నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా

  • 6 నవంబర్ 2019
జిన్‌పింగ్ Image copyright RSS

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు వారం క్రితం నేపాల్‌లో పర్యటించారు. ఆ సమయంలో నేపాల్, చైనాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి.

భారత్, చైనాలను కలిపే రహదారి మార్గం నేపాల్‌లో ఉంది. జిన్‌పింగ్ పర్యటన తర్వాత ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది.

కోసీ, గండ్కీ, కర్ణాలీ కారిడార్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు చైనా, నేపాల్ విదేశాంగ కార్యాలయం సంయుక్త ప్రకటనలో పునరుద్ఘాటించాయి.

ప్రస్తుతం కాలీగండ్కీ కారిడార్‌ను నేపాల్ స్వయంగా నిర్మించుకుంటోంది.

తాజా సంయుక్త ప్రకటన తర్వాత భారత్‌తో కలిపే ఇతర రహదారుల నిర్మాణానికి చైనా ఆర్థిక సాయం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా హిమాలయ ప్రాంతంలో రహదారులు, రైల్వేవ్యవస్థ, ఓడ రేవులు, విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం ద్వారా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చైనా అనుకుంటోంది.

బీఆర్ఐ కార్యక్రమంపై ఇప్పటికే నేపాల్ సంతకం చేసింది. ఇందులో మూడు కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అవి కోసీ, కాలీగండ్కీ, కర్ణాలీ కారిడార్లు. వీటిలో చాలా వరకూ రహదారులు మెరుగయ్యాయి.

మిగిలిన ప్రాంతాల్లో అదనపు రహదారులను నిర్మించి నెట్‌వర్క్‌ను విస్తారించాలన్నది లక్ష్యం. ఉన్న రహదారులను వెడల్పు చేసి, రెండు లైన్లుగా మార్చడంపైనా దృష్టిసారించారు.

Image copyright Nepal Army

కోసీ కారిడార్

కోసీ కారిడార్ పొడవు దాదాపు 340 కి.మీ.లు.

ఇది మోరాంగ్‌లోని జోగ్బనీ నుంచి నేపాల్-భారత్ సరిహద్దు వరకు ఉంది. ధమన్, ధన్కుటా, తెహర్థుమ, ఖండ్బాడీ, సాంఖువాసభా ప్రధాన కేంద్రాలను చైనా సరిహద్దుల్లోని కిమథ్నకాతో కలుపుతుంది.

ఈ రహదారిలో 14 కి.మీ.ల మార్గాన్ని ఇంకా తెరవాల్సి ఉందని వాయవ్య నేపాల్ వ్యాపార మార్గాల విస్తరణ కార్యాలయం డైరెక్టర్ శివ నేపాల్ చెప్పారు.

కొండ ప్రాంతం కావడంలో ఇక్కడ రహదారి వేసే బాధ్యతను సైన్యానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Image copyright NSTRIPD, DEPARTMENT OF ROADS

కాలీగండ్కీ కారిడార్

కాలీగండ్కీ కారిడార్ పొడవు సుమారు 435 కి.మీ.లు.

భారత సరిహద్దు ప్రాంతాన్ని నేపాల్‌లోని నవల్పరాసీ, ఉత్తర చైనాలోని కోర్లాలతో ఈ రహదారి కలుపుతుంది.

కాలిగండ్కీ కారిడార్‌లోని రామ్‌డి-రీరి భాగానికి సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలోని మార్గం ఇంకా తెరుచుకోవాల్సి ఉంది.

మిగతా ప్రాంతాల్లో రహదారులను వెడల్పు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కర్ణాలీ కారిడార్

మూడు కారిడర్లలోకెల్లా కర్ణాలీ అత్యంత పొడవైంది.

682 కి.మీ.ల పొడవుండే ఈ కారిడార్ ద్వారా భారత్, చైనాలను అనుసంధానం చేయొచ్చని భావిస్తున్నారు.

ఇందులోని 22 కి.మీ. మార్గాన్ని తెరిచేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో మార్గాల కోసం నేపాల్ సైన్యం, రహదారుల శాఖ పనిచేస్తున్నాయి.

ప్రస్తుతం రహదారుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు శివ నేపాల్ చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మూడు రహదారుల నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

నేపాల్ ద్వారా భారత్, చైనాలను కలిపే ఈ మూడు రహదారుల నెట్‌వర్క్ ఓ వ్యాపార మార్గంలా ఉపయోగపడనుంది. నేపాల్‌లో ఈ ప్రాజెక్టును దేశానికే తలమానికంగా చూస్తున్నారు.

అయితే దీన్ని పూర్తి చేసేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని శివ నేపాల్ అంటున్నారు.

''ఎత్తైన పర్వత ప్రాంతాల గుండా రహదారులు వేయాల్సి వస్తోంది. అక్కడ కార్మికులకు ఆవాసం కల్పించడం సమస్యగా మారింది'' అని ఆయన అన్నారు.

పేలుడు పదార్థాల కొరత కారణంగా గతేడాది వరకూ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తికాలేదని చెప్పారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, నిపుణులైన కార్మికులు మాత్రం పెద్దగా దొరకడం లేదని అన్నారు.

Image copyright Getty Images

నేపాల్‌లో సీనియర్ పాత్రికేయుడు యువరాజ్ ఘిమిరే విశ్లేషణ

అనుసంధానత గురించే మనం మాట్లాడుకుంటే.. ఐదారు పెద్ద రహదారులతో చైనా, నేపాల్‌‌లు కలుస్తాయి.

12-13 ఏళ్ల క్రితం వరకూ నేపాల్‌పై భారత్ ప్రభావం చాలా ఉండేది. కానీ ఇక్కడ రాజకీయ మార్పు మొదలైన తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభమైంది.

అప్పట్లో అమెరికా, యూరోపియన్ యూనియన్‌లకు భారత్ మద్దతుగా ఉండటంతో ఇక్కడ వారి ఉనికి పెరిగింది. రాజకీయంగా ఇది తమకు ముప్పని భావించిన చైనా.. నేపాల్‌లో ఉనికిని పెంచుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టింది.

అందుకే ఇప్పుడు నేపాల్‌లో చైనా ఉనికి చాలా విస్తృతంగా, ప్రభావవంతంగా ఉంది. దీనితో భారత్‌కు ప్రమాదం ఉందా అన్నది అసలు ప్రశ్న.

ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో తమ రెండు దేశాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని చైనా, నేపాల్ అంటున్నాయి. ఇందులో ఉన్న రాజకీయ కోణాన్ని కూడా మనం చూడాలి.

నేపాల్‌లో భారత్ చాలా నష్టపోయిందన్నది నిజం. అందుకు కారణం నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకోవడమే.

భారత్‌లో తీవ్రవాదులని భావించే మావోయిస్టులకు నేపాల్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు సహకారం అందించింది.

ఈ పరిణామంతో సంప్రదాయ మిత్రులుగా భావించే నేపాలీ కాంగ్రెస్, నేపాల్ రాజు భారత్‌కు దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం