మాడీ శర్మ: ఈయూ ఎంపీల కశ్మీర్ పర్యటన, మోదీతో భేటీల వెనక ఉన్న మహిళ ఎవరు

  • దిల్‌నవాజ్ పాషా
  • బీబీసీ ప్రతినిధి
మోదీతో మాడీ శర్మ

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్,

మోదీతో మాడీ శర్మ

ఇటీవల కశ్మీర్లో 23మంది యూరోపియన్ యూనియన్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ఓ మహిళ పేరు చర్చకు వచ్చింది.

ఈ బృందం భారత పర్యటనను 'విమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్' అనే ఎన్జీఓను నడుపుతున్న మాడీ శర్మ ఏర్పాటు చేశారు.

భారత సంతతి బ్రిటిష్ పౌరురాలైన మాడీ శర్మ తను గతంలో సమోసాలు అమ్మేదాన్నని, ప్రస్తుతం తన ఎన్జీఓ ద్వారా దక్షిణాఫ్రికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, భారత్‌లతో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్నారు.

ఈయూ సభ్యుల బృందం దిల్లీలో ప్రధాని మోదీని కలిసింది, ఆ తర్వాత కశ్మీర్లో పర్యటించింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పర్యటించిన మొదటి విదేశీ ప్రతినిధి బృందం ఇదే. ఇది మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పర్యటనే అని ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు విమర్శించాయి.

భారత్‌లో పర్యటించాలని ఈయూ ఎంపీలకు పంపిన ఆహ్వానంలో... ఆ పర్యటనలో భారత ప్రధాని మోదీతో కూడా సమావేశం ఉంటుందని మాడీ శర్మ తెలిపారు.

అక్టోబర్ 28న ఈయూ బృందం దిల్లీలో మోదీని కలిసింది. ఈ ఫొటోలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఈయూ ఎంపీలు కశ్మీర్‌లో కూడా పర్యటించారు.

యూరోపియన్ యూనియన్ ఎంపీ క్రిస్ డేవిస్‌కు కూడా ఈ పర్యటనకు సంబంధించిన ఆహ్వానం అందింది. కానీ తాను కశ్మీర్ ప్రజలతో స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పడంతో తనకు పంపించిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నారని క్రిస్ తెలిపారు.

దీనికి సంబంధించి మాడీ శర్మ నుంచి అందిన ఈమెయిల్‌ను క్రిస్ డేవిస్ బీబీసీకి చూపించారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్-అలైన్డ్ స్టడీస్ అనే భారత్‌కు చెందిన ఓ ఎన్జీఓ ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు.

ఈ పర్యటన అధికారికమైంది కాదు.

అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే... ఈయూ బృందం పర్యటన, ప్రధాని మోదీతో భేటీలను ఏర్పాటు చేసిన ఈ మధు శర్మ లేదా మాడీ శర్మ ఎవరు?

ఫొటో సోర్స్, MADISHARMA.ORG

ఫొటో క్యాప్షన్,

మాడీ శర్మ

మాడీ శర్మ ఎవరు?

మాడీ శర్మ అసలు పేరు మధు శర్మ. ఆమె భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరురాలు. అంతేకాదు, యూరోపియన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిటీ (ఈఈఎస్సీ)లో సభ్యురాలు కూడా. ఈఈఎస్సీ ఐరోపా సమాఖ్యకు సలహామండలిగా వ్యవహరిస్తుంది. దీనిలో సామాజిక, ఆర్థిక రంగాలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు.

మాడీ గ్రూప్‌ వ్యవస్థాపకురాలు, పారిశ్రామికవేత్త, అంతర్జాతీయ వక్త, రచయిత, కన్సల్టెంట్, బిజినెస్ బ్రోకర్, ట్రైనర్, ఎక్స్‌పర్ట్‌గా మాడీ శర్మ తనను తాను ఈఈఎస్సీ అఫిడవిట్‌లో పరిచయం చేసుకున్నారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన కేబినెట్ కార్యాలయంలోని మహిళా విభాగం తరపున మాడీను ఈఈఎస్సీకు ప్రతిపాదించారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

"నాకు ఎలాంటి అర్హతలు, నైపుణ్యాలు, డబ్బు లేవు. నేనొక ఒంటరి తల్లిని. గృహహింస బాధితురాలిని. నాపై నాకే విశ్వాసం లేదు, ఇక నేనేం చేయగలను? కానీ నేనొకటి చేయగలను, ఓ వ్యాపారవేత్తను కాగలను. ఇంటిదగ్గరే, వంటింటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించాను. సమోసాలు తయారుచేసి అమ్మడం ప్రారంభించాను. లాభం వచ్చింది. ఆ తర్వాత రెండు సంస్థలు ప్రారంభించి, పని లేనివారికి ఉపాధి కల్పించాను" అని మాడీ శర్మ గతంలో ఓ ప్రసంగంలో తెలిపారు.

ఫొటో సోర్స్, WESTT.EU

ఫొటో క్యాప్షన్,

విమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్

మాడీ శర్మ నిర్వహిస్తున్న ఎన్జీఓ 'విమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్' ఈయూ బృందాన్ని భారత పర్యటనకు తీసుకొచ్చింది. ఈ ఎన్జీఓ 2013 సెప్టెంబరులో ఏర్పాటైందని ఈయూ ట్రాన్స్‌పరెన్సీ ఆఫీసులోని పత్రాలు చెబుతున్నాయి. ఈ సంస్థకు మాడీ శర్మ వ్యవస్థాపకురాలు, దీనిలో పూర్తిస్థాయి ఉద్యోగి ఒకరు, పార్ట్ టైమ్ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారని పత్రాల్లో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల కోసం ఈ సంస్థ పనిచేస్తుందని వాటిలో పేర్కొన్నా, దానికి సంబంధించి వారు నిర్వహించిన పనుల వివరాలు గానీ, ఆధారాలేవీ వారి వెబ్‌సైట్‌లో లేవు.

ఈ సంస్థతో అనుబంధమున్నవారి వివరాలు కూడా ఎక్కడా లేవు. 14 దేశాల్లో వీరికి ప్రతినిధులు ఉన్నట్లుగా సంస్థ చెబుతోంది.

ట్రాన్స్‌పరెన్సీ రిజిస్టర్ అందించిన వివరాల ప్రకారం గత సంవత్సరం వీరి వార్షిక బడ్జెట్ 24 వేల యూరోలు (దాదాపు 19 లక్షల రూపాయలు).

మాడీ శర్మ అధికారిక ప్రొఫైల్ చూసినా... ఆమె దక్షిణాఫ్రికా, ఐరోపా దేశాలు, భారత ప్రభుత్వాలతో పనిచేస్తుందని స్పష్టమవుతోంది.

సంస్థ డాక్యుమెంట్ల ప్రకారం మొత్తం ఐదుగురు ఉద్యోగులుండగా, వారిలో ఒక్కరే పూర్తిస్థాయి ఉద్యోగి.

ఫొటో సోర్స్, IINS.ORG

భారత్‌తో సంబంధాలు ఎలా?

ఈయూ ఎంపీల భారత పర్యటన భారమంతా భారత్‌లోని ఇంటర్నెషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్-అలైడ్ స్టడీస్ (ఐఐఎన్ఎస్) భరిస్తుందని మాడీ శర్మ తన ఆహ్వానంలో పేర్కొన్నారు.

ఐఐఎన్ఎస్ 1980లో ఏర్పడిన ఓ ప్రభుత్వేతర సంస్థ. అయితే దీని నిర్వాహకులు, సభ్యులు ఎవరనేది సంస్థ వెబ్‌సైట్‌లో ఎక్కడా లేదు. దీని వ్యవస్థాపకుడు జర్నలిస్టు గోవింద్ నారాయణ్ శ్రీవాస్తవ.

'న్యూదిల్లీ టైమ్స్' పేరుతో ఓ వారపత్రికను కూడా ఈ సంస్థ విడుదల చేస్తుంది. న్యూదిల్లీటైమ్స్.కామ్ పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. యూరోపియన్ యూనియన్ కరస్పాండెంట్ పేరుతో మాడీ శర్మ దీనిలో వ్యాసాలు రాస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ సంస్థ కార్యాలయానికి మేం చాలా ఫోన్లు చేశాం. కానీ అక్కడ మాట్లాడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. ఈ సంస్థ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది కానీ ఎవరు, ఎంతమంది పనిచేస్తున్నారు అనే విషయాలు మాత్రం ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి చెప్పలేదు.

శ్రీవాస్తవ కుటుంబానికి చెందిన శ్రీవాస్తవ గ్రూప్ దీని నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.

ఫొటో సోర్స్, MADISHARMA.ORG

ఫొటో క్యాప్షన్,

మాడీ శర్మ

వివాదం రేపిన మాల్దీవులు పర్యటన

మాల్డీవులలో గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఈయూ ఎంపీల బృందం ఒకటి అక్కడ పర్యటించింది.

తోమస్ జచోవ్‌స్కీ, మరియా గాబ్రియేలీ జొవానా, రిజార్డ్ జార్నెకీలు సభ్యులుగా కల ఈ బృందంలో ఈయూ సోషల్ కమిటీ అధ్యక్షుడు హెన్సీ మాలోసీ, మాడీ శర్మ కూడా ఉన్నారు. ఈ బృందం అక్కడి ఎన్నికలను పర్యవేక్షించడానికే పర్యటించిందనే ఆరోపణలున్నాయి.

ఈయూ మాసపత్రిక 'ఈపీటుడే'లో మాడీశర్మ తన మాల్డీవుల యాత్ర గురించి ఓ వ్యాసం కూడా రాశారు. దానిలో మాల్డీవులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐరోపా పౌరుల్లో చాలామంది స్వర్గంలా భావించే ఆ దేశం ఓ నియంత చేతుల్లో ఉంది అని రాశారు.

దీనిపై మాల్దీవులు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై వివాదం రేగడంతో, తమ బృందం పర్యటన అనధికారికంగా జరిగిందని, ఎంపీలు తమ వ్యక్తిగత హోదాలో ఈ పర్యటనకు వెళ్లారని ఈయూ వివరణ ఇచ్చింది. అప్పట్లో మాల్దీవుల్లో పర్యటించిన ఇద్దరు ఎంపీలు ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చారు.

ఇప్పుడు కశ్మీర్ పర్యటన కూడా అనధికారికమే అని ఈయూ తెలిపింది.

మరింత సమాచారం కోసం మాడీ శర్మను సంప్రదించడానికి చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ ఆమె నుంచి సమాధానం రాలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)