కశ్మీర్‌లో అక్టోబర్ 31 నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయి..

  • రియాజ్ మస్రూర్
  • బీబీసీ న్యూస్, శ్రీనగర్
కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

జమ్ము-కశ్మీర్ అక్టోబర్ 31 నుంచి అధికారికంగా రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది.

ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్ము-కశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాయి.

జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరుగా ఆర్.కె.మాథుర్, ప్రమాణ స్వీకారం చేశారు.

"ఇప్పుడు సహకార సమాఖ్యవాదం అసలైన భాగస్వామ్యం కనిపిస్తుంది. కొత్త జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, కొత్త పాఠశాలలు, కొత్త ఆస్పత్రులు జమ్ము-కశ్మీర్ ప్రజల అభివృద్ధిని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి" అని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అన్నారు.

ఇక నుంచి ఈ రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలు నేరుగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటాయి.

కశ్మీర్ వివాదానికి ముగింపు దొరికేనా?

అరవై అయిదేళ్లుగా జమ్ముకశ్మీర్ పాక్షిక స్వయంప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. అక్కడి ప్రత్యేక చట్టాల వల్ల ఆ రాష్ట్రంలో శాశ్వత నివాస హోదా లేనివారు అక్కడ భూములు, ఆస్తులు కొనే వీలుండేది కాదు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక జెండా కూడా ఉండేది.

జమ్ముకశ్మీర్‌కు రాజ్యాంగపరంగా దక్కిన ఈ ప్రత్యేక హక్కులన్నీ భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన చారిత్రక పొరపాట్లని, ఇవన్నీ జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆటంకాలుగా నిలవడమే కాకుండా భారత సమగ్రతకూ చిక్కులుగా మారాయని, మిగతా భారతీయుల కంటే తాము ప్రత్యేకం అన్న సెంటిమెంటు కశ్మీరీల్లో ఏర్పడడానికి ఇవే కారణమని, ఈ భావనను పాకిస్తాన్ సొమ్ము చేసుకుని భారత్‌పై పరోక్ష యుద్ధానికి ప్రేరేపిస్తోందని మోదీ ప్రభుత్వం నమ్ముతోంది.

దీంతో ఈ ప్రత్యేక హక్కులన్నిటీ రద్దు చేస్తూ ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ పార్లమెంటులో తీర్మానమూ చేసింది.

అయితే, ఈ మార్పులన్నీ కశ్మీర్ సమస్యకు ముగింపు పలకగలవా?

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి

భారత్‌లో ఇంతకుముందు వివిధ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ ఏ రాష్ట్రాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన చరిత్ర లేదు.

మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను విభజించి కొత్త రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను, బిహార్ నుంచి ఝార్ఖండ్‌ను, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించి కొత్త రాష్ట్రాలుగా ఏర్పరిచారు.

ఈ అన్ని సందర్భాల్లోనూ ఆ ప్రాంత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు నిర్ణయం తీసుకుని అక్కడి శాసనసభల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటును మాత్రం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.

''స్థానిక శాసనసభ ఆమోదం లేకుండా ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమనేది ఒక్క జమ్ముకశ్మీర్ విషయంలోనే చూశాం. ఈ విభజన ప్రకారం జనసాంద్రత తక్కువగా ఉండే లద్దాఖ్ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్ముకశ్మీర్ శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. ఈ కొత్త మార్పులు, పేర్లు ప్రజలకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు'' అని శ్రీనగర్ న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది రియాజ్ ఖవార్ అన్నారు.

పాత రాష్ట్రంలోని 420 స్థానిక చట్టాల్లో 136 మాత్రమే ఇకపై మనుగడలో ఉంటాయని ఆయన అన్నారు.

''చట్టాలు దేశమంతా ఒకేలా ఉన్నాయి.. మాకు అంతకంటే మెరుగైన చట్టాలుండేవి. ఇక్కడి వక్ఫ్ చట్టం ప్రకారం ముస్లిం ప్రార్థనా మందిరాల రాబడిలో అందులోని మతబోధకులకు వాటా ఉండదు. కానీ, సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ ప్రకారం ముస్లిం ప్రార్థనా మందిరాల రాబడిలో మతబోధకులకూ వాటా ఇవ్వాలి" అంటూ ఖవార్ జమ్ముకశ్మీర్ స్థానిక చట్టాలకు ఉదాహరణ ఇచ్చారు.

''అక్టోబరు 31కి ముందు ఎలా ఉండేవాళ్లమో ఇకపై అలా ఉండడం సాధ్యం కాదన్నదొక్కటే అర్థమైంది. అంతకుమించి నాకేమీ తెలియదు. కానీ, మేం అవమానానికి గురయ్యామని.. ఇంతవరకు మాకున్న రాజకీయ, చట్టపరమైన అధికారాలు ఇక ఉండవని తెలిసింది'' అని కురాత్ రెహ్బార్ అనే విద్యార్థి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అధికారులేమంటున్నారు?

కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక సుదీర్ఘ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి కనీసం అరడజను కమిషన్లు రద్దయి అందులోని సిబ్బంది ఇతర శాఖల్లో విలీనమయ్యారని జమ్ముకశ్మీర్ అధికారులు 'బీబీసీ'తో అన్నారు.

గత దశాబ్ద కాలంలో స్థానిక అవసరాలరీత్యా తీసుకొచ్చిన 100కి పైగా చట్టాలు రద్దయి వాటి స్థానంలో కేంద్ర చట్టాలు ఇకపై అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఇంతవరకు జమ్ముకశ్మీర్‌కు గవర్నరు ఉండేవారని, ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారని అధికారులు తెలిపారు.

స్థానిక శాసనసభలో సీట్ల సంఖ్య కూడా 89 నుంచి 114కి పెరగబోతుందన్నారు.

స్థానిక అధికారులు ఈ విషయాలపై మాట్లాడేందుకు బాగా భయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా తమ పేరు ఎక్కడా ప్రస్తావించొద్దని కోరుతున్నారు.

'ఇకపై ఇక్కడి అధికారులంతా నామమాత్రమవుతారు.. దిల్లీ కేంద్రంగా పాలన సాగుతుంది. జీతాల్లో కోత, బలవంతపు బదిలీలు వంటివి ఉండవు. కానీ, దశాబ్దాలుగా మేం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నుంచి మమ్మల్ని బయటకు నెట్టేసినట్లుగా ఉంది' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి 'బీబీసీ'తో అన్నారు.

మహిళలు, చిన్నారులకు సంబంధించి భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలు.. ఇటీవల తీసుకొచ్చిన ముస్లిం మహిళల విడాకుల చట్టం వంటివన్నీ ఇకపై జమ్ముకశ్మీర్‌లోనూ వర్తిస్తాయి.

ఆరోగ్య సేవలు, విద్య, విద్యుత్ వంటి రంగాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం రూ.5 వేల కోట్లు వెచ్చించేందుకు అనుమతులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్ విభజన, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు వల్ల స్థానిక సంస్కృతి, జీవనంపై ఎలాంటి ప్రభావం పడబోదని కేంద్రం పదేపదే హామీ ఇస్తోంది. అయితే, ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇకపై జమ్ముకశ్మీర్‌ను దోచుకుంటారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా

కొత్త రాజకీయమా?

జమ్ముకశ్మీర్‌లో అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలే రాజ్యమేలుతున్నాయంటూ, కశ్మీర్‌కు కొత్త రాజకీయం, కొత్త నాయకత్వం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ అంటుంటారు.

ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఇంకా ఎందరో నాయకులను కశ్మీర్‌లో జైళ్లలో, గృహనిర్బంధంలో ఉంచి విభజనపై గళం వినిపించకుండా చేశారు. బీజేపీలో కశ్మీర్ వ్యవహారాలు చూసే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇటీవల శ్రీనగర్‌లో పర్యటిస్తూ జైళ్లలో ఉన్న నాయకుల గురించి మాట్లాడుతూ... ''కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించేవారిని ఉంచడానికి సరిపడా జైళ్లు దేశంలో ఉన్నాయి' అన్నారు.

''రాజకీయ పార్టీలకు మరణం ఉండదు. రాజకీయ పార్టీలకు కష్టకాలమొస్తే భరిస్తాయి. మా అజెండాను దిల్లీ నిర్ణయించడానికి వీల్లేదు. ఇక్కడి ప్రజలు, వారి ఆకాంక్షలే మేం ఎలా రాజకీయాలు చేయాలో నిర్ణయిస్తాయి'' అన్నారు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి తాహిర్ సయీద్. ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగస్ట్ 5 నుంచి నిర్బంధంలో ఉన్నారు.

ఫరూక్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్సులో గత ఏడాది చేరిన ఓ మాజీ న్యాయమూర్తి హస్నయిన్ మసూదీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. బీబీసీతో ఆయన మాట్లాడుతూ 'ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయం అతిపెద్ద రాజ్యాంగ మోసం' అన్నారు.

''ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ముస్లింలే కాదు, ఇతర వర్గాలకు చెందినవారూ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేశారు.

సుప్రీంకోర్టులో ఈ కేసు నవంబరు 14న విచారణకు రానుంది. కానీ, అంతలోనే కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేయడానికి తొందరపడుతోంది'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)