'అయోధ్య తీర్పుతో బీజేపీలో మరింత ఉత్తేజం... ప్రతిపక్షం మరింత బలహీనం'' : అభిప్రాయం

  • 10 నవంబర్ 2019
మోదీ Image copyright Getty Images

అది 2012, ఫిబ్రవరి. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధికారం కోల్పోయి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ చాలా కాలంగా అక్కడ ఉండీ లేనట్లుగానే ఉంది. అయితే, అప్పుడు బీజేపీ నిరుత్సాహంలో ఉండటమే ఆసక్తికరమైన విషయం.

ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన అలహాబాద్ నియోజకవర్గంలోని ఫూల్‌పుర్ గ్రామంలో అన్ని పార్టీల బూత్ స్థాయి కార్యకర్తలను నేను ఇంటర్వ్యూ చేశా.

నాతో మాట్లాడిన బీజేపీ కార్యకర్త ఒక బ్రాహ్మణుడు. లాయర్ కూడా. ఆయన బాగా మాట్లాడారు. 'బీజేపీ ప్రదర్శన ఈ ఎన్నికల్లో బాగా లేదు కదా? పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బీజేపీ ప్రధాన శక్తుల్లో ఒకటిగా ఎదగడానికి కారణమైన రాష్ట్రం యూపీనే. పతనానికి కారణమేంటి' అని నేను ఆయనను అడిగా.

రామమందిరం విషయంలో తాము మోసం చేశామని ప్రజలను అనుకున్నారని ఆ బీజేపీ కార్యకర్త బదులిచ్చారు.

Image copyright Reuters

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన రామజన్మభూమి ఉద్యమంతోనే ఉత్తర్‌ప్రదేశ్ సహా ఉత్తర భారతంలో బీజేపీ తమ పట్టును పెంచుకుంది. అయితే, ఆ తర్వాత ఆ వివాదం కోర్టుకు చేరడంతో పార్టీ దాన్ని పక్కనపెట్టింది.

యూపీలో కులరాజకీయాల క్రీడను తమ పార్టీ సరిగ్గా ఆడలేకపోయిందని ఆ బీజేపీ కార్యకర్త చెప్పారు.

బీజేపీ తిరిగి ప్రాణం పోసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందని ప్రశ్నించాను. వెనుకబడిన కులాలవారిని అక్కున చేర్చుకుని కుల రాజకీయాల సమస్యను పరిష్కరించుకోవాలని, రామమందిర నిర్మాణం డిమాండ్‌ను తిరిగి తలకెత్తుకోవాలని ఆయన చెబుతారనుకున్నా. కానీ, ఆయన ఆలోచన పూర్తి భిన్నంగా ఉంది.

Image copyright FACEBOOK/JANKI MANDIR/BBC

''యూపీలో బీజేపీకి తిరిగి ప్రాణం పోయాలంటే, మోదీని జాతీయ రాజకీయాల్లోకి తేవాలి'' అని అన్నారాయన.

నేను ఆశ్చర్యపోయా. గుజరాత్ ముఖ్యమంత్రి యూపీలో బీజేపీని ఎలా పునరుద్ధరించగలరని అడిగా?

''మోదీ వస్తే పోలరైజేషన్ అవుతుంది. ఉంటే మీరు మోదీతో ఉంటారు, లేదా మోదీకి వ్యతిరేకంగా ఉంటారు. రామ మందిరం విషయంలో జరిగినట్లే'' అని ఆ కార్యకర్త చెప్పారు.

2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకుగానూ బీజేపీ 47 సీట్లు మాత్రమే గెలిచింది. ఓట్ల శాతం 15. నాతో మాట్లాడిన వ్యక్తి లాంటివారి వాణిని విన్న బీజేపీ 19 నెలల తర్వాత మోదీని ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రకటించింది.

రెండేళ్లలో బీజేపీ ఓట్ల శాతం 15 నుంచి 43కు పెరిగింది. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలలో 71 సీట్లు బీజేపీయే గెలుచుకుంది. ఫూల్‌పుర్‌లో కలిసిన ఆ బీజేపీ కార్యకర్తను నేను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయా.

మోదీ ప్రధాని పదవిలో ఉన్న సమయంలోనే, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆ కార్యకర్తే నాకు గుర్తుకువచ్చారు.

ఫూల్‌పుర్‌లోని బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, రామమందిర నిర్మాణానికి అనుకూలంగానే కోర్టులో ప్రభుత్వం వాదించింది.

Image copyright Getty Images

రామమందిరం నిర్మించనిస్తే ఓ సమస్య తీరిపోతుందని అభిప్రాయపడ్డ చాలా మంది ముస్లింలను కొన్నేళ్లుగా అయోధ్యలో నేను కలుస్తూనే ఉన్నా.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. మసీదు కన్నా తమ భద్రత గురించే ముస్లింలకు ఆందోళన.

మసీదుకు భూమి కేటాయించినా, ఈ తీర్పుతో కోర్టు వారిని రెండో తరగతి పౌరులుగా వర్గీకరించింది.

జాతీయ పౌర రిజిస్టర్ లాంటి అయోధ్య కన్నా పెద్దవైన సమస్యలను ఇప్పుడు భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్నారు. వ్యవస్థ తమకు న్యాయం చేయదన్న భావనతో, తమ తాత ముత్తాతలు భారతీయులే అని నిరూపించే పత్రాల కోసం వెతుకులాటలో పడ్డారు.

Image copyright PUNEET BARNALA/BBC

మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఓ ట్రస్టు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ప్రధాన ఎన్నికలకు ముందు వార్తల్లో నిలుస్తూ, వివాదాస్పద ప్రకటనలకు కారణమవుతూ ఉంటుంది.

ఆర్టికల్ 370 సవరణ తర్వాత హిందూత్వకు ఇది మరో పెద్ద విజయం. 2019 ఇంకా ముగియనేలేదు.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టొచ్చు. ఉమ్మడి పౌర స్మృతి, మతమార్పిళ్ల నిరోధక చట్టం కూడా వస్తాయేమో?

ఇప్పటికే వెనుకబడిన ప్రతిపక్షం, మరింత వెనక్కి పోయింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హిందువుల ఓట్లు కోల్పోతామేమోనన్న భయంతో రామ జన్మభూమి ఉద్యమానికి అవకాశమిచ్చారు. ఇప్పుడు ముస్లింల ఓట్లు దూరమవుతాయన్న భయంతో కాంగ్రెస్ ఆ క్రెడిట్‌ను తీసుకోలేదు.

సుప్రీం తాజా తీర్పుతో ప్రతిపక్షానికి ఏ విధంగానూ ఒరిగేదేమీ లేదు. బీజేపీకి మాత్రం ఇన్నాళ్లుగా కోరుకుంటున్న విముక్తి లభించింది.

ఊపు మీదున్న బీజేపీ, మోదీ ప్రభుత్వంలో ఈ తీర్పు మరింత ఉత్తేజం నింపుతుంది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరుగుదల వంటి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సరైన సమయంలో ఈ తీర్పు వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచినా, గత ఆగస్టులో ఆర్టికల్ 370ని సవరించినా... మహారాష్ట్ర, హరియాణాల్లో అనుకున్న స్థాయి విజయాలు బీజేపీ సాధించలేకపోయింది.

డిసెంబర్‌లో ఝార్ఖండ్, ఫిబ్రవరిలో దిల్లీలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

జార్జి రెడ్డి: కొందరికి అభినవ చేగువేరా, ఇంకొందరికి ఆవేశపరుడు, ఇంతకీ ఆయన కథేంటి?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లు: లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు కొనుక్కోవడం ఎలా

డే- నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్‌ ఎందుకు వాడతారు? ఇది ఆటను మార్చేస్తుందా?

టీఎస్ఆర్టీసీని భరించే శక్తి లేదు: తెలంగాణ ప్రభుత్వం

గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు

జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు

'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '

భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి