ఆంధ్రప్రదేశ్: నిరాధారమైన ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై కేసులు పెట్టేందుకు అనుమతిస్తూ జీవో జారీ

  • వి. శంకర్
  • బీబీసీ కోసం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఫొటో సోర్స్, ANDHRAPRADESH CM/FB

ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు, టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార, తప్పుడు వార్తలు రాస్తే ఇకపై కేసులు పెడుతారు. దీనికి సంబంధించి జగన్ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది.

2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోలో కొన్ని మార్పులు చేసి ఈ కొత్త జీవోను విడుదల చేశారు.

వైఎస్ హయాంలో జీవో విడుద‌ల అయిన‌ప్ప‌టికీ జ‌ర్న‌లిస్టుల ఒత్తిడితో అది అమ‌లు కాలేదు. దాంతో అట‌కెక్కింద‌ని భావిస్తున్న ఆ జీవోలో స‌వ‌ర‌ణ‌లు చేసి మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకు తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, YSRCONGRESSPARTY/FB

వైఎస్సార్ జీవోలో ఏముంది?

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో ప‌దే ప‌దే ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ వ్యాఖ్యానించేవారు. త‌మ ప్ర‌భుత్వాన్ని అభాసుపాలుజేసేందుకు ఉద్దేశ‌పూర్వ‌క క‌థ‌నాలు రాస్తున్నారంటూ ఆయ‌న బ‌హిరంగంగానే ప‌లుమార్లు విమ‌ర్శించారు. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామంటూ 2007 ఫిబ్ర‌వ‌రం 20వ తేదీన 938వ నంబ‌రుతో జీవో విడుద‌ల చేశారు.

అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురిస్తే సంబంధిత శాఖ‌ల నివేదిక ఆధారంగా మంత్రిగానీ, ముఖ్య‌మంత్రిగానీ ఆదేశిస్తే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించేవారు. స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ స‌మ‌న్వ‌యంతో న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించేవారు.

కానీ, ఆ వ్య‌వ‌హారం జాప్యం అవుతుంద‌నే ఉద్దేశంంతో వైఎస్సార్ ప్ర‌భుత్వం జీఓ నెంబ‌ర్ 938ని జారీ చేసింది. దాని ప్ర‌కారం స‌మాచార శాఖ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అదికారి నేరుగా చ‌ర్య‌ల‌కు పూనుకునే అవ‌కాశం క‌ల్పించారు. పాత విధానం కార‌ణంగా ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న వార్త‌ల‌తో ప్ర‌భుత్వానికి న‌ష్టం జ‌రుగుతుంద‌ని, దానికి భిన్నంగా త‌క్ష‌ణం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌తో పాటు ప‌రువు న‌ష్టం కేసులు దాఖ‌లు చేసేందుకు స‌త్వ‌రం పూనుకోవ‌డం ద్వారా అలాంటి వార్త‌ల‌ను అదుపు చేయ‌గ‌ల‌మ‌ని చెబుతూ నాటి ప్ర‌భుత్వం ఈ జీవో విడుద‌ల చేసింది.

అయితే, జ‌ర్న‌లిస్టు సంఘాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. దుర్వినియోగం జ‌రిగే ప్ర‌మాదం ఉంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. దాంతో చివ‌ర‌కు ఆ జీవో అమ‌లు చేయ‌డానికి నాటి ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసింది. జ‌ర్న‌లిస్టుల అభ్యంతరం నేపథ్యంలో జీవో అమ‌లు చేయ‌డం లేద‌ని అప్ప‌ట్లోనే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌క‌టించారు.

ఫొటో సోర్స్, IANDPR AP

జగ‌న్ ప్ర‌భుత్వం జీవోలో చేసిన మార్పులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా జీవో ఆర్టీ నెంబ‌ర్ 2430 పేరుతో పాత జీవోకి స‌వ‌ర‌ణ‌ల‌తో కొత్త జీవో తీసుకొచ్చింది. జీవో 938 ని ప్ర‌స్తావిస్తూ కొత్త జీవోలో కొత్త నిబంధ‌న‌లు పొందుప‌రిచారు. దాని ప్ర‌కారం ప్రింట్ మీడియాతో పాటుగా ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చే క‌థ‌నాల్లో త‌ప్పుడు స‌మాచారం, నిరాధార క‌థ‌నాలు ఉంటే చ‌ర్య‌లు తీసుకునే అధికారం సంబంధిత శాఖ కార్య‌ద‌ర్శుల‌కు క‌ట్ట‌బెట్టింది.

ఫిర్యాదులు చేయ‌డం, కేసులు పెట్ట‌డం చ‌ర్య‌ల‌కు ఉప్ర‌క‌మించ‌వ‌చ్చ‌ని జీవోలో పేర్కొన్నారు. ఆయా క‌థ‌నాల‌ను పూర్తిగా ప‌రిశీలించి, లోపాలు ఉంటే చ‌ర్య‌ల‌కు పూనుకోవాల‌ని సూచిస్తూ ఈ జీవో విడుద‌ల చేశారు.

ప్ర‌మాణ స్వీకారం రోజే హెచ్చరికలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లోనే వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీడియాను హెచ్చ‌రించారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 వంటి సంస్థ‌ల పేర్ల‌ను కూడా ఆయ‌న అనేక మార్లు ప్ర‌స్తావించారు.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సాగించే ప్ర‌చారంపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. నిరాధారంగా వార్త‌లు రాస్తే స‌హించ‌బోమ‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అవ‌స‌ర‌మైతే ప‌రువు న‌ష్టం కేసులు కూడా వేస్తామ‌ని గ‌తంలోనే ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

ఫొటో సోర్స్, Getty Images

‘పాత్రికేయుల ఉనికే ప్ర‌శ్నార్థ‌కం’

వైఎస్ ప్ర‌భుత్వం జారీ చేసిన 938 జీవోని బూజు దులిపి సంధించిన క‌త్తిలా తాజాగా విడుద‌ల‌యిన జీవో ఉంద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పెద్దాడ నవీన్ వ్యాఖ్యానించారు.

‘‘ఇప్ప‌టికే 11 ఏళ్లు గ‌డిచిపోయాయి. సమాచార సాధ‌నాల ధోర‌ణులు కూడా మారిపోయాయి. పేప‌ర్లు, టీవీలు బ‌హిరంగంగానే రాజ‌కీయ పార్టీల‌కు కొమ్ము కాస్తున్నాయి. పాత్రికేయ గౌర‌వం కాక‌, డ‌బ్బు సంపాద‌న‌, పాల‌కుల వ‌ద్ద ప‌లుకుబ‌డికో, ప్రాప‌కానికో పాకులాడే యాజ‌మాన్యాల‌ను హ్యాండిల్ చేసే విద్య చంద్ర‌బాబుతో వ్య‌వ‌స్థీకృతం కాగా, జ‌గ‌న్ హ‌యంలో అది జైలుకి కూడా పంప‌గ‌ల చ‌ట్ట‌మై కూర్చుంది’’ అని ఆయన చెప్పారు.

ఇప్ప‌టికే జర్నలిస్టులకు గౌరవ‌, మ‌ర్యాద‌లు లేకుండా పోయాయి, ఇప్పుడు ఉనికే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది అని నవీన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

జ‌ర్న‌లిస్టు సంఘాల ఆందోళ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల జ‌ర్న‌లిస్ట్ సంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీయూడ‌బ్లూజే ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు. ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాల‌ని ఏపీడ‌బ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్ వెంక‌ట్రావు డిమాండ్ చేశారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మీడియాను నియంత్రించ‌డానికి, కేసుల పేరుతో వేధించ‌డానికి ఈ జీవో ఆస్కారం ఇస్తుంది. ఇది ప్ర‌జాస్వామ్యంలో భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ఆటంకం అవుతుంది. నిర్భీతిగా క‌థ‌నాలు రాయ‌గ‌లిగే ప‌రిస్థితి ఉంటేనే ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లుతుంది. దానికి భిన్నంగా చీటికిమాటికీ కేసుల‌తో వేధించే అవ‌కాశం క‌ల్పించ‌డం సెన్సార్ షిప్ తో స‌మాన‌మే. ఇలాంటి చ‌ర్య‌ల‌ను అంద‌రూ ఖండించాలి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేసి గ‌తంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాదిరిగానే ఈ జీవోపై నిర్ణ‌యం తీసుకోవాలి. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా మీడియాని నియంత్రించాల‌నే ఆలోచ‌న శ్రేయ‌స్క‌రం కాదు’’ అని పేర్కొన్నారు.

ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌ను కాల‌రాచేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. తాజా జీవో ప‌ట్ల ఆయ‌న స్పందించారు.

''ప్రశ్నించడం, విమర్శించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ప్రజా గొంతుకను నొక్కేయడానికే వైసీపీ పార్టీ కొత్త జీవో అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన మీడియ సంస్థలపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టే ఆస్కారాన్ని కల్పించారు. ఈ జీవోని రద్దు చేసే వరకూ అవసరమైతే మేము రోడ్లెక్కి నిరసనలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము'' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, PERNINANI/FB

ఫొటో క్యాప్షన్,

ఆంధ్రప్రదేశ్ స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని

త‌ప్పుడు క‌థ‌నాలు నియంత్రించ‌డానికే..

మీడియా క‌థ‌నాల‌పై చ‌ర్య‌లు తీసుకునే అధికారం సంబంధిత శాఖా కార్య‌ద‌ర్శుల‌కు అప్ప‌గించ‌డం వెనుక అస‌లు ల‌క్ష్యం త‌ప్పుడు క‌థ‌నాలు నియంత్రించ‌డ‌మేనంటున్నారు ఏపీ స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని.

‘‘కొంద‌రు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నారు. ప్రింట్, ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియాలో అలాంటి వాటికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే ఈ జీవో విడుద‌ల చేశాం. ప్ర‌భుత్వానికి సంబంధించిన స‌మాచారం ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డం. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావ‌డం ప‌ట్ల అభ్యంత‌రం లేదు. గ‌తంలో కూడా వైఎస్సార్ విడుద‌ల చేసిన జీవో ర‌ద్దు చేయ‌లేదు. అందుకే ఈ జీవోలో పేర్కొన్న విధంగానే సంబంధిత శాఖా కార్య‌ద‌ర్శుల‌కు ఈ వార్తా క‌థ‌నాల‌ను ప‌రిశీలించి, అవాస్త‌వాల‌యితే చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాం’’ అంటూ వివ‌రించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)