రజినీకాంత్: 'నాకు కాషాయ రంగు పులమాలనుకున్నారు... నేను వారి వలలో పడను'

  • 8 నవంబర్ 2019
రజనీకాంత్ Image copyright Getty Images

తనకు కాషాయ రంగు పులమడానికి కొందరు నిరంతరం ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు రజినీకాంత్ అన్నారు.

చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తమిళ ప్రాచీన కవి తిరువళ్లువర్‌ను కాషాయీకరణ చేసినట్లు, నన్ను కూడా బీజేపీ మద్దతుదారుగా చిత్రించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

"తిరువళ్లువర్, నేను ఇద్దరం వారి వలలో చిక్కుకోం'' అని పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఆ పార్టీ వాళ్లెవరూ తనను కోరలేదని రజినీ తెలిపారు.

అయితే, మాజీ మంత్రి రాధాకృష్ణన్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు రజినీకాంత్‌ తమ పార్టీలోకి రావాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు.

2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు చర్యను గతంలో స్వాగతించిన రజినీకాంత్ ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

అయోధ్య తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ఎలాంటి తీర్పు వచ్చినా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.

క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే వరకు నటనను కొనసాగిస్తానని చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో నాయకత్వ శూన్యత ఉందని పేర్కొన్నారు.

నుదిటిపై విభూతి, మెడలో రుద్రాక్ష కనిపించేలా ప్రాచీన కవి తిరువళ్లువర్ ఫొటోను ఇటీవల తమిళనాడు బీజేపీ శాఖ ట్విటర్‌లో పెట్టింది.

తిరువళ్లువర్‌ను హిందూ కవిగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నించిందని దీనిపై పలు రాజకీయ పార్టీలు, సంస్థలు మండిపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు