అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా

  • 9 నవంబర్ 2019
రామ మందిర అవశేషాలు లభించాయా Image copyright KK MUHAMMED
చిత్రం శీర్షిక వివాదిత స్థలంలో తవ్వకాల్లో లభించిన అవశేషాలు

అయోధ్యలో ఆలయం కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారా? ఆ మసీదును మందిరం అవశేషాల మీద కట్టారా?

ఈ అంశం గురించి చర్చ మొదటి నుంచీ ఉంది. దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువరించింది.

భారత పురాతత్వ సర్వే అంటే 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' అప్పటి డైరెక్టర్ జనరల్ బీబీ లాల్ మొదటిసారి రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిలో పురాతత్వ సర్వే చేశారు. అప్పుడు ఆయన టీమ్‌లో కేకే మొహమ్మద్ కూడా ఉన్నారు.

అది 1976, 1977లో జరిగింది. అప్పుడు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం(ఎఎంయూ) నుంచి చరిత్రలో పీజీ చేసిన మొహమ్మద్ తర్వాత స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో చదవడం ప్రారంభించారు. అంటే ఆయన ఈ సర్వేలో ఒక విద్యార్థిగా భాగమయ్యారు.

ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత వివాదాస్పద భూమిలో జరిగిన సర్వేను మొహమ్మద్ బయటపెట్టారు. అక్కడ ప్రాచీన ఆలయానికి సంబంధించిన అవశేషాలు దొరికాయని ఆయన చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

Image copyright K K MUHAMMED

ఆ అవశేషాలు హిందూ ఆలయానికి సంబంధించనవే అని చెప్పడం కష్టం అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అక్కడ జైన లేదా బౌద్ధ ఆలయం ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని కొందరు పురాతత్వ వేత్తలు చెప్పారు.

మొహమ్మద్‌కు ముందు బీబీ లాల్ కూడా తన రిపోర్టులో అదే మాట చెప్పారు. కానీ కేకే మొహమ్మద్ ప్రకటన మాత్రం ఈ మొత్తం వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. ఎందుకంటే ఒకటి ఆయన ముస్లిం అయితే, రెండోది ఆయన చరిత్ర చదివింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో.

70లలో ఆఖరి దశాబ్దంలో జరిగిన ఈ సర్వేపై కేకే మొహమ్మద్ ఇప్పటికీ కచ్చితంగా ఉన్నారు.

ఇక్కడ మొదటి సర్వే 70వ దశకంలో జరిగింది. కానీ 2003లో జరిగిన సర్వేలో కూడా భారత పురాతత్వ సర్వేలో పనిచేస్తున్న ముస్లింలు ఉన్నారు.

కేకే మొహమ్మద్ భారత పురాతత్వ సర్వే, డైరెక్టర్(ఉత్తర భారతం) పదవి నుంచి కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలోని కోజికోడ్‌లో ఉంటున్నారు.

Image copyright KK MUHAMMED
చిత్రం శీర్షిక వివాదాస్పద స్థలం సమీపంలో తవ్వకాలు

బీబీసీతో ఫోన్లో మాట్లాడిన కేకే మొహమ్మద్ "ఆలయం నిర్మించేలా, ఆ భూమిని హిందూ పక్షాలకు అప్పగించి ఉంటే బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీకి ఒక మంచి అవకాశం ఉండేది" అన్నారు.

రెండు సార్లు జరిగిన పురాతత్వ సర్వేలను విశ్లేషించిన కేకే మొహమ్మద్ "వివాదాస్పద స్థలంలో దొరికిన పొడవాటి గోడలు, గోపురం లాంటివి ఒక ఇస్లాం నిర్మాణంలా లేవు. ఎందుకంటే వాటిపై విగ్రహాలు ఉన్నాయి. ఇస్లాం ప్రార్థనాస్థలాలపై అలాంటివి ఉండే ప్రసక్తే లేదు" అని చెప్పారు.

ఆయన, తాము సర్వే చేసినప్పుడు వివాదాస్పద స్థలం నుంచి దొరికిన విగ్రహాల గురించి కూడా చెప్పారు.

"గోడలు, గోపురంతోపాటు మట్టితో చేసిన చాలా విగ్రహాలు దొరికాయి. వాటిలో కొన్ని శిలా శాసనాలు కూడా ఉన్నాయి. అవి పూర్తిగా దిల్లీలోని కుతుబ్ మీనార్ దగ్గర మసీదులో ఉన్నట్టే కనిపించాయి" అన్నారు.

ఆ శిలాశాసనాలు 10వ శతాబ్దానికి చెందినవని కేకే మొహమ్మద్ చెప్పారు.

Image copyright KK MUHAMMED

సర్వేపై ప్రశ్నలు

మందిరం, మసీదు కేసుకు సంబంధించి ఎఎస్ఐ చేసిన రెండు సర్వేలపై ఎంతోమంది చరిత్రకారులు ప్రశ్నలు లేవనెత్తారు. సంప్రదాయవాద వైఖరి ఉన్న వారు సర్వే చేశారని ఆరోపించారు.

సున్నీ వక్ఫ్ బోర్డు కూడా "పురాతత్వశాస్త్రం అనేది ఒక పూర్తి శాస్త్రం కాదని, అది ఒక అవాస్తవ శాస్త్రం" అని ఆరోపించింది.

ఈ పురాతత్వ సర్వే జరిగినపుడు, అందులో సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున ఇద్దరు స్వతంత్ర పురాతత్వవేత్తలు పాల్గొన్నారు. వారిలో ఒకరు సుప్రియా విరామ్, మరొకరు జయా మేనన్.

ఈ ఇద్దరు స్వతంత్ర పురాతత్వవేత్తలు ఎఎస్ఐ సర్వేపై విడిగా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసి ఎన్నో సవాళ్లు లేవనెత్తారు.

కానీ, "సర్వేపై ప్రశ్నలు లేవనెత్తిన వారు వామపక్ష ఆలోచనలకు ప్రభావితం అయ్యారు" అని కేకే మొహమ్మద్ ఆరోపించారు.

"ఈ నిర్మాణం గోడలు, అక్కడ మొదట్లో ఉన్న 10వ శతాబ్దానికి చెందిన ఒక ఆలయానివి" అని ఆయన చెప్పారు.

10వ, 12వ శతాబ్దం, ఆ తర్వాత భారత్‌లో పర్యటించిన యాత్రికుల గురించి చెప్పిన మొహమ్మద్ వారందరూ తమ పర్యటన వివరాలలో, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో హిందూ సంప్రదాయాలతో పూజలు జరిగేవని ప్రస్తావించారన్నారు.

విలియం ఫించ్, జోజఫ్ టైఫింథ్లర్ గురించి ప్రసావించిన కేకే మొహమ్మద్ వారితోపాటు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆయన దర్బారులోని చరిత్రకారుడు అబూ ఫఝల్ ఫార్సీలో రాసిన దర్బార్-నామా, అంటే ఆయినా-ఎ-అక్బరీని ప్రస్తావిస్తూ వివాదాస్పద స్థలంలో శ్రీరాముడికి పూజలు చేసేవారని అందులో కూడా ఉందని తెలిపారు.

ఫించ్ 1607, 1611 మధ్య భారత్‌లో పర్యటిస్తే, జోజఫ్ 1766, 1771 మధ్యలో భారత యాత్రకు వచ్చారు.

Image copyright KK MUHAMMED

ఎన్నో ఆలయాలను పరిరక్షించారు

ఎన్నో ప్రాచీన చారిత్రక వారసత్వాలను అన్వేషించి, వాటిని సంరక్షించిన క్రెడిట్ కూడా కేకే మొహమ్మద్‌కు దక్కుతుంది. వాటిలో ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ కూడా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ దీన్-ఎ-ఇలాహీ మతాన్ని ప్రారంభించింది ఇక్కడే.

వాటితోపాటు మధ్యప్రదేశ్ మురైనా దగ్గర ఉన్న బటేశ్వర్‌లో గుజర్ రాజుల కాలం నాటి ఆలయాల అవశేషాలను ఆయన అన్వేషించారు. వాటిలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న 200 నిర్మాణాల్లో 70 ఆలయాలను పునర్నిర్మించారు.

మైనింగ్ మాఫియా అప్పుడప్పుడూ ఆ పురాతన ఆలయాల చుట్టుపక్కల పేలుళ్లు జరిపి విలువైన రాళ్లను దొంగిలించేది. దాంతో, కేకే మొహమ్మద్ ఆ ఆలయాల సంరక్షణ కోసం అక్కడ కనుమల్లో ఉన్న బందిపోట్ల సాయం కూడా తీసుకున్నారు.

చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోని దంతెవాడ దగ్గర బార్సూర్, సామ్లూర్ ఆలయాలను కూడా ఆయన సంరక్షించారు.

బీహార్ కేసరియా, రాజగీర్‌లో బౌద్ధ స్థూపాలను అన్వేషించిన ఘనత కూడా కేకే మొహమ్మద్‌కే దక్కుతుంది. ఆయన సేవలకు ప్రభుత్వం 2019లో కేకే మొహమ్మద్‌ను పద్మశ్రీతో గౌరవించింది.

2016లో కేకే మొహమ్మద్ తన ఆత్మకథ 'నజన్ ఎన్న భారతీయన్' రాశారు. అంటే 'నేను, ఒక భారతీయుడిని' అని అర్థం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)