‘ప్రసాదం అని చెప్పి సైనేడ్ ఇచ్చేవాడు’.. ఏపీలో పది హత్యలు చేసిన సీరియల్ కిల్లర్‌ ఎలా దొరికాడంటే..

  • 6 నవంబర్ 2019
సింహాద్రి

ఇరవై నెలల వ్యవధిలో పది మందిని హత్య చేసిన ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ప్రకటించారు.

ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివను అదుపులోకి తీసుకున్నామని, రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో అతడు పది హత్యలు చేశాడని వివరించారు.

సింహాద్రి హత్యలు చేసే విధానం గురించి పోలీసులు చెబుతున్న వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా అతడు సైనేడ్ ఉపయోగించేవాడని, దైవప్రసాదం అని చెబుతూ దాన్ని బాధితులతో తినిపించేవాడని పోలీసులు వివరించారు. బాధితుల దగ్గర నుంచి డబ్బు, బంగారం కూడా మాయం చేసేవాడని తెలిపారు.

ఏడాదిన్నరగా సింహాద్రి ఈ హత్యలకు ఒడిగడుతూ వస్తున్నాడని పోలీసులు వివరించారు.

ప్రసాదం పేరుతో సింహాద్రి సైనేడ్ గుళిక ఇవ్వడంతో కొన్ని క్షణాల వ్యవధిలోనే బాధితులు ప్రాణాలు కోల్పోయేవారని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ బీబీసీతో అన్నారు. మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని బాధితుల బంధువులు అనుకునేవారని పేర్కొన్నారు.

''ఎవరికీ అనుమానం రాలేదు. దీంతో హంతకుడికి మరింత చెలరేగే అవకాశం వచ్చింది'' అని అన్నారు.

ఎవరీ సింహాద్రి.. ఎందుకు చేశాడు?

ఏలూరు సమీపంలోని వెంకటాపురం సింహాద్రి స్వగ్రామమని పోలీసులు చెప్పారు.

"జీవితంలో స్థిరపడేందుకు పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా దిగాడు. మరింత డబ్బు సంపాదించాలన్న ఆశతో సింహాద్రి అక్రమ మార్గాలను ఆశ్రయించాడు.

రైస్ పుల్లింగ్, రంగురాళ్లు, గుప్తనిధులు, బంగారం రెట్టింపు, నగదు రెట్టింపు అంటూ అమాయకులను బుట్టలో వేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడు.

గుప్త నిధుల ఆచూకీ చెబుతానని, రైస్ పుల్లింగ్ కాయిన్స్ ఇస్తానని అంటూ సింహాద్రి అమాయకులను నమ్మించేవాడు. వాటి కోసం పూజలు చేయాలంటూ డబ్బు, ఆభరణాలు గుంజేవాడు.

ఒంటరిగా వారిని మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లి, ప్రసాదం అని చెప్పి సైనేడ్ గుళికలు ఇచ్చేవాడు.. వారి వద్ద ఉన్న డబ్బు, బంగారం ఎత్తుకొని వెళ్లేవాడు. ఇలా హత్యలు, మోసాలు చేసి సంపాదించిన డబ్బుతో ఏలూరులో సింహాద్రి ఇల్లు కూడా నిర్మించుకున్నాడు" అని పోలీసులు తెలిపారు.

Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

బాధితులు వీళ్లే..

మొత్తం పది హత్యలనూ సింహాద్రి సైనేడ్ ఉపయోగించే చేశాడని పోలీసులు తెలిపారు.

2018 ఫిబ్రవరి 15న సింహాద్రి మొదటి హత్య చేశాడని.. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వల్లభనేని ఉమామహేశ్వరరావుకు రైస్ పుల్లింగ్ కాయిన్స్ ఇస్తానని చెప్పి, ఓ తోటలోకి ఒంటరిగా తీసుకువెళ్లి చంపాడని వెల్లడించారు. బాధితుడి నుంచి రూ.4 లక్షలు, వెండి ఉంగరం దోచుకున్నాడని తెలిపారు.

అదే నెల 22న విజయవాడ సింగ్ నగర్‌లో నివాసముంటున్న గండికోట వెంకట భాస్కరరావును సింహాద్రి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మబలికి, అతడి వద్ద నుంచి రూ.1.7లక్షలు దోచుకున్నాడని వివరించారు.

ఆ మరుసటి నెల మార్చి 2న కృష్ణా జిల్లా మర్రిబందం గ్రామానికి చెందిన పులుపు తవిటయ్యను ఇదే రీతిలో అంతం చేసి, రూ. 8లక్షల నగదు దోచుకున్నట్లు తెలిపారు.

తొలి మూడు కేసుల్లో బాధితులవి సహజ మరణాలని భావించి వారి బంధువులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అయితే, ఆ తర్వాత సింహాద్రి చేసిన రెండు హత్యలపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

2018 మార్చిలోనే తనకు రూ.2.9 లక్షల అప్పు ఇచ్చిన కడియం బాల వెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా ముస్తాబాద్‌వాసి)ను సింహాద్రి హత్య చేశాడని.. ఆ మరుసటి నెల 14న ఏలూరు వంగాయగూడెంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో గుమస్తాగా ఉన్న చోడవరపు సూర్యనారాయణను పూజల పేరుతో మోసం చేసి, చంపి రూ.5 లక్షలు, రెండు బంగారు ఉంగరాలు కాజేశాడని పోలీసులు వివరించారు. ఈ రెండు ఘటనలపై అనుమానాస్పద మృతులుగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్ 28న తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో రామకృష్ణానంద స్వామీజీ అనే వ్యక్తిని ఆయుర్వేద మందులు కనిపెట్టానంటూ సింహాద్రి హత్య చేశాడని, అతడి దగ్గర ఏమీ దోచుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని వివరించారు.

మళ్లీ దాదాపు ఆరు నెలల తర్వాత తన బంధువులైన ఇద్దరు మహిళలను సింహాద్రి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

2018 డిసెంబర్ 23న రాజమహేంద్రవరంలో కొత్తపల్లి రాఘవమ్మ (నిందితుడికి స్వయంగా బామ్మ)కు మధుమేహ ఔషధమని చెప్పి సింహాద్రి సైనేడ్ ఇచ్చాడని, ఆమె వద్ద నుంచి 3 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై కూడా కేసు నమోదు కాలేదు.

2019 జనవరి 12న తనకు వదినయ్యే సమంతకుర్తి నాగమణి (తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు)ని హత్య చేసి, రూ.5లక్షల నగదు, 20 సవర్ల బంగారం దోచుకున్నాడని.. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

మరో 8 నెలల అనంతరం, గత ఆగస్టులో సింహాద్రి ఏలూరులో తాను అద్దెకున్న ఇంటి యజమాని ఎం.రాములమ్మను చంపి, ఆమె దగ్గరి నుంచి రూ.లక్ష నగదు, 5.75 సవర్ల బంగారం కాజేశాడని వెల్లడించారు. ఈ ఘటనపైనా కేసు నమోదు కాలేదని తెలిపారు.

చివరిగా అక్టోబర్ 16న ఏలూరు శివారులోని వట్లూరులో పదో హత్య చేశాడని, దీని గురించి జరిగిన దర్యాప్తుతోనే సింహాద్రి గుట్టు రట్టైందని పోలీసులు వివరించారు.

కాటి నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడి నుంచి రైస్ పుల్లింగ్ పేరుతో సింహాద్రి డబ్బులు దోచుకున్నాడని, అతడికి సైనేడ్ ఇచ్చాడని తెలిపారు.

అపస్మారక స్థితిలో కనిపించిన నాగరాజును కొందరు ఆసుపత్రిలో చేర్పించారని, చికిత్స పొందుతూ ఆయన మరణించారని పోలీసులు చెప్పారు.

బ్యాంకులో డిపాజిట్ చేస్తానని ఇంట్లో నుంచి నాగరాజు తీసుకువెళ్లిన రూ.2లక్షల నగదు, 4 సవర్ల బంగారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆయన కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు.

ఈ కేసు దర్యాప్తులో సింహాద్రి పాత్ర బయటపడిందని, అతడి పాత నేరాలు కూడా వెలుగు చూశాయని చెప్పారు.

తొలుత తాము ఈ కేసు ఇంత తీవ్రమైందని భావించలేదని ఎస్పీ నవదీప్ సింగ్ బీబీసీతో అన్నారు.

''విచారణలో బయటపడిన విషయాలు పరిశీలిస్తే సింహాద్రి నేరాలు ఎంత పకడ్బందీగా చేసేవాడో తెలిసింది. నాగరాజుది హత్య అని తేలాక, విచారణలో మిగతా హత్యలు ఒక్కోటిగా బయటకు వచ్చాయి. నిందితుడు నేరాలు అంగీకరించాడు'' అని ఆయన చెప్పారు

పూజలు చేయడానికంటూ బాధితులను సింహాద్రి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేవాడని.. సైనేడ్‌ను ప్రసాదం అనో, ఆయుర్వేద ఔషధం అనో చెప్పి బాధితులతో తినిపించేవాడని అన్నారు.

ఎలా దొరికాడు?

నాగరాజు కాల్ డేటా విశ్లేషణలో ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సింహాద్రికి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు తెలిసిందని ఎస్పీ నవదీప్ చెప్పారు.

నాగరాజు చివరి కాల్ కూడా సింహాద్రితోనే మాట్లాడాడని వివరించారు.

‘‘ఘటనా స్థలంలో సెల్ టవర్ సిగ్నల్స్ చూసినప్పుడు సింహాద్రి అక్కడ ఉన్నట్లు తేలింది. సింహాద్రి హత్య చేసిన వారిలో అతడి బంధువులు, స్నేహితులు, అప్పులు ఇచ్చినవాళ్లు, ఇంటి ఓనర్ అమీనుల్లా, మిత్రులు ఉన్నారు. అతడి బారి నుంచి కొందరు బయటపడ్డారు కూడా. స్నేహం చేసి, వ్యక్తుల బలహీనతలు తెలుసుకుని, మోసం చేయడంలో సింహాద్రి సిద్ధహస్తుడు’’ అని నవదీప్ చెప్పారు.

Image copyright Getty Images

సైనేడ్ ఎలా వచ్చింది..

సైనేడ్‌తో సులభంగా ప్రాణం తీయవచ్చని సింహాద్రికి విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా అలియాస్ బాబు అలియాస్ శంకర్ సలహా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

దాన్ని సింహాద్రికి సరఫరా చేసింది కూడా అమీనుల్లానేనని అంటున్నారు. అమీనుల్లా ఇతరులకు కూడా ఇలా సైనేడ్ విక్రయించేవాడని చెప్పారు.

అమీనుల్లా చెన్నై నుంచి సైనేడ్ తెప్పించేవాడని ఈ కేసు విచారణ చేసిన ఏలూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ అనసూరి శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

''చెన్నైలో లైసెన్స్ కలిగిన సైనేడ్ సరఫరాదారుడు ఉన్నారు. తన సోదరుడి ద్వారా అమీనుల్లాకు అతడితో పరిచయం ఏర్పడింది. సోదరుడికి తెలియకుండానే సైనేడ్ తెప్పించుకుని, సింహాద్రికి దాన్ని ఇచ్చేవాడు. అలా అతడు సింహాద్రి నేరాల్లో భాగస్వామి అయ్యాడు. అమీనుల్లాకు ఇదివరకే నేరచరిత్ర ఉంది. అతడిపై పలు కేసులున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలని చూస్తున్న వారికి వల వేసి వంచించడంలో సిద్ధహస్తుడు. అమీనుల్లా, సింహాద్రి లాంటివాళ్లు రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో సామాన్యులను మోసగిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

కాపర్, ఇరీడియం కలిపి తయారుచేసిన కాయిన్లకు బియ్యపు గింజలను ఆకర్షించే గుణం (రైస్ పుల్లింగ్) ఉంటుందని, ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలు వస్తాయని కొందరు అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అలాంటి వారి వలలో పడొద్దని ప్రజలను హెచ్చరించారు. బంగారం, డబ్బు రెండింతలు చేస్తామనేవారిని, గుప్త నిధుల జాడ చెబుతామనేవారిని కూడా నమ్మవద్దని సూచించారు.

ప్రస్తుతం సింహాద్రి, అమీనుల్లా రిమాండ్‌లో ఉన్నారు. వారి నుంచి పోలీసులు కొద్ది మొత్తంలో సైనేడ్, రూ.1.63 లక్షల నగదు, 23 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

‘ముందే స్పందించి ఉంటే.. ఇంతవరకూ వచ్చేదే కాదు’

ఆరంభంలోనే ఈ హత్యలపై పోలీసులు సరిగ్గా నేరపరిశోధన చేసుంటే, ఇన్ని హత్యలు జరిగేవి కాదని సీఐడీ ఇన్‌స్పెక్టర్‌, నాగరాజు సోదరుడు శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

‘‘నిందితుడు చేసిన హత్యల్లో మూడు అనుమానాస్పద మరణాలుగా నమోదయ్యాయి. కానీ సమగ్ర విచారణ జరగలేదు. కేసులు త్వరగా పూర్తి చేయాలనే తొందరలో అసలు నిందితుడిని గుర్తించలేదు. ప్రస్తుత టెక్నాలజీతో ఎలాంటి కేసుల్లో నిందితుడినైనా గుర్తించే అవకాశం ఉంది’’ అని శ్రీనివాసరావు అన్నారు.

‘‘మా సోదరుడిది కూడా మొదట అందరూ సాధారణ మరణమని భావించారు. మృతదేహం రంగు మారింది. ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన నగదు, బంగారం బ్యాంకులో వేయలేదు. పైగా మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదు. చివరకు ఏలూరు పోలీసుల విచారణలో నిజాలు బయటపడ్డాయి. కానీ మా కుటుంబానికి అన్యాయం జరిగింది’’ అని వాపోయారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది.. ప్రజల్లో భయం దేనికి

వీడియో: న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ‘గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లేవు’

సీరియల్ రేపిస్టుకు 33 యావజ్జీవ శిక్షలు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్