అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే

  • 9 నవంబర్ 2019
అయోధ్య భూవివాదం కేసు Image copyright Getty Images

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శనివారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. సుదీర్ఘ కాలం విచారణ సాగిన ఈ కేసులో తీర్పు చెప్పనున్న ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో జస్టిస్‌లు శరద్ అరవింద్ బాబ్డే, అశోక్ భూషణ్, డీవై చంద్రచూడ్, ఎస్.అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, భారత ప్రధాన న్యాయమూర్తి

రంజన్ గొగోయ్- భారత ప్రధాన న్యాయమూర్తి

ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేసే లోపు అత్యంత ముఖ్యమైన చాలా కేసుల్లో తీర్పులు ఇచ్చే పనిలో ఉన్నారు.

గొగోయ్ తన పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. వీటిలో బాలీవుడ్ ప్రముఖుడు అమితాబ్ బచ్చన్ ప్రమేయం ఉన్న టాక్స్ అసెస్‌మెంట్, అసోంలోని ఎన్ఆర్సీ(జాతీయ పౌరసత్వ నమోదు) కేసులు ఉన్నాయి. తీర్పులు కాకుండా ఒక సెమినార్‌లో మాట్లాడుతూ ఆయన ఎన్ఆర్సీని 'భవిష్యత్ పత్రం'గా చెబుతూ కనిపించారు.

2012 బాంబే హైకోర్టు ఒక పాపులర్ టీవీ క్విజ్ షో ద్వారా అమితాబ్ బచ్చన్ సంపాదించిన ఆదాయాన్ని తిరిగి అంచనా వేయడానికి ఇన్‌కం టాక్స్ కమిషనర్‌కు ఇచ్చిన అధికారాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2016 మేలో జస్టిస్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ను ఒక దేశద్రోహం కేసులో 2016 ఫిబ్రవరి 15, 17 తేదీల్లో పటియాలా హౌస్ కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు అతడిపై దాడి జరిగింది. దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని కోరుతూ సీనియర్ లాయర్ కామినీ జైశ్వాల్ వేసిన పిటిషన్‌ను 2018లో సీనియర్ జడ్జిగా ఉన్న గొగోయ్ తోసిపుచ్చారు.

పనికిరాని పిల్స్, పిటిషన్లను ప్రోత్సహించని ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్‌కు చాలా పేరుంది. అలాంటి వ్యాజ్యాలతో కోర్టు సమయం వృథా చేసినందుకు ఆయన కొన్నిసార్లు పిటిషనర్లకు భారీ జరిమానాలు కూడా విధించారు.

కానీ ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నప్పుడు ఒక మహిళ తనపై ఆరోపణలు చేయడంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఆ ఆరోపణల్లో నిజం లేదంటూ కొట్టిపారేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే- భారత ప్రధాన న్యాయమూర్తి(కాబోయే)

జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తి

రంజన్ గొగోయ్ తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కూడా ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు. వీటిలో దిల్లీ కాలుష్యం కూడా ఉంది. ఆయన 2013 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చారు. బాబ్డే భారత ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్ వరకూ కొనసాగుతారు.

ఈయన మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ అరవింద్ బాబ్డే తనయుడు. బాంబే హైకోర్టు నుంచి కెరీర్ ప్రారంభించారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఆయనకు 21 ఏళ్లకు పైగా సేవలు అందించారు.

బాబ్డే 2000లో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత రెండేళ్లకే 2012 అక్టోబర్‌లో ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అయ్యారు. గగోయ్ పదవీ విరమణ తర్వాత ఆ పదవిలోకి రాబోతున్న బాబ్డే 47వ భారత ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

ఆయన తీర్పుల్లో జోగేంద్ర సింగ్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసులో నిందితుడి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడం లాంటివి ముఖ్యమైనవి. అంతకు ముందు, వేరే కేసులో బెయిలుపై నిందితుడు బయట ఉన్నప్పుడు జరిగిన ఒక మహిళ హత్యకు సంబంధించి మధ్య ప్రదేశ్ హైకోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కేసులో పరిస్థితులను తగ్గించడానికి 'అత్యంత అరుదైనది' కాకుండా దానిని అడ్డుకున్నట్లు జస్టిస్ బోబ్డే అభిప్రాయపడ్డారు.

గోప్యత హక్కును ధ్రువీకరించిన తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. 2017లో కే.ఎస్.పుట్టస్వామి వర్సెస్ యూనియవన్ ఆఫ్ ఇండియాగా ఈ కేసు గురించి చాలా చర్చ జరిగింది.

గోప్యతా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినపుడు జస్టిస్ బాబ్డే తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు. ప్రత్యేక గుర్తింపునిచ్చే ఆధార్ వ్యక్తి గోప్యతను పరిమితం చేస్తున్నట్లు ఆయన భావించారు. ఆధార్ లేనంత మాత్రాన ఏ పౌరుడూ ప్రభుత్వ రాయితీలు కోల్పోకూడదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఓట్ల కోసం మతపరమైన మనోభావాలను ప్రేరేపించడం అభ్యర్థులు, ఓటర్ల వరకూ వ్యాపించిందని అభిప్రాయపడిన జస్టిస్ బాబ్డే ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరుగా ఇచ్చిన తీర్పు కూడా చాలా కీలకమైనది.

బాణాసంచాను నిల్వ, అమ్మకాలపై కూడా అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్, జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీలతో కలిసి జస్టిస్ బాబ్డే తీర్పు వెలువరించారు.

చిత్రం శీర్షిక జస్టిస్ డీవై చంద్రచూడ్

డీవై చంద్రచూడ్

1985లో తన తండ్రి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చడంసహా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రముఖులు. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్‌ తనయుడు.

తండ్రి వైవీ చంద్రచూడ్ వ్యభిచార చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని తీర్పు ఇచ్చారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఆయన కొడుకు డీవై చంద్రచూడ్ చట్టంలోని 497 సెక్షన్ నిజానికి మహిళ మర్యాద, ఆత్మగౌరవాలను నాశనం చేస్తోందని తీర్పు ఇచ్చారు. మహిళ తమ భర్తలకు చరాస్తిగా మిగిలిపోకూడదని, ఆమె లైంగిక స్వేచ్ఛను కించపరిచేలా ఆ చట్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ, లా మాస్టర్ డిగ్రీ చేశారు. 2016లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆయన 2024 వరకూ ఈ పదవిలో ఉంటారు.

చంద్రచూడ్ బాంబే హైకోర్టులో జడ్జిగా సేవలందించారు. తర్వాత అలహాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు.

Image copyright ALLAHABADHIGHCOURT
చిత్రం శీర్షిక జస్టిస్ అశోక్ భూషణ్

జస్టిస్ అశోక్ భూషణ్

ఉత్తరప్రదేశ్ జాన్‌పూర్‌కు చెందిన జస్టిస్ భూషణ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆయన 2021 వరకూ ఈ పదవిలో ఉంటారు. 2001లో ఆయనను అలహాబాద్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమించారు. తర్వాత 2015లో భూషణ్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

పాన్ కార్డుకు ఆధార్ లింకును తప్పనిసరి చేయడంపై పాక్షిక స్టే ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ అర్జన్ సిక్రీతోపాటూ భూషణ్ కూడా ఉన్నారు.

ఆర్టీఐ చట్టం కింద ఎఫ్ఐఆర్ మినహాయింపు ఉందని సంబంధిత అధికారులు నిర్ణయించితే తప్ప, ఏ ఆర్టీఐ అయినా పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) అందించాలని కేరళ హైకోర్టులో ఉన్నప్పుడు ఆయన బెంచ్ అభిప్రాయపడింది.

Image copyright sci.gov.in
చిత్రం శీర్షిక జస్టిస్ అబ్దుల్ నజీర్

జస్టిస్ అబ్దుల్ నజీర్

జస్టిస్ నజీర్ కర్ణాటక హైకోర్టు నుంచి 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆయన 2023 జనవరి వరకూ ఈ పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టుకు వచ్చే ముందు ఆయన దేశంలోని ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు.

మంగళూరుకు చెందిన ఆయన కర్ణాటక హైకోర్టులో దాదాపు 20 ఏళ్లుగా పనిచేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అయోధ్య భూవివాదం కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఈ అంశాన్ని కచ్చితంగా ఒక పెద్ద రాజ్యాంగ ధర్మాసనం ద్వారా విచారించాలని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నజీరే.

ట్రిపుల్ తలాక్‌కు రాజ్యాంగ ప్రామాణికతను నిర్ణయించే ధర్మాసనంలో ఈయన కూడా ఒకరు. ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసే అధికారం ఉన్నది పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు కాదని, దానిపై ఒక చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్ ప్రభుత్వాన్ని ఆదేశించినపుడు, జస్టిస్ నజీర్ ఆయనతోపాటూ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)