అయోధ్య తీర్పు: సుప్రీం ధర్మాసనం తుది తీర్పు నేడే

  • 9 నవంబర్ 2019
రంజన్ గొగోయి Image copyright Getty Images
చిత్రం శీర్షిక రంజన్ గొగోయి

అయోధ్యలోని రామమందిరం, బాబ్రీమసీదు స్థల వివాదం కేసుపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువరించనుంది.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ తీర్పు సామాజిక, మత, సాంస్కృతికపరంగా పెను ప్రభావం చూపనుంది.

ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో మీడియా ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఇప్పటికే మార్గదర్శకాలు వెలువడ్డాయి.

సుప్రీంకోర్టు చరిత్రలోనే రెండో సుదీర్ఘ విచారణ

రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తన తీర్పున రిజర్వులో ఉంచింది.

సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం వాదనలు విన్న రెండో కేసు ఇది. కేశవానంద భారతి కేసులో ఏకంగా 68 రోజుల పాటు వాదనలు విన్నారు.

దాని తరువాత రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులోనే సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

ఆధార్ రాజ్యాంగబద్ధతపై కేసులో 38 రోజులు వాదనలు కొనసాగడంతో సుప్రీంకోర్టు చరిత్రలో దానికి మూడో స్థానం దక్కింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సుప్రీం తుది తీర్పు నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తు

న్యాయమూర్తులు వీరే...

అత్యంత సున్నితమైన ఈ కేసులో తుది వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వం వహించారు. ధర్మాసనంలో జస్టిస్‌లు శరద్ అరవింద్ బాబ్డే, అశోక్ భూషణ్, డీవై చంద్రచూడ్, ఎస్.అబ్దుల్ నజీర్ ఉన్నారు.

విశ్రాంత జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానల్ మధ్యవర్తిత్వం విఫలమైన తరువాత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తుది వాదనలు విన్నది.

వారానికి అయిదు రోజుల చొప్పున ఆగస్టు 6 నుంచి రోజువారీ ఈ కేసులో వాదనలు విన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ హైకోర్టు తీర్పులో ఏముంది?

అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రామ్ లల్లా, సున్ని వక్ఫ్ బోర్డ్, నిర్మోహీ అఖాడాలు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో ఈ వివాదం అత్యున్నత న్యాయస్థానంలోకి వచ్చింది.

2010 సెప్టెంబరు 30న అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచిపెట్టింది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో భారీ భద్రత

సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తరువాత ఎలాంటి హింస జరగకుండా కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

అయోధ్యలో వేలాది మంది పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. శుక్రవారమే వందలాది మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

శాంతియుతంగా ఉండండి.. ఎవరూ గెలిచినట్లు, ఓడినట్లేమీ కాదు: ప్రధాని మోదీ

''అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది ఒకరు ఓడినట్లు, ఒకరు గెలిచినట్లు కాదు.

దేశంలో శాంతి, ఐకమత్యం, సద్భావన అనే మన గొప్ప బలం, సంప్రదాయానికి ప్రాధాన్యమివ్వాలని దేశ ప్రజలను కోరుతున్నాను'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే..

''సుప్రీంకోర్టును తీర్పు నేపథ్యంలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నదొక్కటే. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వాలు ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత'' అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది

అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా

అత్యంత ప్రమాదకరమైన 5 పదార్థాలు, వీటిని అలా తింటే రోగాల బారిన పడతారు, చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది

పాకిస్తాన్‌లో ప్రశాంత్.. హైదరాబాద్‌లో ఇక్రమ్

మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు

"ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"

అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది

టీఎస్ఆర్టీసీ సమ్మె: ‘షరతులు లేకుండా ఆహ్వానిస్తే... వచ్చి విధుల్లో చేరతాం’ - జేఏసీ