తెలంగాణ: పసిబిడ్డను సజీవ సమాధి చేసే ప్రయత్నం... అడ్డుకున్న పోలీసులు

  • 1 నవంబర్ 2019
నవజాత శిశువు
చిత్రం శీర్షిక నవజాత శిశువును పాతిపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు

పోలీసుల జోక్యంతో ఓ పసిగుడ్డు ప్రాణం నిలిచింది. అయిదురోజుల పసికందును సమాధి చేయడానికి కొందరు ప్రయత్నించగా ఓ ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి శిశువును సజీవ సమాధి కాకుండా కాపాడారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్(జేబీఎస్)కు కూతవేటు దూరంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Image copyright ugc

వీడియోలో ఏముంది?

ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఓ శిశువును పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో మధ్య వయస్కుడైన వ్యక్తి దుప్పట్లో శిశువును పట్టుకున్నారు. మరొక వ్యక్తి గొయ్యి తీస్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నారు.

మధ్య వయస్కుడైన వ్యక్తి ఏడుస్తూ, "ఇది నా కొడుకు బిడ్డ. చనిపోయింది. ఆసుపత్రి నుంచి తీసుకొచ్చాం. ఆపరేషన్ విఫలమై మరణించింది. అందుకే శిశువును సమాధి చేస్తున్నాం" అని పోలీసులకు చెబుతున్నారు.

బిడ్డ మరణించిందని చెబుతున్నప్పటికీ ఆ వీడియోలో శిశువు కదలికలు కనిపిస్తున్నాయి.

చిత్రం శీర్షిక శిశువును సమాధి చేసేందుకు తీసిన గొయ్యి

పోలీసుల విచారణలో..

శిశువును సజీవ సమాధికి యత్నించిన వారిని వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారంతా శిశువు బాబాయి, తాత, నానమ్మ అని, కరీంనగర్ జిల్లా సంకెపల్లి గ్రామం నుంచి వచ్చారని తెలిసింది.

ఆ శిశువు శరీరం వెలుపల మూత్రమార్గంతో, లింగనిర్ధారణ సాధ్యంకాని రీతిలో పుట్టడంతో వారు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, కొద్ది రోజుల తర్వాత రావాలని ఆస్పత్రి యాజమాన్యం సూచించింది.

ఇంటికి వెళుతున్న సమయంలో శిశువులో ఎటువంటి కదలికా లేకపోవటంతో చనిపోయినట్లు వారంతా భావించారు. దీంతో జేబీఎస్ సమీపంలో పాతిపెట్టాలని అనుకున్నారు.

Image copyright ugc

'కేసు నమోదు చేయలేదు... విచారణ చేస్తున్నాం'

ప్రాణాలతో బయటపడ్డ శిశువును పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

దీనిపై వెస్ట్ మారేడ్‌పల్లి ఎస్సై శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడారు.

''వారు ఎందుకు సజీవ సమాధి చేయాలనుకున్నారో విచారిస్తున్నాం. ఇంకా కేసు నమోదు చేయలేదు. ఆ బిడ్డ తల్లి కరీంగనగర్ ఆస్పత్రిలో ఉంది. సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. తండ్రి నాలుగు రోజుల కిందట నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును చేర్పించారు. శిశువు చనిపోయిందని వారు సమాధి చేయాలనుకున్నారా లేక వేరే ఏదైనా కారణముందా? అనే కోణంలో విచారిస్తున్నాం'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)