వాట్సాప్ అకౌంట్స్ హ్యాకింగ్: భారత జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తల మెసేజ్‌లపై నిఘా

  • 1 నవంబర్ 2019
వాట్సాప్ ద్వారా భారత జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్లపై నిఘా Image copyright Getty Images

మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెబుతున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ తయారీ స్పైవేర్ ప్రపంచవ్యాప్తంగా 1400 మందిని లక్ష్యంగా చేసుకుంది.

వీరిలో భారత జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఉన్నారు.

స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారిలో భీమా కోరెగావ్ కేసులో చాలా మంది నిందితుల తరఫున పోరాడుతున్న మానవ హక్కుల న్యాయవాది నిహాల్ సింగ్ రాథోడ్ కూడా ఉన్నారు.

Image copyright NIHALSING RATHOD

లక్ష్యంగా మారిన వారిలో ఆయనతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు బేలా భాటియా, లాయర్ దిగ్రీ ప్రసాద్ చౌహాన్, ఆనంద్ తెల్తుంబ్డే లాంటి సామాజిక కార్యకర్తలు, జర్నలిస్ట్ సిద్ధాంత్ సిబల్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు.

రచయిత ప్రొఫెసర్, ఆనంద్ తెల్తుంబ్డే, నాగపూర్ మానవ హక్కుల కార్యకర్త నిహాల్ సింగ్ రాథోడ్‌లు కూడా తమపై నిఘా పెట్టారని చెబుతున్నారు.

వాట్సాప్‌లో భారత పౌరుల గోప్యత ఉల్లంఘనపై ప్రభుత్వం ఆందోళనగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయులందరి గోప్యతను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ఏప్రిల్, మే నెలల్లో ఫోన్లు పాడయ్యేలా జరిగిన సైబర్ దాడుల వెనుక ఎన్ఎస్ఓ గ్రూపే కారణం అని ఆరోపించిన వాట్సాప్ బుధవారం ఆ సంస్థపై కేసు వేసింది. అయితే, నిఘా కోసం స్పైవేర్ తయారు చేసే ఆ సంస్థ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

Image copyright Getty Images

వాట్సాప్ అతిపెద్ద మార్కెట్ భారత్

భారత్‌లో వాట్సాప్‌కు 40 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఫలితంగా భారత్‌ దానికి అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.

చాలా బలహీనంగా ఉండే ఒక మెసేజింగ్ యాప్ ఉపయోగించి హాకర్స్ ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లు, ఇతర పరికరాల్లో ఇన్‌స్టాల్ చేయగలుగుతున్నారు.

వాట్సాప్ ఒక ప్రకటనలో ఈ దాడిలో కనీసం సివిల్ సొసైటీలోని 100 మంది సభ్యులను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు అని తెలిపింది.

మేలో సైబర్ అటాక్స్ జరిగినట్లు గుర్తించిన వాట్సాప్, ఆ లోపాలను సరిచేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంది. తమ సిస్టమ్స్‌కు కొత్త రక్షణను, అప్ డేట్స్ జారీ చేసింది.

టోరంటోలో ఉన్న ఇంటర్నెట్ వాచ్‌డాగ్ సిటిజన్ ల్యాబ్ సైబర్ నిపుణులు ఈ దాడిలో లక్ష్యాలైన వారిని గుర్తించేందుకు వాట్సాప్‌కు సహకరించారు. దాంతో నిఘా పెట్టిన వారిలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నట్లు తెలిసింది.

వందకు పైగా కేసులను గుర్తించామని చెప్పిన సిటిజన్ ల్యాబ్ "ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో ఆఫ్రికా నుంచి, ఆసియా, యూరప్, పశ్చిమాసియా, ఉత్తర అమెరికా వరకూ ఉన్నాయి" అని చెప్పింది.

Image copyright Getty Images

హ్యాకింగ్ ఎలా జరుగుతుంది?

మెసేజింగ్ యాప్‌లోని సాంకేతికనే ఉపయోగిస్తూ హ్యాకర్లు నిఘా సాఫ్ట్ వేర్‌ను ఫోన్లు, ఇతర డివైసెస్‌లో ఎక్కడి నుంచైనా ఇన్‌స్టాల్ చేయగలుగుతారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో లేదా వాయిస్ కాల్స్ ద్వారా - ఆ కాల్స్‌ను పట్టించుకోకపోయినా సరే - పెగాసస్ అనే స్పై సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిుపోతుంది. ఒక్కసారి ఈ సాఫ్ట్‌వేర్ ఎవరి ఫోన్‌లో అయినా ఇన్‌స్టాల్ అయితే వారి ఫోన్ కాల్స్, మెసేజెస్, ఎక్కడ ఉన్నారనే వివరాలన్నింటినీ ట్రాక్ చేయవచ్చు.

ఆనంద్ తెల్తుంబ్డే వాదన

బీబీసీతో మాట్లాడిన ఆనంద్ తెల్తుంబ్డే తనకు దాదాపు 8 రోజుల క్రితం సిటిజన్ ల్యాబ్ నుంచి ఒక కాల్ వచ్చిందని, మీ ప్రొఫైల్‌పై నిఘా పెట్టారని వారు తనకు చెప్పారని తెలిపారు.

"ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిన ఒక స్పైవేర్ ఉపయోగించి నా ఫోన్‌ను అటాక్ చేశారని వాళ్లు నాకు చెప్పారు. టోరంటోలో ఉన్న ఒక స్నేహితుడితో మాట్లాడి నేను దాన్ని నిర్ధారించుకున్నాను. అది అసలైన సంస్థే అని తను నాకు చెప్పాడు" అన్నారు ఆనంద్.

"ఈ గూఢచర్యం వెనుక ప్రభుత్వం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్ఎస్ఓ కంపెనీ ప్రభుత్వాలకు మాత్రమే సేవలు అందిస్తుంది. ఇలా నాపైన ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు" అని చెప్పారు.

భీమా-కోరెగావ్ హింస కేసులో ఆనంద్ తెల్తుంబ్డేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

Image copyright NIHALSING RATHOD

నిహాల్ సింగ్ రాథోడ్ వాదన

వార్తలు వచ్చిన తర్వాత నీహాల్ సింగ్ రాథోడ్ తనను సిటిజన్ ల్యాబ్ వారు సంప్రదించారని చెప్పారు. వీడియో కాలింగ్ ద్వారా ఆయన ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యిందని తనకు చెప్పారని తెలిపారు.

నిహాల్ సింగ్ బీబీసీతో తనకు గత రెండేళ్ల నుంచి అలాంటి ఫోన్లు వస్తున్నాయని, వాటి గురించి వాట్పాప్‌కు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు.

"నాకు 2017 నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒక ఫోన్ వస్తుంటుంది. కానీ నేను ఎప్పుడు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినా, డిస్కనెక్ట్ అయిపోయేది. నేను వాట్సాప్‌కు కూడా ఫిర్యాదు చేశాను. కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే నేను ఆ నంబర్లను బ్లాక్ చేసేశాను" అన్నారు.

Image copyright Getty Images

సమాధానం కోరిన భారత ప్రభుత్వం

ఈ విషయంలో సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వం వాట్సాప్‌ను కోరిందని పీటీఐ తెలిపింది.

దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మే నెలలో జర్నలిస్టులు, కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్ఎస్ఓ కంపెనీపై కేసు వేయడానికి ముందు మంగళవారం యూజర్స్ దీని గురించి చెప్పారు. ఆ కంపెనీ వాట్సాప్ సర్వర్ల ద్వారా 20 దేశాల్లోని 1400 మంది యూజర్స్ డివైస్‌లలో మాల్‌వేర్ చొప్పించిందని తెలిపారు.

జర్నలిస్ట్ సిద్ధాంత్ సిబల్ ట్విటర్‌లో వాట్సాప్ తనను సంప్రదించిందని చెప్పారు.

"శుభవార్త. వాట్సాప్ హ్యాకింగ్ గురించి సమాచారం ఇచ్చింది. వెంటనే టెక్నికల్-చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. వారు నన్ను సంప్రదించారు. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండే పద్ధతుల గురించి సూచించారు" అని పోస్ట్ చేశారు.

దానితోపాటు ఆయన ఇక్కడ "చెడ్డ వార్త ఏంటంటే, మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే, మీపై నిఘా పెట్టవచ్చు" అన్నారు.

ఇక ఎన్డీటీవీతో మాట్లాడిన బేలా భాటియా "సెప్టెంబర్ చివర్లో నాకు సిటిజన్ ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. వాట్సాప్ తమకు ఒక లిస్ట్ ఇచ్చిందని, అందులో నా పేరు కూడా ఉందని వారు చెప్పారు. ఈ స్పైవేర్‌తో నా ఫోన్‌లోని మొత్తం సమాచారం యాక్సెస్ చేయవచ్చన్నారు. మన ఫోన్ ఏ గదిలో అయినా పెట్టుంటే, అక్కడ జరిగే అన్ని విషయాలనూ ఈ స్పైవేర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. సిటిజన్ ల్యాబ్ నాతో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత వాట్సాప్ నన్ను సంప్రదించింది" అన్నారు.

సిటిజన్ ల్యాబ్ నుంచి నాకు ఫోన్ చేసిన వారు, "మా పరిశోధన, విశ్లేషణ ఆధారంగా, మీ ప్రభుత్వమే ఇదంతా చేసిందని మేం స్పష్టంగా చెప్పగలం అన్నారు" అని కార్యకర్త బేలా తెలిపారు.

Image copyright Getty Images

వాట్సాప్ ప్రకటన

వాట్సాప్ ప్రతినిధి కార్ల్ వూగ్, "భారత జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెడుతున్నారు. నేను వాళ్ల గుర్తింపు బయటపెట్టలేను. కానీ వారి సంఖ్య తక్కువేం కాదని మాత్రం చెప్పగలను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెప్పారు..

కంపెనీ టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరినీ తాము సంప్రదించామని, వారికి సైబర్ అటాక్ గురించి చెప్పామని ఆయన తెలిపారు.

వాట్సాప్ తనను సురక్షితమైన కమ్యూనికేషన్ యాప్ అని చెప్పుకుంది. ఎందుకంటే అక్కడ మెసేజ్ ఎండ్ టు ఎండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే దానిని సందేశం పంపినవారు, అందుకున్న వారి ఫోన్లలో మాత్రమే చూడవచ్చు.

"ఒక ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్రొవైడర్‌ ఇలాంటి చట్టపరమైన చర్యలకు దిగడం ఇదే మొదటిసారి" అని వాట్సాప్ చెప్పింది.

ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ ఆరోపణలపై పోరాటం చేస్తామని చెప్పింది.

కంపెనీ బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో "మేం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా కచ్చితంగా పోరాడతాం" అని చెప్పింది.

కంపెనీ వివరాల ప్రకారం, "ఎన్ఎస్ఓ అన్నది లైసెన్స్ పొందిన ప్రభుత్వ నిఘా ఏజెన్సీ. తీవ్రవాదం, ఇతర తీవ్రమైన నేరాలను అరికట్టేందుకు వీలుగా చట్టాలు అమలు చేసే సంస్థలకు ఇది సాంకేతిక సహకారం అందిస్తుంటుంది."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)