ఆంధ్రప్రదేశ్: ఇంగ్లిష్ మీడియం ఆరో తరగతి వరకే -ప్రెస్ రివ్యూ

  • 10 నవంబర్ 2019
Image copyright JAGAN/FB

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధించాలన్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసిందని ఈనాడు కథనం చెప్పింది.

ఆరో తరగతి వరకూ మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అధికారులకు సూచించారు.

శనివారం సీనియర్ అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారని ఈనాడు రాసింది.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆంగ్ల ల్యాబ్ ఏర్పాటు చేయాలని, నాడు-నేడులో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కూడా జగన్ సూచించారు.

పాఠశాలల్లో బోధనకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి చెప్పారని కథనంలో వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు

జూనియర్ కాలేజీల అఫిలేయషన్ కఠినతరం

తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ (అనుబంధ గుర్తింపు) ప్రక్రియ నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

15 మార్చి 2020నాటికి అఫిలియేషన్‌ ప్రక్రియ ముగించి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితా అందరికీ తెలిసేలా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు అందులో తెలిపారు.

జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కార్యాలయ వెబ్‌సైట్‌, నోటీసు బోర్డులో కూడా జాబితాలను ప్రదర్శించనున్నారు.

రాష్ట్రంలోని దాదాపు 1,600 ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఏటా 1,257 కాలేజీలకే అనుబంధ గుర్తింపు దక్కుతున్నది. మిగిలిన కాలేజీలు ప్రమాణాలు పాటించకపోవడంతో ఇంటర్‌బోర్డు గుర్తింపు ఇవ్వడం లేదు.

దీంతో ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టి లో ఉంచుకొని పరీక్షలకు హాజరుకావడానికి ఇంటర్‌బోర్డు అనుమతించడం, కొన్నేండ్లుగా కొనసాగుతున్నది.

మరోవైపు ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్‌ కాలేజీలకు షెడ్యూల్‌ ప్రకారం ఆయా యూనివర్సిటీలు అనుబంధ ప్రక్రియను ముగిస్తున్నాయి. గడువు తర్వాత గుర్తింపు ప్రక్రియ కొనసాగించడంలేదు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది.

ఇంటర్‌బోర్డు కూడా ఇదేతరహాలో గుర్తింపు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నదని పత్రిక తెలిపింది.

నూతన మార్గదర్శకాలను రూపొందించి నెలరోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదలచేసి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇంటర్‌బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ తెలిపారు.

అఫిలియేషన్‌ ప్రక్రియ మాన్యువల్‌గా నిర్వహించబోమని, ఆన్‌లైన్‌లోనే పూర్తిచేస్తామని, ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టంచేసినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది. తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ (అనుబంధ గుర్తింపు) ప్రక్రియ నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

పోలవరం సవరణ అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్రానికి నివేదిక

పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి మండలికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ) కసరత్తు చేస్తున్నాయి అని సాక్షి తన కథనంలో చెప్పింది.

దీనికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేస్తే 2017-18 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదలవుతాయని ఇందులో రాశారు.

ఈ నివేదికను రూపొందించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌ఈసీలకు సహకరించేందుకు 14న ఢిల్లీకి వెళ్లాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పత్రిక చెప్పింది.

రూ.55,548.87 కోట్ల పనులకు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), కేంద్ర జల్‌ శక్తి, ఆర్థిక శాఖ అధికారులతో ఏర్పాటైన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ) ఇప్పటికే ఆమోదించాయి.

ఈ ప్రతిపాదనలపై ఆర్‌ఈసీ ఛైర్మన్‌ జగ్‌మోహన్‌ గుప్తా కేంద్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.

Image copyright Getty Images

ఎనీ టైం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు సేవింగ్ అకౌంట్స్ నుంచి జరిగే ఆన్‌లైన్ నెఫ్ట్ లావాదేవీలకురిజర్వ్ బ్యాంక్ రుసుము ఎత్తివేసిందని ఆంధ్రజ్యోతి తమ కథనంలో చెప్పింది.

పెద్ద నోట్లు రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చేలా ఆర్‌బీఐ వచ్చే ఏడాది జనవరి నుంచి పొదుపు ఖాతాదారుల నుంచి ఆన్‌లైన్‌ నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలకా్ట్రనిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌) లావాదేవీలకు ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది.

దీంతో జనవరి 1 నుంచి బ్యాంక్‌ కస్టమర్లకు ఆన్‌లైన్‌ నెఫ్ట్‌ చెల్లింపులు ఉచితం కానున్నాయి.

నెఫ్ట్‌ ద్వారా నిధుల బదిలీకి కనీస లేదా గరిష్ఠ పరిమితి ఏం లేదు. డిసెంబరు నుంచి నెఫ్ట్‌ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం కేవలం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సేవలు అందిస్తున్నారు.

నెఫ్ట్‌తోపాటు రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) లావాదేవీలపై రుసుము ఎత్తివేయాలని అనుకుంటున్నట్లు ఆర్‌బీఐ జూలై పరపతి సమీక్ష సందర్భంగానే ప్రకటించింది. అయితే, ఎప్పటి నుంచి అమలులోకి తేనున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం నాడు ఆన్‌లైన్‌ నెఫ్ట్‌ చార్జీల రద్దుపై బ్యాంకులను నిర్దేశించింది.

దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ మాత్రం తన కస్టమర్లకు జూలైలోనే ఊరట కల్పించింది. ఆన్‌లైన్‌ చెల్లింపుల చార్జీలను రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)