పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో సచిన్ సృష్టించిన రికార్డును బ్రేక్ చేసిన అమ్మాయి

  • 11 నవంబర్ 2019
షెఫాలీ Image copyright Getty Images

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొంది సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టిన పదిహేనేళ్ల షెఫాలీ వర్మ తన రెండో మ్యాచ్‌లోనూ అర్ధశతకం సాధించింది.

సెయింట్ లూసియాలో నవంబరు 8న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలుగొట్టిన షెఫాలీ నవంబరు 9న జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 35 బంతుల్లో 69 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచింది. షెఫాలీ రాణించడంతో భారత్ 10 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.

ఈ ఏడాది అక్టోబరులో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షెఫాలీ భారత్ తరఫున టీ20లు ఆడిన అత్యంత చిన్నవయసు క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆ మ్యాచ్‌లో ఆమె 46 పరుగులు చేసింది.

నవంబరు 8 నాటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి 30 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టింది.

అప్పట్లో సచిన్

సచిన్ 1989లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో తన తొలి అర్ధ శతకం సాధించాడు. అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ల 214 రోజులు. ఇప్పుడు షెఫాలీ హాఫ్ సెంచరీ సాధించేనాటికి ఆమె వయసు 15 ఏళ్ల 285 రోజులు.

అంతర్జాతీయంగా చూస్తే షెఫాలీ వర్మ అర్ధసెంచరీ సాధించిన రెండో అత్యంత చిన్నవయసు క్రికెటర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కవిషా ఎగోడాగె 15 ఏళ్ల 267 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించి మొదటి స్థానంలో ఉన్నారు.

హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన షెఫాలీకి చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి. ఆ ప్రాంతంలో అమ్మాయిలకు క్రికెట్ శిక్షణ సదుపాయం లేకపోవడంతో ఆమె అబ్బాయిల్లా దుస్తులు ధరించి క్రికెట్ అకాడమీకి వెళ్లేది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు