అయోధ్య తీర్పు: 'అక్కడ ఆలయం లేదని చెప్పాం... ఈ తీర్పు దేశానికి మంచిదికాదు' - చరిత్రకారుడు డీఎన్ ఝా

  • 9 నవంబర్ 2019
అయోధ్య తీర్పు Image copyright Getty Images

ఫ్రొఫెసర్ డీఎన్ ఝా ప్రముఖ చరిత్రకారుడు, ''రామ జన్మభూమి-బాబ్రీ మసీదు: ఎ హిస్టారియన్స్ రిపోర్ట్ టు ది నేషన్'' పుస్తకం రాసిన చరిత్రకారుల బృందంలో ఒకరు.

ఈ పుస్తకాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. కోర్టు తీర్పులోనూ ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు.

నలుగురు స్వతంత్ర చరిత్రకారులు ప్రొఫెసర్ సూరజ్ భన్, అధర్ అలీ, ఆర్.ఎస్.శర్మ, డీఎన్ ఝాలు చారిత్రక, పురావస్తు ఆధారాలను పరిశీలించి బాబ్రీ మసీదు కింద హిందూ దేవాలయం ఉందన్న భావనలను తమ నివేదికలో తోసిపుచ్చారు.

ఈరోజు సుప్రీం వెలువరించిన తీర్పుపై ప్రొఫెసర్ ఝా స్పందించారు.

Image copyright dn jha

ఈ తీర్పును మీరు ఎలా చూస్తున్నారు?

హిందూ విశ్వాసాలకు ప్రాముఖ్యతను ఇస్తూ, లోపభూయిష్ట పురావస్తు శాస్త్రంపై ఆధారపడి తీర్పు ఇచ్చారు. ఇలా చెప్పడం తీవ్రంగా నిరాశపరిచింది.

మీ నిజనిర్ధారణ నివేదిక 'రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు: ఎ హిస్టారియన్స్ రిపోర్ట్ టు ది నేషన్'లో ఏం చెప్పారు?

మసీదు కూల్చివేతకు ముందు 1992లోనే మేం ప్రభుత్వానికి ఆ నివేదిక ఇచ్చాం. ఆ సమయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తీవ్రంగా పరిశీలించిన అనంతరం మసీదు కింద రాముడి ఆలయం లేదని నిర్ధారించాం.

Image copyright KK MUHAMMED
చిత్రం శీర్షిక అయోధ్య ప్రాంతంలో తవ్వకాలు

ఏఎస్ఐ ఇంకా ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు?

అయోధ్య వివాదంలో ఏఎస్ఐ ఎప్పుడూ సందేహాస్పద పాత్ర పోషించింది. కూల్చివేతకు ముందు, అయోధ్యలోని పురాతన వస్తువులను పరిశీలించడానికి మేం పురాణ ఖిల్లాకు వెళ్ళినప్పుడు కీలకమైన సాక్ష్యాలను కలిగి ఉన్న ట్రెంచ్ IV సైట్‌కు సంబంధించిన నోట్ పుస్తకాన్ని ఏఎస్ఐ మాకు ఇవ్వలేదు. ఇది స్పష్టంగా సాక్ష్యాలను అణిచివేసే విషయంగా చూడాలి. కూల్చివేత తరువాత ఒక ముందస్తు పథకంతో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది. అక్కడ ఆలయం ఉందనే భావనలకు విరుద్ధంగా ఉన్న సాక్ష్యాలను అణిచి వేసింది. ఒక ప్రాంతాన్ని తవ్వేటప్పుడు ఏఎస్ఐ శాస్త్రీయ నిబంధనలను పాటించాలని నిపుణుల భావన.

ఈ తీర్పు భారత్ విషయంలో ఏలా అర్థం చేసుకోవాలి?

ఈ తీర్పు మెజారిటీ వాదానికి అనుకూలంగా వెలువడింది. ఇది మన దేశానికి మంచిది కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు