సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు - గ్రౌండ్ రిపోర్ట్

  • 10 నవంబర్ 2019
అయోధ్య ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు Image copyright Getty Images

శనివారం సాయంత్రం సరయూ నది తీరాన ఉన్న ఆలయ గోపురాల వెనుక సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అయోధ్య నగరం ప్రశాంతంగా కనిపించింది.

సాయంత్రం వాకింగ్ చేస్తున్న ప్రజలు భక్తులతో కలిసి వెళ్తున్న పూజారుల్లో కలిసిపోయారు. నది దగ్గర ఉన్న ఆలయం పరిసరాల్లో భక్తులు శ్లోకాలు చదువుతున్నారు. అక్కడ ప్రతి ఒక్కటీ మామూలుగానే ఉంది.

సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ తీర్పు ఇవ్వడంతో ఈ నగర ప్రజలు కొన్ని గంటల ముందే సంబరాలు చేసుకున్నారు. కానీ సాయంత్రంలోపే వారు మళ్లీ తమ రోజువారీ జీవితంలో పడిపోయారు.

సుప్రీంకోర్టు తీర్పును నిజానికి అయోధ్యలో ప్రజలందరూ స్వాగతించారు.

Image copyright Getty Images

ప్రజలకు ఇది ఒక ఉపశమనంలా అనిపించింది. స్థానికుడు, దుకాణం నడిపే కార్తీక్ గుప్తా, ఆయన సోదరుడు రాకేష్ గుప్తా రామమందిరం నిర్మిస్తారనే వార్తవిని చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల మధ్య చీలికలకు కారణమైన దశాబ్దాల నాటి ఈ పురాతన కేసు ముగిసినందుకు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉందన్నారు.

"రెండు తరాల నుంచి మందిరం-మసీదు వివాదంలో దేశం మొత్తం రెండుగా విడిపోయింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసు అంతమైంది" అని కార్తీక్ చెప్పారు

ఆయన సోదరుడు కూడా "ఈ తీర్పు దేశం కోసం చాలా మంచిది. కనీసం ఇప్పటికైనా మేం ముందుకెళ్లవచ్చు" అన్నారు.

కాషాయ దుస్తులు ధరించిన ఒక పూజారుల సమూహం "మొత్తానికి వివాదాస్పద భూమిలో రామమందిరం నిర్మిస్తారని తెలిసి చాలా సంతోషించింది. ఈ అంశాన్ని రాజకీయం చేసిన రాజకీయ నేతల నుంచి తాము బయటపడ్డాం" అని చెప్పింది.

Image copyright Getty Images

పూజారుల్లో ఒకరు "ఇది మతపరమైన అంశం, కానీ, రకరకాల రాజకీయ పార్టీలు దీనిని ఒక పెద్ద రాజకీయ అంశంగా మార్చేశాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు వారి అంశాన్ని లాగేసుకుంది" అన్నారు.

సాధారణంగా మావల్లే రామ జన్మభూమి ఉద్యమం ఊపందుకుందని భారతీయ జనతా పార్టీ స్వయంగా చెప్పుకుంటుంది. ఈ ఉద్యమాన్ని దాని అనుబంధ సంస్థలు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ప్రారంభించాయి.

Image copyright Getty Images

రామ మందిరం కోసం రథయాత్ర చేసిన బీజేపీ మాజీ అధ్యక్షుడు లాల్‌కృష్ణ అడ్వాణీ, బీజేపీని జాతీయ స్థాయి పార్టీగా నిలబెట్టడంతో ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పుకుంటారు.

తర్వాత కొన్నేళ్లకు బాబ్రీ మసీదు కూల్చివేశారు. 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 స్థానాలు గెలిస్తే, అదే బీజేపీ 1991 సాధారణ ఎన్నికల్లో 125 స్థానాల్లో విజయం సాధించింది.

స్థానికుల అభిప్రాయం

మందిరం-మసీదు అంశం గురించి తమ ప్రాంతంలోని హిందూ-ముస్లింల మధ్య ద్వేషం ఉందని చెప్పే స్థానికులు అయోధ్య నగరంలో మనకు ఒక్కరు కూడా కనిపించరు.

"అయోధ్యలో పెద్ద సంఖ్యలో ఉంటున్న ముస్లింలకు ఇక్కడ ఉన్న ఆలయాలతో చాలాకాలం నుంచే అనుబంధం ఉందని" రామచంద్ర పాండే అనే ఒక స్థానిక పురోహితుడు చెప్పారు.

"మా పొరుగింట్లో ముస్లింలే ఉంటారు. వాళ్లు ఇక్కడి భక్తులు, స్థానిక హిందువులకు సంబంధించిన ఒక చిన్న వ్యాపారం చేస్తుంటారు" అని పాండే చెప్పారు.

శనివారం ఉదయం నేను హనుమాన్‌గఢీలో వివాదాస్పద స్థలం వైపు వెళ్లే దారిలో ఉన్న పోలీస్ బారికేడ్ల దగ్గర నిలబడ్డాను.

హనుమాన్‌గఢీ దారికి రెండు వైపులా ఉన్న దుకాణాల్లో వినియోగదారులు, భక్తులు, ఆలయ పూజారులు టీవీలకు అతుక్కుపోయి, వార్తా చానళ్లు చూస్తూ కనిపించారు.

సుప్రీంకోర్టు రామమందిరానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలియగానే, వారిలో భారత జట్టు విజయం సాధించినంత ఉత్సాహం వచ్చింది.

అయోధ్యలోని ఇరుకైన రోడ్లపై జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయిన జనం గాల్లో చేతులు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం ఎండ పడి వారి ముఖాలు మరింత మెరిసిపోయాయి.

Image copyright Getty Images

ఆ సంబరాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఎలాంటి ప్రదర్శనలూ జరగలేదు. ఎందుకంటే, అయోధ్యలోని సామాన్యులకు, ఏ పార్టీతోనూ అనుబంధంగా ఉండాల్సిన అవసరం లేదు.

వారు సంబరాలు చేసుకున్నారు. కానీ, చాలా సంయమనంతో... పక్కనే, తమతో కలిసి జీవించే ముస్లింల మనోభావాలకు భంగం కలగకూడదు అనేలా వ్యవహరించారు.

ఈ తీర్పు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసిన రాం చరణ్ శుక్లా అనే పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయుడు ఈ తీర్పు దేశ పౌరులందరి కోసం అన్నారు.

"ముస్లింలు కూడా మందిరం నిర్మించడానికి సహకారం అందించవచ్చు. మనమంతా మన మతాలకు చెందిన ప్రాంతాల్లో, ప్రార్థనలు, అర్చనలు చేస్తాం. పరస్పరం గౌరవించుకోవాలని భావిస్తాం" అన్నారు.

ఆ తర్వాత ఆయన ముస్లింల పట్ల తన గౌరవం చూపిస్తూ, నాకు ఖురాన్‌లోని ఒక వాక్యం వినిపించారు.

"ఈ నిర్ణయం హిందూ-ముస్లింల మధ్య భేదభావాలను అంతం చేస్తుందని, దేశాన్ని మరోసారి శాశ్వతంగా ఏకం చేస్తుందని చూపించాలనుకున్న అయోధ్య ప్రజలు.. కోర్టు తీర్పును శాంతి, సౌభ్రాతృత్వానికి సందేశంగా భావించారు" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇక్బాల్ అన్సారీ(ఫైల్)

ఇక్బాల్ అన్సారీ ఏం చెప్పారు

చాలా మంది మాట్లాడ్డానికి సిద్ధంగా లేరు. వాళ్లు భయంతో మాట్లాడటం లేదా లేక ఈ వేడుక వాతావరణాన్ని పాడు చేయడం ఇష్టం లేక అలా చెబుతున్నారో స్పష్టంగా తెలియలేదు. కానీ కొంతమంది తమకు కోర్టు తీర్పు అంగీకారమే అన్నారు.

ఈ కేసులో ఒక కక్షిదారు, సున్నీ వక్ఫ్ బోర్డు మద్దతు పొందిన ఇక్బాల్ అన్సారీ ఈ కేసు ముగిసినందుకు తనకు సంతోషంగా ఉందని నాతో అన్నారు.

"సుప్రీంకోర్టు తీర్పును నేను అంగీకరిస్తున్నాను. నేను కోర్టు తీర్పును అంగీకరిస్తానని ముందే చెప్పాను. ఇప్పటికీ అదే చెబుతున్నా. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చేసింది. నేను నా మాటను నెరవేర్చుకోవాలి" అన్నారు.

తాను ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయనని కూడా ఆయన గట్టిగా చెప్పారు.

నిర్మోహీ అఖాడా అసంతృప్తి

నిర్మోహీ అఖాడా ఈ కేసులో మరో కక్షిదారు. దీని వాదనలను కోర్టు తోసిపుచ్చింది.

"ఈ తీర్పు తనకు సంతోషంగా లేదని" నిర్మోహీ అఖాడా మతగురువు నాతో చెప్పారు. కానీ ఇక ఎలా ముందుకెళ్లాలనేది తమ సంస్థ నిర్ణయిస్తుందని అన్నారు.

కోర్టు తన తీర్పులో రామమందిరం ఏర్పాటు చేసేందుకు, దానిని చూసుకునేందుకు మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పును స్థానికులు పెద్ద సంఖ్యలో స్వాగతించారు. నాతో మాట్లాడిన వారిలో దాదాపు అక్కడ ఉన్న అందరూ తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ తమ కనుసన్నల్లో జరగాలని పోటీపడుతున్న వారిని ఈ ఆదేశాలు అడ్డుకుంటాయన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు