూట్యూబ్, షేర్‌చాట్ వంటి అనేక సోషల్ మీడియా వేదికల పాత్ర ఉంది.

అయితే.. వీటన్నిటికన్నా అత్యధిక ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా వేదిక వాట్సాప్. దీని యజమాని ఫేస్‌బుక్. వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులు ఉంటే, ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీనివల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి విషయంలో ప్రధానంగా వాట్సాప్ మీదే దృష్టి కేంద్రీకృతమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

వదంతుల కారణంగా 2018లో మూక దాడులు తీవ్రంగా పెరగటంతో.. వాట్సాప్‌లో ''బాధ్యతారాహిత్యమైన, విస్ఫోటదాయకమైన సందేశాల'' వ్యాప్తిని నిరోధించటానికి సాయం చేయాలని ప్రభుత్వం ఆ సంస్థను కోరింది.

ఆ సంస్థ కొన్ని చర్యలు చేపట్టింది. ఒక మెసేజ్‌ను ఒకసారి ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేసేలా పరిమితి విధించింది. అలాగే, అటువంటి మెసేజ్‌లకు 'ఫార్వర్డెడ్' అనే ట్యాగ్ కూడా చేర్చింది.

కానీ, ఇది సరిపోదని ప్రభుత్వం పేర్కొంది. చైనా తరహాలో మెసేజీలను పర్యవేక్షించటానికి ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించటం ద్వారా నిర్దిష్ట మెసేజీలను వాట్సాప్ అడ్డుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. అటువంటి మెసేజీలు లేదా వీడియోలను తొలుత ఎవరు పంపారనేది ఆచూకీ కనిపెట్టి ఫిర్యాదు చేయాలని కూడా కోరుతోంది.

ఈ విషయానికి సంబంధించిన ఒక కేసులో, ''దేశద్రోహం, పోర్నోగ్రఫీ తదితర నేరాలకు సంబంధించిన కేసుల్లో తమ వేదికల మీద సమాచారాన్ని దర్యాప్తు సంస్థల కోసం డీక్రిప్ట్ చేయలేనపుడు... సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో ప్రవేశించటానికి, కొనసాగటానికి తావు లేదు'' అని భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుతో పేర్కొన్నారు.

''చూడండి... మమ్మల్ని ఆపటానికి వాళ్లు (సోషల్ మీడియా సంస్థలు) కోర్టుకు కూడా వెళ్లారు'' అని ఒక ప్రభుత్వ అధికారి నాతో అనధికారికంగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

చైనాలో ఆన్‌లైన్ నిఘా చాలా లోతైనదని, సంపూర్ణంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన చెప్తున్నది నిజమే: ప్రఖ్యాత విచాట్ వేదిక మీద... ఏవైనా నిషిద్ధ పదాలు ఉన్న సందేశాలు అదృశ్యమైపోవటం అందరికీ తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, తను చేపట్టిన చర్యలు పనిచేస్తున్నాయని వాట్సాప్ అంటోంది.

మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడంపై పరిమితులు పెట్టటం, ఫార్వార్డెడ్ అని తెలిసేలా లేబుల్ జతచేయటం వల్ల... తమ వేదిక మీద ఫార్వార్డెడ్ మెసేజీలు 25 శాతం తగ్గాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

భారీ మొత్తంలో మెసేజ్‌లు పంపించటం లేదా ఆటోమేటెడ్ సందేశాలు పంపిస్తున్న కారణాలతో ప్రతి నెలా 20 లక్షల ఖాతాలను నిషేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే, ప్రజలకు అవగాహన కల్పించే భారీ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, అది ఇప్పటికే కోట్లాది మంది భారతీయులను చేరిందని చెప్పారు.

ఇదిలావుంటే, ఏదైనా ఒక మెసేజీని తొలుత ఎవరు పంపించారనే ఆచూకీ కనిపెట్టాలన్న డిమాండ్ల మీద వ్యక్తిగత గోప్యత ఉద్యమకారులు చాలా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హింసకు, హత్యలకు, మరణాలకు కారణమవుతున్న మెసేజీల మూలాలను కనిపెట్టాలన్నది తమ ఉద్దేశమని ప్రభుత్వం చెప్తోంది.. కానీ, ప్రబుత్వం తనను విమర్శించే వారిని వెదికి పట్టుకుంటుందని.. దానివల్ల వాక్‌స్వాతంత్ర్యం మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని ఈ ఉద్యమకారులు భయపడుతున్నారు.

కశ్మీర్ మీద గత ఆగస్టులో నిర్బంధం విధించటం వంటి ప్రభుత్వ చర్యలను విమర్శించే వారి మీద వరుసపెట్టి కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఇది నిర్హేతుకమైన భయం కాదు. ప్రధానమంత్రికి నిరసనగా లేఖ రాసిన వారి మీద కూడా దేశద్రోహం కేసు నమోదు చేయటం ఒక ఉదాహరణ.

''మేం ఉపయోగిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల వాళ్లు (ప్రభుత్వం) కోరుతున్నది ఇప్పుడు సాధ్యం కాదు'' అని వాట్సాప్ కమ్యూనికేషన్స్ విభాగం ప్రపంచ అధిపతి కార్ల్ వూగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

''అది సాధ్యం కావాలంటే వాట్సాప్‌ నిర్మాణాన్ని మేం మేర్చాల్సి ఉంటుంది. దానివల్ల విభిన్నమైన ఉత్పత్తి తయారవుతుంది. అంటే.. అందులో ప్రాథమికంగా వ్యక్తిగత గోప్యత ఉండదు. మీరు పంపించే ప్రతి మెసేజినీ.. మీ ఫోన్ నంబరుతో పాటు ఒక రికార్డులో నమోదు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అది వ్యక్తిగత సమాచార సంబంధాలకు అనువైన వేదిక కాదు'' అని ఆయన వివరించారు.

ఈ వేదికలకు 2011 నుంచి భారత చట్టాలు కొంత సురక్షిత స్థానం అందించాయి. టెలిఫోన్ సంస్థలకు చెందిన ఫోన్ లైన్లలో దాని వినియోగదారులు ఏం మాట్లాడుకున్నారు అనే దానికి ఆ సంస్థలను బాధ్యులను చేయరు. అలాగే.. ఈమెయిల్ సర్వీస్ అందించే సంస్థలను.. వాటి వినియోగదారులు ఒకరికొకరు పంపించుకునే కంటెంట్‌కు బాధ్యులను చేయరు.

అధికారులు కోరినప్పుడు ఫోన్ రికార్డులు అందించటం వంటి చట్ట నిబంధనలకు కట్టుబడి ఉన్నంతవరకూ.. ఆయా సంస్థలకు చట్టపరమైన చర్యల నుంచి రక్షణ లభిస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలు ఈ రక్షణను మరింత కఠినతరం చేస్తుంది.

ప్రతిపాదిత నిబంధనలను పాటిస్తే ఆయా యాప్‌లు లేదా వేదికలు ప్రపంచవ్యాప్తంగా బలహీనమవుతాయి. ఎందుకంటే, వేర్వేరు దేశాలకు వేర్వేరు యాప్‌లు నిర్వహించటం చాలా కష్టమవుతుంది.

ఫొటో సోర్స్, Reuters

అదొక్కటే సమస్య కాదు. భారతదేశంలో 50 లక్షల మందికన్నా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న ఏ వేదిక అయినా భారతదేశంలో స్థానిక కార్యాలయం నెలకొల్పాలని ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తితే ఎవరినైనా బాధ్యులను చేయటం కోసం ఈ నిబంధనలు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే, భారత సాంకేతిక పరిజ్ఞాన చట్టాలు, మధ్యశ్రేణి సంస్థలు అనే దానికి విస్తృత నిర్వచనం ఇస్తున్నాయి. సమాచారాన్ని షేర్ చేసుకునే ఏ వేదిక అయినా ఈ పరిధిలోకి వస్తుంది.

అంటే.. ఇదంతా ఇతర సంస్థలు, వేదికల మీద కూడా ప్రభావం చూపుతుంది: వికీపీడియా ఒక ఉదాహరణ. ప్రతిపాదిత నిబంధనలు చట్టంగా మారితే, వికీపీడియా తన వేదికను భారతీయులకు అందుబాటులో లేకుండా నియంత్రించాల్సి రావచ్చు.

వేగంగా ప్రజాదరణ పొందుతున్న సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ వేదికలు... కొత్త నిబంధనలను పాటించకపోతే ఏం జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ వేదికలు ప్రజలకు అందుబాటులో లేకుండా మూసివేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్లను నిర్దేశించే అవకాశం ఉంది.

నిర్వహణ, ఆచూకీ తెలుసుకోవటం వంటి ఈ వివాదాస్పద నిబంధనల పట్ల వ్యక్తిగత గోప్యత ఉద్యమకారులు కఠిన వైఖరి అవలంబిస్తుంటే.. ఈ వేదికలను మూసివేయటం లేదా తీవ్రంగా అవాంతరాలు కల్పించటం కన్నా ఒక పరిష్కారం కొనుగొనటానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విధాన నిపుణులు చెప్తున్నారు.

''ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు.. వాళ్లందరూ వాట్సాప్ వాడతారు. దానిని మూసివేయాలని ఎవరూ కోరుకోవటం లేదు. వాస్తవమైన, తీవ్ర సమస్యను పరిష్కరించటానికి వాట్సాప్ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మాత్రమే వారు కోరుకుంటున్నారు'' అని ఓ అంతర్జాతీయ టెక్ సంస్థ భారతీయ విధాన విభాగం అధిపతి నాతో పేర్కొన్నారు.

అయితే, ఆ కఠిన చర్యలు ఎలా ఉండాలనే విషయాన్ని చాలా మంది లాగా ఆయన కూడా వివరించలేకపోయారు.

ప్రశాంత్ కె. రాయ్ (@prasanto) సాంకేతిక పరిజ్ఞాన రంగంలో నిపుణుడైన రచయిత

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)