ఏపీలో 100 చదరపు గజాల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ - ప్రెస్‌రివ్యూ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఫొటో సోర్స్, ANDHRAPRADESH CM/FB

అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న కీలక నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు.

పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కేసుల్లో అభ్యంతరం లేని భూములను పేదల పేరిటే రెగ్యులరైజ్‌ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు గజాల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 100 నుంచి 300 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకుంటే జిల్లా కలెక్టర్‌ నిర్ణయించే ధరల ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు.

దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి 300 చదరపు గజాల వరకు మార్కెట్‌ విలువ ఆధారంగా కలెక్టర్‌ ఇచ్చే సిఫారసు మేరకు రెగ్యులరైజ్‌ చేస్తారు. క్రమబద్ధీకరణ అనంతరం భూమిపై పూర్తి హక్కులు ఇస్తారు. కానీ ఐదేళ్లపాటు లాకింగ్‌ ఉంటుంది.

గతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలు వాటిని మరో పేదకు విక్రయిస్తే దాన్ని కూడా నిబంధనల మేరకు రెగ్యులరైజ్‌ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అలాగే, ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పేద విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకే దీనిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది.

పథకం కింద లబ్ధి పొందేవారికి తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 916

తెలంగాణలో ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 916 ఉండగా, 40 మందిలోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 11,127 (ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత) ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కతేల్చిందని సాక్షి పేర్కొంది.

మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1-15 లోపే విద్యార్థులున్న స్కూళ్లు 3,467 ఉన్నాయి. 16-100 మంది ఉన్నవి 15,535 స్కూళ్లు ఉన్నట్లు లెక్కలు వేసింది. 101-251 విద్యార్థులున్న స్కూళ్లు 4,660 ఉన్నట్లు తెలిపింది. వెయ్యి మందికంటే ఎక్కువ ఉన్న స్కూళ్లు 22గా ఉన్నట్లు వెల్లడించింది.

2019-20 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు నియమించిన స్కావెంజర్లు గౌరవ వేతనం చెల్లింపు కోసం, స్కూల్ గ్రాంట్ విడుదల కోసం ఈ లెక్కలను తేల్చింది.

పాఠశాలలు, వాటిల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సంఖ్యను తేల్చి వారికి చెల్లించాల్సిన గౌరవ వేతనం రూ. 32.46 కోట్లు, విద్యార్థుల సంఖ్య ప్రకారం స్లాబ్‌ల వారీగా స్కూల్ గ్రాంట్ రూ. 23.34 కోట్లను విడుదల చేసిందని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, acbap.gov.in

విశాఖ ఏసీబీ వ్యవహారంపై సీఎం సీరియస్‌

విశాఖ జిల్లా మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారని సాక్షి తెలిపింది.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, తప్పుడు విధానాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది కూడా తేల్చాలని స్పష్టం చేశారు.

ఈ నెల 9న ఏసీబీ డీఎస్పీ, సీఐ, సిబ్బంది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడి జరిపి.. రూ.61,500 నగదు రిటర్న్‌ డాక్యుమెంట్‌ రిజిస్టర్‌లో కనిపించినట్లు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు.

అయితే, ఏసీబీ అధికారులే బయటి నుంచి డబ్బు తెచ్చి డాక్యుమెంట్‌ రిజిస్టర్‌లో పెట్టారని, తాము ఎలాంటి తప్పు చేయకపోయినా కేసు నమోదు చేశారని సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ మంగళవారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

దీంతోపాటు ఆరోజు ఏం జరిగిందనే దానిపై సీసీ కెమెరా ఫుటేజీని సైతం ఆయన సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ తదుపరి చర్యలకు ఆదేశించారని సాక్షి వెల్లడించింది.

ఆస్తి కోసం అమ్మానాన్నల సజీవ దహనం

వృద్ధాప్యంలో అండగా ఉండి, వారు కన్ను మూశాక తలకొరివి పెట్టాల్సిన తనయుడు ఆస్తి కోసం వారిని సజీవ దహనం చేశాడని ఈనాడు తెలిపింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి శివారు భూక్యతండాలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనపై గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

భూక్యతండాకు చెందిన భూక్య దస్రు (70), భూక్య బాజు (65) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆ దంపతులు కష్టపడి సంపాదించుకున్న పదెకరాల వ్యవసాయ భూమిలో రెండెకరాలను తమ జీవనం కోసం ఉంచుకున్నారు. మిగిలిన ఎనిమిది ఎకరాలను కుమారులు భూక్య కేతురాం, భూక్య వీరన్నలకు పంచి ఇచ్చారు.

పెద్ద కుమారుడు కేతురాంకు ఇచ్చిన భూమి సారవంతమైనది, విలువైనది కావడంతో అతడికి పది గుంటలు తగ్గించి, చిన్న కుమారుడు వీరన్నకు పది గుంటల భూమిని అదనంగా పంచారు. నాలుగేళ్ల క్రితం వీరన్న మృతిచెందాడు. వివిధ కారణాలతో తండ్రి దస్రు తన వద్ద ఉన్న రెండు ఎకరాలు, వీరన్నకు చెందిన రెండు ఎకరాల భూమిని విక్రయించగా, దస్రు మూడో కుమార్తె భద్రమ్మ కొనుగోలు చేసింది.

అప్పటి నుంచి పెద్ద కుమారుడు కేతురాం, తల్లిదండ్రులతో తరచూ గొడవలకు దిగుతున్నాడు. సోదరికి భూమిని ఉచితంగానే ఇచ్చేసి... విక్రయించినట్లు చెబుతున్నాడని భావించి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. దీనిపై అయిదేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం తండ్రీకొడుకులిద్దరూ నెక్కొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. గురువారం తండా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు.

వృద్ధ దంపతులు భూక్య దస్రు, భూక్య బాజు ఇంట్లో మంచంపై పడుకోగా పెద్ద కుమారుడు భూక్య కేతురాం, అతడి కుమారుడు భూక్య వెంకన్న అలియాస్‌ వెంకటనాయక్‌ ఇద్దరూ ఆ ఇంటిలోకి వెళ్లారు. వృద్ధ దంపతులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. వారు తప్పించుకునే వీల్లేకుండా బయట తలుపులకు గడియ పెట్టేశారు.

ఇంటిలో నుంచి పొగ, మంటలు రావడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే దంపతులు దస్రు, బాజు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనలో కేతురాం, అతడి కుమారుడు వెంకన్నలకు కూడా శరీరం కాలి... గాయాలయ్యాయని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)