‘ఆ వాట్సాప్ వార్తలు అబద్ధం.. ఆ భూమి నాకు నజరానాగా ఇవ్వలేదు’- ప్రెస్‌ రివ్యూ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌

ఫొటో సోర్స్, chief electoral officer/fb

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌

వాట్సాప్‌లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరించినందుకు ఆయనకు ప్రభుత్వం బహుమతిగా 15.25 ఎకరాల భూమి నజరానాగా ఇచ్చిందంటూ సందేశం చక్కర్లు కొడుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం హేమాజిపూర్‌ గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం ఇచ్చిందంటూ వైరల్‌ మెసేజ్‌లు వ్యాప్తి చెందుతున్నాయంటూ రజత్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ మెసేజ్‌ ఫొటో కాపీ, భూమి కొనుగోలు, అందుకు ప్రభుత్వ అనుమతి పత్రాలను (ఆగస్టు 6, 2014) ఫిర్యాదు కాపీతో జతపరిచారు. తనపై దుష్ప్రచారం జరుపుతూ, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వారిని గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Andhrapradeshcm/fb

నేటి నుంచే.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి (నవంబర్‌ 1 నుంచి) మరో మూడు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయని, రాష్ట్రానికి చెందిన పేదలు శుక్రవారం ఉదయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ నిర్ణయించిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలుగుతోందని సాక్షి వెల్లడించింది.

సుమారు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై గత నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు సొంత రాష్ట్రంలో సరైన వైద్య సేవలు లభించక, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేక రాష్ట్రంలోని వేలాదిమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు.

తాజా జీవోను అనుసరించి.. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారెవరైనా రాష్ట్రంలో గానీ లేదా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గానీ వైద్యసేవలు పొందవచ్చు.

ఇతర రాష్ట్రాల్లో వైద్యసేవలు అందించే విషయంపై ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పకడ్బందీగా అమలు చేస్తామని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్ .ఎ.మల్లికార్జున 'సాక్షి'తో అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో వైద్యసేవలు పొందేవారి సంఖ్య ఇప్పుడే అంచనా వేయలేమని, ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో 1,200 జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్‌కు చోటు

ప్రపంచంలోని సృజనాత్మక నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం దక్కిందని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి రాజధానిని ఎంపిక చేశారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో భారత్ నుంచి రెండు నగరాలను ఎంపికచేయడం విశేషం. హైదరాబాద్ నగరాన్ని ఆహారం (గ్యాస్ట్రోనమీ) విభాగంలో ఎంపికచేయగా, ముంబై నగరం సినిమారంగం నుంచి స్థానం దక్కించుకున్నది.

హైదరాబాద్ నగరాన్ని క్రియేటివ్ సిటీల జాబితాలో చేర్చడంపట్ల పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు.

దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్, ముంబై, లక్నో, శ్రీనగర్ మరో నాలుగు నగరాలు మాత్రమే నామినేట్ కాగా, అందులో హైదరాబాద్, ముంబై నగరాలకే క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించింది. ఈ సందర్భంగా మొత్తం ఏడు విభాగాల్లో క్రియేటివ్ నగరాలను ఎంపికచేశారు.

విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, దేశ, విదేశాలకు చెందిన ఆహార పదార్థాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, రంజాన్ మాసంలో లభించే హలీంతోపాటు దేశంలో మరే ఇతర నగరంలో లభించని విధంగా అనేక తినుబండారాలు నగరంలో లభిస్తున్నాయని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

హెచ్‌ఐవీ రోగుల్లో ఏపీకి రెండోస్థానం

భారత్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండు, తెలంగాణ అయిదో స్థానంలో నిలిచాయని ఈనాడు వెల్లడించింది.

2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఈ మహమ్మారితో బాధపడుతుండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు.

బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2.45 లక్షల మంది రోగులతో మహారాష్ట్ర ముందుంది.

మొత్తం హెచ్‌ఐవీ రోగుల్లో ఏపీలో 14.32శాతం, తెలంగాణలో 6.18 శాతం మంది ఉన్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోని 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్‌లలో 6.04 లక్షల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

దాదాపు 50 శాతం రోగులు ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు. జాతీయ సగటు 0.73 శాతంతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో వ్యాధి విస్తరణ రెట్టింపు స్థాయిలో ఉంది.

అలాగే, ఏపీ, తెలంగాణలో కుష్టు ప్రబలత జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా 0.65 శాతం మేర ఉండగా, ఏపీలో 0.69 శాతం, తెలంగాణలో 0.75 శాతం మేర వ్యాప్తి ఉన్నట్లు తేలిందని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)