జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు: నవంబర్ 30 నుంచి అయిదు దశల్లో పోలింగ్, డిసెంబర్ 23న ఫలితాలు

  • 1 నవంబర్ 2019
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు Image copyright Ani
చిత్రం శీర్షిక ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా

ఎన్నికల కమిషన్ శుక్రవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది.

మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న, రెండో దశలో 20 స్థానాలకు డిసెంబర్ 7న, మూడో దశలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో దశలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, ఐదో దశలో 16 స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది.

డిసెంబర్ 23న కౌంటింగ్

జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5తో ముగుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో ఇక్కడ బీజేపీకి 37 స్థానాలు వచ్చాయి.

అప్పుడు కూడా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోడానికి మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) ఆరుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేవీఎం ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

దీనితోపాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేయూ) కూడా బీజేపీ కూటమిలో ఉంది. ఈ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

అటు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతోంది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 8 మంది, జేఎంఎంకు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Image copyright Getty Images

లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడో రాష్ట్ర ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ సాధించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మూడో రాష్ట్రం జార్ఖండ్. ఇంతకు ముందు హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన దానికంటే తక్కువ స్థానాలు లభించాయి.

అయినప్పటికీ, హరియాణాలో దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇప్పటికీ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.

ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికలు జరిగే బీజేపీ అధికారంలోని మూడో రాష్ట్రం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)