రామాలయ నిర్మాణం: "అయోధ్య సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లాలి"

  • 12 నవంబర్ 2019
అయోధ్య

రాముడి జన్మస్థలంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించిన తర్వాత అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, ఈ పట్టణం సరికొత్త అయోధ్యగా కనిపిస్తుందని, పెద్దయెత్తున మౌలిక సదుపాయాలు వస్తాయని విశ్వహిందూ పరిషత్ నాయకుడు రామ్ విలాస్ వేదాంతి చెప్పారు. ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు.

రామభక్తుడు, పూజారి చబీలే సరన్ రామమందిర నిర్మాణంపై ఇదే తరహాలో స్పందించారు. అయోధ్యలో రామాలయం భూమిపై వెలసిన స్వర్గం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం మొత్తం రామ్ లల్లా(బాల రాముడు)కే చెందుతుందని, అక్కడ రామాలయ నిర్మాణం చేపట్టాలని నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ప్రాచీన పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

చిత్రం శీర్షిక రామ్ విలాస్ వేదాంతి

తీర్పు తర్వాత అయోధ్య ప్రజల్లో, ఇక్కడ ఆలయాల్లో పనిచేసే వందల మంది పూజారుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి.

కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రామభక్తుడు బీబీసీతో మాట్లాడుతూ- అయోధ్య సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లాలని, హైందవానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకోవడానికి ఇదో కేంద్రం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

అయోధ్యలో శిథిలాలు ఈ పట్టణ పూర్వవైభవాన్ని చాటుతున్నాయని, అయోధ్యకు నాటి వైభవాన్ని తాము తిరిగి తీసుకొస్తామని రామ్ విలాస్ వేదాంతి చెప్పారు.

రామాలయ నిర్మాణం కోసం సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వచ్చిందని అయోధ్యలో చాలా మంది భావిస్తున్నారు.

ఆలయ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చబీలే సరన్ కోరారు. "నేను 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. రామమందిరం కోసం చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నవారిలో చాలా మంది ఇప్పటికే ఈ లోకాన్ని వీడారు. అదృష్టం కొద్దీ మేం ఇంకా బతికే ఉన్నాం. ఇప్పుడు మా కల నెరవేరబోతోంది" అని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక పూజారి చబీలే సరన్

60 శాతం పనులు పూర్తి

అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) 1984లో ఉద్యమాన్ని చేపట్టింది. రాముడి జన్మస్థలంలోని ఆలయం శిథిలాలపై ఈ మసీదును కట్టారని వీహెచ్‌పీ చెబుతూ వచ్చింది.

పార్టీ మాజీ అధ్యక్షుడు లాల్‌కృష్ణ అడ్వాణీ నాయకత్వంలో బీజేపీ చేపట్టిన తర్వాత ఈ ఉద్యమం వేగం పుంజుకొంది. ఇది 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది.

మరోవైపు, ఆలయ నిర్మాణానికి అప్పట్లో వీహెచ్‌పీ సన్నాహాలు మొదలుపెట్టింది.

వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ అయోధ్యలో సువిశాలమైన కరసేవకపురంలో ఉంచిన రాతి శ్లాబులను పరిశీలిస్తూ కనిపించారు. ఆయన్ను బీబీసీ మాట్లాడిస్తే- "1990 సెప్టెంబర్లో ఆలయ నిర్మాణ పనులను మేం మొదలుపెట్టినప్పుడు ఎప్పటికైనా మా ప్రయత్నం ఫలిస్తుందని తెలుసు" అని చెప్పారు.

ఆలయం పనులు 29 ఏళ్లుగా సాగుతున్నాయని, 60 శాతం పనులు పూర్తయ్యాయని వీహెచ్‌పీకి చెందిన చంపత్ రాయ్ తెలిపారు.

Image copyright GETTY IMAGES/BBC

ఆలయ వర్క్‌షాప్ ప్రవేశం వద్ద ఆలయ నమూనా ఉంది. ప్రతిపాదిత రామాలయం ఈ నమూనాకు అనుగుణంగా రూపుదిద్దుకుంటే అది చాలా గొప్ప నిర్మాణం అవుతుంది.

కరసేవకపురంలో ఆలయ పనులను వీహెచ్‌పీ ఆధ్వర్యంలోని ప్రైవేటు ట్రస్టు 'రామజన్మభూమి న్యాస్' పర్యవేక్షిస్తోంది.

ఆలయ నమూనాలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని తాను భావించడం లేదని, ఎందుకంటే మొదట అనుకొన్నదాని కన్నా ఘనంగా ఆలయం నిర్మితమవుతుందని మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి చెప్పారు.

అయోధ్యలో ప్రభుత్వ అధీనంలోని 67 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయం నిర్మితమవుతుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల రామ్ లల్లాకు చెందుతుందని ప్రకటించిన వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం ఇందులోనే ఉంది.

అయితే ప్రతిపాదిత ఆలయం 200 ఎకరాల్లో నిర్మితం అవుతుందని రామ్ విలాస్ వేదాంతి చెప్పారు. ఆయన మాట ప్రకారం చూస్తే, ఈ గుడి కట్టడానికి మరింత భూమి కావాలి.

ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలకు ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో రామ్ జన్మభూమి న్యాస్ లాంటి ప్రైవేటు ట్రస్టులకు ఈ విషయంలో ఏ పాత్రా లేకుండా పోతుందా?

దీనిపై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ స్పందిస్తూ- తాము ఇంతకాలం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం విస్మరించకూడదన్నారు.

రామమందిర ఉద్యమంలో తాము ముందు వరుసలో ఉన్నామని, గుడి నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది తామేనని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ సలహాలు తీసుకుంటారని, సంబంధీకులందరినీ సంప్రదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

చిత్రం శీర్షిక వీహెచ్‌పీ ప్రతినిధి శరద్ శర్మ

రామ జన్మభూమి న్యాస్‌లో కీలక సభ్యుడైన రామ్ విలాస్ వేదాంతి ఆలయ నిర్మాణం గురించి చర్చించేందుకు త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశం కానున్నారు.

సుప్రీంకోర్టు చెప్పిన ట్రస్టు రూపు ఎలా ఉంటుందో తమకు తెలియదని, అయితే అందులో తామూ భాగస్వాములం అవుతామని ఆశిస్తున్నామని రామ్ విలాస్ వేదాంతి చెప్పారు. అయోధ్యలో తనను కలవాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని, ఆయన్ను కలుస్తానని తెలిపారు.

ఆలయ ఉద్యమంపై సంవత్సరాలపాటు వార్తాకథనాలు అందించిన స్థానిక జర్నలిస్టు మహేంద్ర త్రిపాఠి మాట్లాడుతూ- ట్రస్టులో చోటు విషయమై వివిధ హిందూ సంస్థలు ఘర్షించుకొనే ఆస్కారం ఉందన్నారు.

ఆలయ నిర్మాణం సాకారమయ్యే రోజు కోసం ఇంతకాలం ఎదురుచూస్తున్న వాళ్లు ట్రస్టులో తమకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం కేసు హిందూ కక్షిదారుల్లో నిర్మోహి అఖాడా ఒకటి. నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయంపై నిర్మోహి అఖాడా పూజారులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆలయ ట్రస్టులోకి తమను తీసుకోవాలని, ఆలయ నిర్మాణం పూర్తయ్యాక గుడి నిర్వహణ బాధ్యతలను తమకు ఇవ్వాలని నిర్మోహి అఖాడా పూజారులు డిమాండ్ చేస్తున్నారని మహేంద్ర త్రిపాఠి చెప్పారు.

నిర్మోహీ అఖాడా ప్రధాన పూజారి మహంత్ దీనేంద్ర దాద్ బీబీసీతో మాట్లాడుతూ- రామాలయ నిర్మాణం కోసం తమ సంస్థ కూడా ఏళ్లుగా పోరాడిందని, సుప్రీంకోర్టు తీర్పు తనకు సంతోషం కలిగించిందని, అయితే ముఖ్య పూజారులతో సంప్రదించిన తర్వాత తమ స్పందనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కరసేవకపురంలో సందడి నెలకొంది. వేర్వేరు నేపథ్యాలున్న పూజారులు ఇక్కడ కనిపిస్తున్నారు.

Image copyright Getty Images

అన్ని హిందూ శాఖలకు ఈ ట్రస్టులో ప్రాతినిధ్యం కల్పించాలని మహంత్ రామ్ చంద్ర దాస్ అభిప్రాయపడ్డారు.

నిర్మోహి అఖాడా పూజారులు రామమందిర నిర్మాణం కోసం పోరాడారని, వీరికి ట్రస్టులో ఏదో ఒక పాత్ర కల్పించాలని శరద్ శర్మ సూచించారు.

అయోధ్యలోని ఏదైనా ప్రధాన ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయోధ్యలో బాబ్రీ మసీదున్న ప్రదేశానికి దగ్గర్లోనే ఈ స్థలాన్ని కేటాయించాలని స్థానిక ముస్లింలు కోరుతున్నారు.

మసీదుకు స్థలం ఎక్కడ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చాలా మంది స్థానిక హిందువులు చెబుతున్నారు. బీబీసీతో మాట్లాడిన హిందూ పూజారుల్లో అత్యధికులు మాత్రం ఈ మసీదును అయోధ్య పట్టణంలో ఎక్కడా నిర్మించకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్యలో అత్యధికంగా హిందూ ఆలయాలే ఉన్నాయి.

అయోధ్య పట్టణంలో పాత, ప్రస్తుత మసీదులు కూడా ఉన్నాయి. కొత్త మసీదును అయోధ్య ప్రధాన పట్టణం వెలుపల కట్టొద్దని ముస్లింలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల ఘన విజయం

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి'

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి