మహారాష్ట్ర: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను ఆహ్వానించిన గవర్నర్.. బీజేపీ విముఖతతో ఈ నిర్ణయం

  • 10 నవంబర్ 2019
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే(కుడి), ఆయన కుమారుడు, పార్టీ నేత ఆదిత్య ఠాక్రే Image copyright Getty Images
చిత్రం శీర్షిక శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే(కుడి), ఆయన కుమారుడు, పార్టీ నేత ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయం ఆదివారం కీలక మలుపులు తిరిగింది.

తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రకటించగా, ఆ తర్వాత కొన్ని గంటలకు రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను, సంఖ్యా బలాన్ని తెలియజేయాలని శివసేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ షిండేకు గవర్నర్ సూచించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది.

గవర్నర్ శనివారం బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ముంబయిలో గవర్నర్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తమతో కలసి రావడం లేదని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు.

Image copyright HANDOUT
చిత్రం శీర్షిక గవర్నర్‌తో సమావేశమైన ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్

గవర్నర్‌తో సమావేశం తర్వాత చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ- బీజేపీ, శివసేన కలిసి పనిచేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇప్పుడు శివసేన ప్రజాతీర్పును అగౌరవపరిచి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొంటే చేసుకోవచ్చని, వారికి తమ శుభాకాంక్షలు చెబుతున్నామని వ్యాఖ్యానించారు.

మా పార్టీ నుంచే సీఎం: శివసేన

బీజేపీ నిర్ణయం వెలువడిన తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ- ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారని పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు (ఆదివారం) చెప్పారని, ఆయన అలా చెప్పారంటే ఏది ఏమైనా సీఎం శివసేన నుంచే ఉంటారని అర్థమని పేర్కొన్నారు.

సీఎం పీఠంపై పీటముడి

అక్టోబరు 24న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో శివసేన-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ, శివసేన మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.

ముఖ్యమంత్రి పదవిని శివసేన, బీజేపీ తలా రెండున్నరేళ్ల చొప్పున చేపట్టాలని ఫలితాలు వెలువడిన తర్వాత శివసేన ప్రతిపాదించింది. దీనికి బీజేపీ ఒప్పుకోవడం లేదు.

అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 288. ప్రభుత్వం ఏర్పాటుకు 145 సీట్ల బలం ఉండాలి.

నాలుగు ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు

బీజేపీ - 105

శివసేన - 56

ఎన్‌సీపీ - 54

కాంగ్రెస్ - 44

మా మద్దతు కావాలంటే...: ఎన్‌సీపీ

తమ ఎమ్మెల్యేలతో ఈ నెల 12న మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ తెలిపారు.

శివసేన తమ మద్దతు కావాలనుకొంటే, బీజేపీతో ఎలాంటి సంబంధాలూ లేవని శివసేన ప్రకటించాలని, బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ) నుంచి బయటకు రావాలని ఎన్‌సీపీ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రిమండలి నుంచి శివసేన మంత్రులు వైదొలగాలని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు