తెలంగాణ ఆర్టీసీ సకల జనభేరి: ‘ప్రభుత్వంలో విలీనం సహా డిమాండ్లన్నీ సాధించేవరకూ పోరాటం ఆగదు’

  • బళ్ల సతీష్, బీబీసీ ప్రతినిధి
  • ఫోటోలు: వలబోజు శివకుమార్
ఆర్టీసీ సకల జన భేరీ

సమ్మె బాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం హైదరాబాద్‌లో సకల జనభేరి పేరుతో సభ నిర్వహించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా తమ డిమాండ్లన్నింటినీ సాధించే వరకూ పోరాటం ఆపబోమని కార్మికులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.

కార్మికులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. సభ జరిగిన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కార్మికులతో నిండిపోయింది.

కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, బీజేపీ నేత వివేక్, ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగ‌తోపాటు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కళాకారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

సభ‌లో మాట్లాడిన వారంతా ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆర్టీసీని విలీనం చేయడం ఎందుకు సాధ్యం కాదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు అన్నీ మేనిఫెస్టోలో పెట్టే తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తామని, అవసరమైతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని కోదండరామ్ హెచ్చరించారు.

‘‘కేసీఆర్ ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకుంటాడు. కానీ, ఆయనకు రాజ్యాంగంపై కూడా అవగాహన లేదు’’ అని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఎల్.రమణ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని అన్యాక్రాంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

కేసీఆర్ అవకాశవాది అని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేత వివేక్ అన్నారు.

సకల జన భేరి సభకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తరలి వచ్చారు. సభలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చాలా సార్లు వినిపించాయి.

సభా ప్రాంగణం సరిపోక పోవడంతో బయట కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు నిలబడిపోయారు. ఆర్టీసీ కార్మికులతో పాటు వామపక్షాల కార్యకర్తలు కూడా సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఆర్టీసీ సమ్మె బుధవారానికి 26 రోజులకు చేరుకుంది. ప్రస్తుతానికి సమ్మె ముగిసే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు.

ప్రభుత్వం, కార్మిక సంఘాలు తమ తమ వాదనలకు కట్టుబడి ఉన్నాయి.

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు.

మరోవైపు, గురువారం అన్ని డిపోల ముందు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)