భారతదేశ కొత్త మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎందుకు చూపించలేదు?

  • 3 నవంబర్ 2019
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ్యాప్ Image copyright Survey General of India

జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ శనివారం సాయంత్రం భారతదేశ నూతన మ్యాప్‌లను విడుదల చేసింది.

జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 రూపంలో ఉన్న స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు ఉపసంహరించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం తెలిసిందే. అలాగే, జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విడిపోయి.. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చాయి.

లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు జిల్లాలు.. కార్గిల్, లేహ్ ఉన్నాయి. పాత జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతం అంతా జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి వచ్చింది.

Image copyright Survey General of India

లద్దాఖ్‌లో పాక్ పాలిత గిల్గిత్

కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 1947వ సంవత్సరంలో జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు.. కథువా, జమ్మూ, ఉదంపూర్, రేయాసి, అనంతనాగ్, బారాముల్లా, పూంచ్, మీర్పూర్, ముజఫరాబాద్, లేహ్, లద్దాఖ్, గిల్గిత్, గిల్గిత్ వజరత్, చిల్హస్‌-గిరిజన ప్రాంతం ఉండేవి.

జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని 28 జిల్లాలు చేసింది. 2019 నాటికి కొత్త జిల్లాలు.. కుప్వారా, బందిపూర్, గన్దెర్బల్, శ్రీనగర్, బుడ్గాం, పుల్వామా, షుపియాన్, కుల్గాం, రాజౌరి, రాంబన్, దోడ, కిష్టివర్, సాంబ, కార్గిల్ కూడా మనుగడలో ఉన్నాయి.

వీటిలో కార్గిల్ జిల్లాను లేహ్, లదాఖ్ జిల్లా నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు.

ఇప్పుడు కార్గిల్ జిల్లా ఏర్పాటు తర్వాత మిగిలిన లేహ్ జిల్లాలో.. గిల్గిత్, గిల్గిత్ వజరత్, చిల్హస్-గిరిజన ప్రాంతాన్ని కూడా కలుపుతున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఈ మేరకు భారతదేశం, జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం మ్యాప్‌లను సర్వే జనరల్ ఆఫ్ ఇండియా తయారు చేశారు.

Image copyright Survey General of India

అమరావతిని రాజధానిగా ఎందుకు చూపలేదు?

కాగా, ఈ మ్యాపుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతిని ఎందుకు చూపించలేదని, దీనికి కారణాలేంటి అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి కేంద్ర హోం శాఖ శనివారం మొత్తం ఐదు మ్యాపుల్ని విడుదల చేసింది.

అందులో ఒకటి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను చూపించే మ్యాప్, వీటినే వేర్వేరుగా చూపించే మరొక రెండు మ్యాపులు.

మరొక రెండు మ్యాపుల్లో మొత్తం భారతదేశాన్ని చూపించారు. ఒక మ్యాప్‌లో కేవలం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధాని నగరాలను మాత్రమే పేర్కొనగా.. మరొక మ్యాప్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి రాజధాని నగరాలు, జిల్లా రాజధానులు, ముఖ్య నగరాలు, రోడ్డు, రైల్వే మార్గాలను కూడా పేర్కొన్నారు.

భారతదేశ పొలిటికల్ 2 మ్యాప్‌ పేరిట కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో ఆరు వివరణల్ని కూడా పేర్కొన్నారు.

ఆ వివరణల్లో రెండు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం గురించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిపాలన హైదరాబాద్ నగరం నుంచే జరుగుతోందని అందులో పేర్కొన్నారు.

Image copyright Survey General of India
Image copyright Survey General of India

అలాగే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులను ఈశాన్య ప్రాంతాల (పునర్‌వ్యవస్థీకరణ) చట్టం 1971ని అనుసరించి పేర్కొన్నామని, అయితే దీనిని ధృవీకరించాల్సి ఉందని వెల్లడించారు.

చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల రాజధాని చండీగఢ్‌లో ఉందని తెలిపారు.

బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్ జిల్లాల పరిపాలన బెంగళూరు నుంచే జరుగుతోందని వివరించారు.

ఈ మ్యాపులో బ్రాకెట్లలో కొన్ని పేర్లను పేర్కొన్నారు. వాటికి అర్థం.. ఆ జిల్లా పేరు, ముఖ్య పట్టణం పేరు వేర్వేరుగా ఉన్నాయని సూచిస్తోంది. ఉదాహరణకు మచిలీపట్నం (క‌ృష్ణా) అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నం అని దీని అర్థం.

అదేవిధంగా.. పన్నెండు నాటికల్ మైళ్ల వరకూ సముద్రంలో భారతదేశ భౌగోళిక జలాలు విస్తరించి ఉన్నాయని, ఈ సరిహద్దును బేస్ లైన్ (ఆధార రేఖ)పై ఆధారపడి కొలిచామని పేర్కొన్నారు.

Image copyright ap.gov.in

రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా..

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5 (1), (2)ల ప్రకారం..

‘కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. పదేళ్లు ముగిసిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుంది.’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం రాష్ట్ర రాజధాని నగరం ‘అమరావతి’ అని పేర్కొన్నారు.

ఈ మధ్యనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని నగరంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు