భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆన్‌లైన్లో.. మీ దస్తావేజులు మీరే తయారుచేసుకోవడం ఎలా? ఇందులో ఇబ్బందులేంటి?

  • 7 నవంబర్ 2019
దస్తావేజు తయారీ Image copyright igrs.ap.gov.in

ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్స్ విధానంలో మార్పులు వచ్చాయి. వీటి ద్వారా "మీ ద‌స్తావేజులు మీరే త‌యారు చేసుకోవచ్చు" అని ప్రభుత్వం చెబుతోంది.

భూముల క్రయవిక్రయాల కోసం అంద‌రూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతుంటారు. స్టాంపుల కొనుగోలు, ద‌స్తావేజుల త‌యారీ, రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ అన్నింటికీ సుదీర్ఘ స‌మ‌యం ప‌డుతుండడంతో కొంత అస‌హ‌నానికి గుర‌యిన వారు కూడా ఉంటారు.

ముఖ్యంగా ద‌స్తావేజుల త‌యారీ విష‌యంలో అవ‌గాహ‌న లేక‌ చాలా స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కొత్త ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టింది.

ఇంటి ద‌గ్గ‌రే ద‌స్తావేజులు త‌యారు చేసుకుని, మ‌న‌కు వీలైన స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో లో స్లాట్ బుక్ చేసుకుంటే, అరగంట‌లోనే రిజిస్ట్రేష‌న్ పూర్తయ్యేలా కొత్త విధానం అమ‌లులోకి తెచ్చింది.

కానీ, ఇందులో కూడా కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయని రిజిస్ట్రేష‌న్స్‌లో అనుభ‌వం ఉన్న వారు చెబుతుంటే, క్ర‌మంగా వాటిని పరిష్కరించి, దీనిని మరింత సుల‌భ‌త‌రం చేస్తామ‌ని సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు.

సీఏఆర్డీ(CARD) విధానంతో పెద్ద మార్పు..

రిజిస్ట్రార్ ఆఫీసులో వ్య‌వ‌హారాలు ఒక‌ప్పుడు పూర్తిగా కాగితాల మీదే జ‌రిగేది. ఒక ద‌స్తావేజు రాయించుకుని, దాన్ని రిజిస్టర్ చేయించడానికి ఎక్కువ స‌మ‌యం పట్టేది.

కానీ 1999లో అప్ప‌టి ప్ర‌భుత్వం CARD( కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) విధానం అమ‌లులోకి తెచ్చింది. కంప్యూట‌ర్ ఆధారిత రిజిస్ట్రేష‌న్స్ డిపార్ట్ మెంట్ పేరుతో రిజిస్ట్రేష‌న్లను కంప్యూట‌రీక‌ర‌ణ చేశారు. దాంతో ఈ ప్ర‌క్రియ కొంత సులభతరం, వేగవంతం అయ్యింది.

ఈ విధానంతో అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు కూడా కాస్త అడ్డుకట్ట ప‌డింద‌ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ మాజీ అధికారి కె. వెంక‌టేశ్వ రావు చెప్పారు.

ఆయ‌న బీబీసీతో "1999 వ‌ర‌కూ రిజిస్ట్రేష‌న్స్ వ్య‌వ‌హారం చాలా పెద్ద ప్ర‌క్రియ‌గా ఉండేది. రిజిస్ట్రేష‌న్స్ కూడా త‌క్కువ‌గా జ‌రిగేవి. కానీ 2003 నాటికి రియ‌ల్ ఎస్టేట్ బూమ్ రావ‌డంతో భూముల కొనుగోళ్లు, అమ్మ‌కాలు కొన్ని రెట్లు పెరిగాయి. అదే స‌మ‌యంలో సీఏఆర్డీ విధానం వల్ల సిబ్బంది సంఖ్య పెర‌గ‌క‌పోయినా రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌కు ఆటంకం లేకుండా పోయింది. కంప్యూట‌ర్లలో రిజిస్ట్రేష‌న్లు చేయడం స‌ర్వే నెంబ‌ర్లు, మిగతా వివ‌రాల్లో త‌ప్పుల‌కు ఆస్కారం బాగా త‌గ్గింది" అన్నారు.

Image copyright http://www.registration.ap.gov.in/

మీ ద‌స్తావేజు మీరే ఎంట్రీ చేయండి

ఇప్పుడు, ప్ర‌భుత్వం మ‌రో అడుగు ముందుకేస్తోంది. డిజిట‌లైజేష‌న్ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగా ప‌బ్లిక్ డేటా ఎంట్రీ పేరుతో "మీ ద‌స్తావేజులు మీరే త‌యారు చేసుకోండి" అంటోంది.

ఈ ప్రక్రియలో వినియోగ‌దారులు మ‌ధ్య‌వ‌ర్తుల‌పై ఆధార‌ప‌డే అవ‌స‌రం ఉండదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌ డిఐజీ ఎం.శ్రీనివాస‌మూర్తి తెలిపారు.

"ఇప్ప‌టికే బ‌స్సు, రైలు, సినిమా టికెట్ల‌కు చాలామంది ఆన్ లైన్లోనే తీసుకుంటున్నారు. అందుకే రిజిస్ట్రేష‌న్స్ విష‌యంలో అదే విధానం తీసుకురావడం వల్ల, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డంతోపాటు, మధ్యవర్తుల ప్రమేయాన్ని అడ్డుకుని, ద‌స్తావేజుల త‌యారీలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌ తీసుకురావచ్చు"

"ఎవ‌రి ద‌స్తావేజు వారు త‌యారు చేసుకోవడంపై అవ‌గాహ‌న పెరిగితే, ఆన్ లైన్లో అది చాలా సులభం. అంతేకాదు, సొంతంగా ద‌స్తావేజు త‌యారు చేసుకోవ‌డం వ‌ల్ల, ఎక్కడైనా తప్పులు ఉంటే దిద్దుకునే ఆస్కారం ఉంటుంది. అక్షరదోషాలు ఉండవు."

"టైమ్ కూడా మ‌నమే నిర్ణ‌యించుకుని, దానికి అనుగుణంగా ఆన్ లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే, డ‌బ్బుతోపాటు స‌మ‌యం కూడా ఆదా అవుతుంది. అన్నీ స‌క్ర‌మంగా పూర్తి చేసి తీసుకొస్తే ఆఫీసులో సిబ్బంది అర‌గంట‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు" అని శ్రీనివాసమూర్తి వివరించారు.

ద‌స్తావేజు ఎలా త‌యారు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్ట్రేష‌న్ శాఖ వెబ్ సైట్‌లో దీనికి ఏర్పాట్లు చేశారు. http://www.registration.ap.gov.in/లో సైన్ ఇన్ అయితే, ఆ త‌ర్వాత ఆరు ద‌శ‌ల‌లో ఈ ప్ర‌క్రియ పూర్తి చేయచ్చు.

  1. రిజిస్ట్రేష‌న్ చేయించుకునే వారి వివ‌రాలు న‌మోదు చేయాలి.
  2. ఆస్తి షెడ్యూల్ న‌మోదు చేయాలి.
  3. రిజిస్ట్రేషన్‌కు అవ‌స‌ర‌మైన స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఆన్‌లైన్‌లో నగదు చెల్లించవచ్చు
  4. రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్న వారి మ‌ధ్య అంగీకార‌మైన ష‌ర‌తులు, నిబంధ‌న‌లు తెలియ‌జేయాలి.
  5. కంప్యూట‌ర్ ద్వారా ద‌స్తావేజు తీసుకోవాలి. అందులో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునేలా మొదట సాధార‌ణ పేప‌ర్‌పై, తప్పులు సరిదిద్దిన తర్వాత స్టాంప్ పేప‌ర్‌పై ప్రింట్ తీసుకొన‌వ‌చ్చు.
  6. రిజిస్ట్రేష‌న్ కోసం సమయం ఎంచుకుని, ఆన్ లైన్‌లో ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి

తర్వాత రిజిస్ట్రేష‌న్‌కు వెళ్లినప్పుడు, వేచి చూడాల్సిన అవ‌స‌రం లేకుండా నేరుగా ఆఫీసులో వెరిఫికేష‌న్ పూర్తి చేసుకుని, ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో ఆప్ష‌న‌ల్, కానీ త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రలో మాత్రం..

ఎవ‌రి ద‌స్తావేజు వారే రాసుకునే అవ‌కాశం ఏపీతో పాటు, పలు రాష్ట్రాల‌లో అమ‌ల్లో ఉంద‌ని డీఐజీ శ్రీనివాసమూర్తి చెప్పారు.

"ఏపీలో అది ఆప్ష‌న‌ల్‌గా పెడుతున్నాం. మొదట ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం కోసం ఈ అవ‌కాశం కల్పించాం. ఎవ‌రికి వారు దస్తావేజు తయారుచేసుకోవచ్చు. లేదంటే లేఖ‌రుల ద్వారా ద‌స్తావేజు రాయించుకున్నా ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడులో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఎవ‌రి ద‌స్తావేజును వారే సిద్ధం చేసుకోవాలి. డిజిట‌ల్ లిట‌ర‌సీ పెరిగితే తర్వాత ద‌శ‌లో దీనిని త‌ప్ప‌నిస‌రి చేసే అవ‌కాశం ఉంటుంది" అని ఆయ‌న తెలిపారు.

ద‌స్తావేజుల తయారీ అంత స‌ులువు కాదు..

ప్రభుత్వం "మీ ద‌స్తావేజు మీరే త‌యారు చేసుకోండి" అంటున్నా, అదంత సుల‌భం కాద‌ని విజ‌య‌వాడ‌ లేఖ‌రి సీహెచ్ స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి అంటున్నారు.

"నేను 1988 నుంచి ద‌స్తావేజుల లేఖ‌రిగా ఉన్నాను. ఎన్నో మార్పులు చూశాను. ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో పాసైన తర్వాత లేఖ‌రి లైసెన్స్ పొందాను. 2003 త‌ర్వాత ద‌స్తావేజు లేఖ‌ర్ల లైసెన్సులు రెన్యువ‌ల్ చేయ‌లేదు. కానీ చాలామందికి ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాల వ్య‌వ‌హారాలపై పెద్దగా అవ‌గాహ‌న లేదు. దానివల్ల మీ ద‌స్తావేజు మీరే త‌యారు చేసుకోండి అంటే చాలా సమస్యలు రావచ్చు."

"ముఖ్యంగా దస్తావేజుల్లో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఆస్తుల పంప‌కం, దాని ప‌ట్టాగా ల‌భించే భూములు, ఇత‌రుల నుంచి కొనుగోలు చేసే భూములు, త‌న‌ఖా కింద తీసుకునే భూములు లాంటివి చాలా ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కోలా ద‌స్తావేజు ఉంటుంది. కానీ ప్ర‌భుత్వ వెబ్‌ సైట్‌లో కొన్ని న‌మూనాలు పెట్టి, వాటినే అనుస‌రించాలి అంటే చిక్కులు వ‌స్తాయి. మళ్లీ త‌ప్ప‌నిస‌రిగా వాటిపై అవ‌గాహ‌న ఉన్న వారి దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి విధానం వ‌ల్ల లేఖ‌రుల ఉపాధికి పెద్ద‌గా ప్రమాదం ఉంటుందని అనుకోవ‌డం లేదు" అంటూ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Image copyright http://www.registration.ap.gov.in/

న‌వంబ‌ర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ విధానం అమ‌ల్లోకి తీసుకొచ్చారు. అంతకు ముందు అక్టోబ‌ర్ 7 నుంచి విశాఖ‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేశారు.

"ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న లేక‌, ఈ విధానంలో పెద్ద‌గా రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌లేదు. విశాఖ‌, గుంటూరు జిల్లాల్లో కూడా ప్రారంభించిన మొదటి నెలే కావడంతో ఎక్కువ మంది దానివైపు మొగ్గు చూప‌లేదు. కానీ భ‌విష్య‌త్తులో ఎక్కువ మంది డిజిట‌ల్ విధానానికి కచ్చితంగా అల‌వాటుప‌డతారు" అని డీఐజీ శ్రీనివాస‌మూర్తి చెబుతున్నారు.

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి...

రిజిస్ట్రేష‌న్స్ శాఖ‌లో తీసుకొచ్చిన మార్పుల గురించి మ‌రింత ప్ర‌చారం అవ‌స‌రం అని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ఎం. శ్రీరాములు భావిస్తున్నారు.

ఆయ‌న బీబీసీతో " రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇప్పుడు మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయం చాలా ఎక్కువ‌. అవినీతి కూడా ఎక్కువే ఉంటుంది. దీనివల్ల అవి తగ్గుతాయి. కానీ ద‌స్తావేజులు సొంతంగా త‌యారు చేసుకోవ‌చ్చ‌నే విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న లేదు. దీనిపై పెద్ద‌గా ప్ర‌చారం కూడా చేయలేదు. అది జరిగితే చాలామంది ఇంటి దగ్గరే ఈ ప్ర‌క్రియ సొంతంగా పూర్తి చేసుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మే" అన్నారు.

Image copyright Pilli Subhash Chandra Bose/facebook

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

"ఎవ‌రి ద‌స్తావేజు వారే త‌యారీ చేసుకునే విధానం" న‌వంబ‌ర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమ‌ల్లోకి రావడంతో, దానికి అనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌ సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించామని ఆ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ తెలిపారు.

ఆయన బీబీసీతో "భవిష్య‌త్తులో మరిన్ని మార్పులు చేయబోతున్నాం. అవినీతిని త‌గ్గించి, ఈ ప్ర‌క్రియను స‌ర‌ళ‌త‌రం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాం. ఎవ‌రికి వారే రాసుకుని వ‌చ్చిన ద‌స్తావేజులు స‌మ‌గ్రంగా ప‌రిశీలించేందుకు సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చాం. పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్లు చేస్తాం. అంతా ఆన్‌లైన్‌లో అయితే అవ‌క‌త‌వ‌క‌ల‌కు కూడా అవ‌కాశం త‌గ్గిపోతుంది. ప్ర‌జ‌ల‌కు సుల‌భంగా సేవ‌లు అందించ‌గ‌లుగుతాం" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ: హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్

వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి