కాచిగూడ వద్ద రైళ్లు ఢీకొన్న ఘటనలో బోగీలో చిక్కుకున్న డ్రైవర్‌ పరిస్థితి విషమం

  • 12 నవంబర్ 2019
రైలు డ్రైవర్

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి.

ఉదయం 10.30 గంటల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు, కర్నూలు నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడ సమీపంలో ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. గాయపడిన 12 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది.

రైలు స్టేషన్‌ను దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ఘోర ప్రమాదం తప్పినట్లైందని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌కు చెందిన ఆరు బోగీలు, ఇంటర్ సిటీకి చెందిన మూడు బోగీలు దెబ్బతిన్నాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రమాదంలో లింగంపల్లి-ఫలక్‌నుమా రైలు డ్రైవర్ శేఖర్ బోగీలో చిక్కుకుపోయారు. ఆయనను వెంటనే వెలికితీయడం సాధ్యం కాకపోవడంతో సహాయక సిబ్బంది ముందుగా ఆక్సిజన్ సిలిండర్‌ తీసుకువచ్చి ఆక్సిజన్ అందించారు. దాదాపు 8 గంటల పాటు సాగిన సహాయక చర్యల అనంతరం డ్రైవర్ బయటకు వచ్చారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో కొన్ని శరీరభాగాలు క్రష్ అయ్యాయని, మూత్రపిండాలకు గాయాలయ్యాయని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ బీబీసీకి తెలిపారు.

‘లోకోపైలట్ చంద్రశేఖర్ ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. ఆయన కాళ్లకు రక్త ప్రసరణ తగ్గింది. మూత్రనాళాలు కూడా సరిగా పనిచేయడం లేదు. శరీరమంతా గాయాలున్నాయి. ప్రత్యేక వైద్య బృందం సాయంతో చికిత్స అందిస్తున్నాం. ఇప్పుడే శస్త్రచికిత్స చేసే పరిస్థితి కూడా లేదు. వెంటిలేటర్‌పై ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఆపరేషన్ గురించి ఆలోచిస్తాం’ అని ఆమె వివరించారు.

"రెండో నెంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగా ఎంఎంటీఎస్ రైలు వస్తోంది. మరో రైలు మొదటి నెంబర్ ప్లాట్‌ఫామ్ పై నుంచి వస్తోంది. కానీ ఉన్నట్లుండి సిగ్నల్ లోపం వల్ల రెండూ ఒకే దానిపైకి వచ్చేశాయి. కొంతమందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు" అని ప్రత్యక్ష సాక్షి పవన్ తెలిపారు.

సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.

కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ బీబీ సింగ్ తెలిపారు. ట్రాక్‌లపై ఉన్న రైళ్లను తొలగించి, ట్రాకులకు మరమ్మతులు చేసిన తర్వాత రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు.

ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు బీబీ సింగ్ వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)