ఆంధ్రప్రదేశ్: పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో తెలుగు భాషకు ప్రమాదమా

  • 8 నవంబర్ 2019
పలక మీద ఏబీసీడీలు దిద్దుతున్న ఓ బాలిక Image copyright iStock

ఆంధ్రప్ర‌దేశ్‌లోని పాఠ‌శాల విద్యారంగంలో తెలుగు మాధ్య‌మంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో పెద్ద చ‌ర్చ‌ జరుగుతోంది. రాబోయే రెండు సంవ‌త్స‌రాల‌్లో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ పూర్తిగా ఆంగ్ల మాధ్య‌మంలో త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డానికి స‌ర్కారు స‌న్న‌ద్ధం కావాలన్నదే ఈ నిర్ణయం.

దీని కోసం ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యాశాఖ ఈనెల 5వ తేదీన ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 81) విడుద‌ల చేసింది. ఈ జీవో ప్ర‌కారం వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి.. ఒక‌టి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ పూర్తిగా ఆంగ్ల మాధ్య‌మంలో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తారు.

ఆ త‌దుప‌రి 2021-22 నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి, 2022-23 విద్యా సంవ‌త్స‌రంలో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ పూర్తిగా ఆంగ్ల‌ మీడియంలోకి మారుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. దాంతో 2023 త‌ర్వాత రాష్ట్రంలో తెలుగు మీడియంలో పాఠశాల త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ ఉండ‌బోద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

గ‌తంలోనూ ప్ర‌య‌త్నాలు..

ప్ర‌పంచవ్యాప్తంగా మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఇంగ్లిష్ మీడియంలో త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

2008లోనే అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం స‌క్సెస్ స్కూళ్ల పేరుతో తెలుగు మీడియంతో పాటు స‌మాంత‌రంగా ఇంగ్లిష్ మీడియం త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు శ్రీకారం చుట్టింది.

నాడు 6,500 హైస్కూళ్ల‌లో ఆరో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఈ ప్ర‌య‌త్నం ప్రారంభ‌మైంది.

సీబీఎస్ఈ సిల‌బ‌స్‌తో ప్ర‌భుత్వ‌, జిల్లా ప‌రిష‌త్, మునిసిప‌ల్ స్కూళ్ల‌లో దానికి నాంది ప‌లికారు.

ఆ త‌ర్వాత 2010లో సీబీఎస్ఈ స్థానంలో స‌క్సెస్ స్కూళ్ల‌లో రాష్ట్ర సిల‌బ‌స్‌ని అమ‌లు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

2018-19 నుంచి ప్రాథమిక పాఠ‌శాల‌ల్లో కూడా స‌మాంత‌రంగా తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లిష్ మీడియం త‌ర‌గతులు నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

నాటి నుంచి అనేక స్కూళ్ల‌లో రెండు మాధ్య‌మాల‌లోనూ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ సాగుతోంది.

అయితే తాజాగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో ప్ర‌కారం వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి తెలుగు మీడియంలో బోధించడాన్ని పూర్తిగా ఆపేస్తారు.

తెలుగుతో పాటుగా ఏపీలో ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఉర్దూ, త‌మిళ‌, క‌న్న‌డ, ఒడిశా మాధ్యమాల పాఠ‌శాల‌లు కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మార‌వ‌ల‌సి ఉంటుంది.

Image copyright Facebook

అప్పుడు కూడా అభ్యంత‌రాలు..

స‌క్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లిష్ మీడియంలో త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

మాతృభాష‌లోనే ప్రాథమిక విద్య సాగించాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు విద్యారంగ నిపుణులు చెబుతున్న‌ప్ప‌టికీ దానికి భిన్నంగా ఆంగ్ల భాష‌లో బోధ‌న చేస్తారా అనే ప్ర‌శ్న‌లు చాలాకాలంగా ఉన్నాయి.

కానీ, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యారంగంలో ప్రైవేటు విద్యాసంస్థ‌ల సంఖ్య బాగా పెర‌గ‌డం, అదే స‌మ‌యంలో ఇంగ్లిష్ భాష ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ క‌నిపిస్తుండ‌డంతో అనేక మంది ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రాథమిక పాఠ‌శాల‌ల నుంచే పిల్ల‌ల‌ను తెలుగు మీడియం క‌న్నా ఇంగ్లిష్ మీడియంలో చ‌దివించ‌డానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న‌ట్టు ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి.

ఏపీ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ తాజా లెక్క‌ల ప్ర‌కారం.. 13 జిల్లాల్లో ప్ర‌భుత్వ‌, మున్సిప‌ల్, జిల్లా ప‌రిష‌త్, మండ‌ల ప‌రిష‌త్‌ల ఆధ్వ‌ర్యంలో 62,182 పాఠ‌శాల‌లున్నాయి. వాటిలో 69,91,634 మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. 2,86,311 మంది ఉపాధ్యాయులుగా స‌ర్వీసులో ఉన్నారు.

మొత్తం విద్యార్థుల్లో 62.36 శాతం మంది పిల్ల‌లు ఇప్ప‌టికే ఇంగ్లిష్ మీడియం ఎంచుకున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. అందులో ఉన్న‌త పాఠ‌శాల స్థాయిలో ఎక్కువ మంది ఇంగ్లిష్ ఎంచుకుంటుండ‌గా, ఇటీవ‌ల ఒక‌టో త‌ర‌గ‌తి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంద‌ని తెలిపారు.

అర్బ‌న్, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో దాదాపుగా తెలుగు మీడియంలో విద్యార్థులు చేర‌డం లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ‌లో ప‌నిచేస్తున్న ఎం.ర‌ఘురామ్ బీబీసీకి తెలిపారు. తెలుగు మీడియంలో ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, గిరిజ‌న ప్రాంతాల్లోనూ అడ్మిష‌న్లు ఉంటున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌భుత్వం ఏం చెబుతోంది?

పిల్ల‌లంద‌రికీ నాణ్య‌మైన విద్య‌నందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఆంగ్ల మాధ్యమంపై వివాదం నేప‌థ్యంలో బీబీసీ ఆయ‌న్ని సంప్ర‌దించింది.

''అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌న పిల్ల‌లు రాణించ‌డానికి ఇంగ్లిష్ నైపుణ్యం చాలా అవ‌స‌రం. దానిని అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిది. అందుకే ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ మీద శ్ర‌ద్ధ‌పెడుతున్నాం. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి మే నెలాఖ‌రు వ‌ర‌కూ ద‌శ‌ల వారీగా ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ ఏర్పాటు చేస్తున్నాం. ఆంగ్ల‌భాషలో బోధ‌న‌కు 98 వేల మంది ఉపాధ్యాయులు అవ‌స‌రం అవుతారు. ఇప్ప‌టికే దానికి అనుగుణంగా ప‌లువురిని గుర్తించాం. వారికి స‌బ్జెక్టుల వారీగా భాష‌లో ప‌ట్టు సాధించ‌డానికి అనుగుణంగా శిక్ష‌ణ ఇచ్చి మెరుగైన విద్యా బోధ‌న సాగించ‌బోతున్నాం. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికంగా 75శాతం మందికి ఉద్యోగాలు ఇవ్వాల‌ని చ‌ట్టం చేశాం. స్థానికంగా దానికి అనుగుణంగా నాణ్య‌మైన ఉద్యోగార్థులు దొర‌కాలంటే ఇంగ్లిష్ మీడియం అవ‌స‌రం. కొంద‌రు అభ్యంత‌రం పెట్టినా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కార‌మే ముందుకెళ్తాం. తెలుగు భాషను కూడా బోధిస్తాం. మాతృభాష‌ను లేకుండా చేస్తున్నార‌నే వాద‌న‌లో అర్థం లేదు'' అని సురేష్ అన్నారు.

Image copyright Getty Images

'నిర్బంధ ఇంగ్లిష్ మీడియం.. అంద‌రూ వ్య‌తిరేకించాలి'

ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 81 కార‌ణంగా దళిత, గిరిజన విద్యార్థుల‌కే ఎక్కువ న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్సీ, మాజీ అధ్యాప‌కుడు విఠ‌పు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అభిప్రాయ‌ప‌డ్డారు.

''ప్ర‌భుత్వం తెలుగు మీడియం ర‌ద్దు చేయ‌డ‌మే కాదు, నిర్బంధ ఇంగ్లిష్ మీడియాన్ని రుద్దుతోంది. దానిని అంద‌రూ వ్య‌తిరేకించాలి. ఇంగ్లిష్ మీడియం ఆప్ష‌న‌ల్‌గా ఉంటే అభ్యంత‌రం లేదు. ఇప్ప‌టి వరకూ న‌చ్చిన మాధ్యమం వారు ఎంచుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఇంగ్లిష్ మీడియం మాత్ర‌మే కొన‌సాగిస్తామంటే దాని వ‌ల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది. గిరిజ‌న ప్రాంతంలో ముఖ్యంగా గ‌ద‌బ‌, స‌వ‌ర‌, కోయ వంటి జాతుల‌కు వారి స్థానిక భాష‌ల్లో బోధ‌న చేయ‌డానికి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మూడు, నాలుగో త‌ర‌గ‌తి వ‌ర‌కూ వారి సొంత భాష‌లో విద్యాబోధ‌న చేసి, ఆ త‌ర్వాత వారిని తెలుగు మీడియంలోకి మార్చాల‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత నిర్ణ‌యించారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా నేరుగా ఇంగ్లిష్ అంటే వారికి సాధ్యం అవుతుందా? చ‌దువును దూరం చేయ‌డ‌మే అవుతుంది. ఇంగ్లిష్‌ని ఎవ‌రూ వ్య‌తిరేకించ‌డం లేదు. అంద‌రికీ స‌మాన విద్య అందాలంటే కార్పొరేట్ చ‌దువులు క‌ట్ట‌డి చేయాలి. ధ‌నిక‌, పేద అనే తేడా లేకుండా క‌లిసి చ‌దువుకునే విద్యా విధానం తీసుకురావాలి. కానీ ఇంగ్లిష్ పేరుతో దిగువ స్థాయి పిల్ల‌ల‌కు మ‌రింత‌గా విద్య‌ను దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్దు'' అని ఆయ‌న తెలిపారు.

Image copyright Getty Images

'వారి పిల్ల‌ల‌ను ఇంగ్లిష్ మీడియంలో చ‌దివించ‌డం లేదా.. అమెరికాకు పంపించ‌డం లేదా..'

ఇంగ్లిష్ మీడియం ద్వారా స‌మాజంలో పురోభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని సామాజిక విశ్లేష‌కులు క‌త్తి ప‌ద్మారావు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

''పాఠ్య భాష వేరుగా, జీవ‌న భాష వేరుగా ఉంటుంది. ఇంట్లో ఏ భాష‌నైనా మాట్లాడుకోవ‌చ్చు. కానీ ప్ర‌పంచీక‌ర‌ణలో ఇంగ్లిష్ ద్వారానే అనేక రుగ్మ‌త‌ల‌కు ముగింపు జ‌రుగుతుంది. స్వ‌తంత్ర్య‌ పోరాటంలో కూడా ఇంగ్లిష్ తెలిసిన వారే నాయ‌కులు కాగ‌లిగారు. కులం, మ‌తం సంబంధిత అంశాల నుంచి మ‌నిషి ఉన్న‌తంగా ఆలోచించ‌డానికి ప్ర‌పంచ భాష దోహ‌ద‌ప‌డుతుంది. అంబేడ్కర్, మ‌హాత్మ ఫూలే వంటి వారు కూడా ఇంగ్లిష్‌లో బోధ‌న చేయాల‌ని సూచించారు. కానీ కొంద‌రు తెలుగు భాష ప్రేమికుల‌మంటూ చేస్తున్న ఉద్య‌మాల్లో హేతుబ‌ద్ధ‌త లేదు. ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియం గురించి ఒక్క‌రైనా మాట్లాడారా? తెలుగు భాష గురించి మాట్లాడుతున్న వారి పిల్ల‌ల‌ను ఇంగ్లిష్ మీడియంలో చ‌దివించ‌డం లేదా? అమెరికాకు పంపించ‌డం లేదా? అట్ట‌డుగు వ‌ర్గాల‌కు ఆంగ్ల భాష అంద‌కుండా చేయాల‌నే ఆలోచ‌న క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని నేను అభినందిస్తున్నాను'' అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్