మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

  • 12 నవంబర్ 2019
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్

మహారాష్ట్ర గవర్నర్ విధించిన గడువులోగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫార్సు చేశారు. కేంద్ర క్యాబినెట్ కూడా ఆ సిఫార్సును అంగీకరించింది. ఆ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

దాంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడై 18 రోజులైంది. కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. శివసేన-బీజేపీల మధ్య ఎన్నికల ముందు పొత్తు ఉంది. కానీ, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. రెండున్నర సంవత్సరాల పాటు తమ పార్టీకి కూడా సీఎం పీఠం ఇచ్చేలా ఉంటే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన అంగీకరించింది. కానీ బీజేపీ దీనికి సిద్ధంగా లేదు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ, అక్కడ ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. బీజేపీకి 105 సీట్లు రాగా, శివసేనకు 56, ఎన్సీపీకి 54 సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి.

రాష్ట్రపతి పాలనకు దారితీసిన పరిణామాలేంటి?

ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకు రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు.

మోదీ ప్రభుత్వంలో శివసేనకు చెందిన ఏకైక మంత్రి అర్వింద్ సావంత్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.

ఎన్డీయే నుంచి బయటకు రావాలనే షరతును అమలు చేసిన తర్వాత తనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమ పార్టీ నేతలకు దక్కుతుందని శివసేన భావించింది.

అర్వింద్ సావంత్ రాజీనామా తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా తమ వ్యూహాల్లో మునిగిపోయాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ సోమవారం రాత్రి 7.30 వరకూ సమయమిచ్చి, ఆ లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖ ఇవ్వాలని శివసేనకు సూచించారు.

ఆ సమయం ముగిసిపోయింది. కానీ కాంగ్రెస్ నుంచి శివసేనకు ఎలాంటి మద్దతు లేఖా అందలేదు. ఉద్ధవ్ ఠాక్రేనే ముఖ్యమంత్రి పదవిని చేపడతారనే ఊహాగానాలు వినిపించాయి. సమయం ముగిసేవరకూ అంతా కాంగ్రెస్ నుంచి లేఖ కోసం ఎదురుచూశారు, కానీ అది రాలేదు.

దీంతో, గడువును పొడిగించాలని శివసేన పార్టీ గవర్నర్‌ను కోరింది. కానీ దానికి ఆయన నిరాకరించారు. మరో రెండు రోజులు సమయం కావాలని ఆదిత్య ఠాక్రే కోరారు. అప్పటి వరకూ శివసేన నేత సంజయ్ రౌత్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఉన్నట్లుండి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

శివసేనకు అదనపు సమయం నిరాకరించిన గవర్నర్ కోష్యారీ.. ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.

గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన తర్వాత ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు.

"ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ మాకు ఆహ్వానం పంపారు. మాకు 24 గంటల సమయం ఇచ్చారు. మా మిత్రపక్షం కాంగ్రెస్‌తో ముందు చర్చించాలి. ఆ తర్వాతే మేం ఏ నిర్ణయమైనా తీసుకోగలం. ఒకవేళ ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారు" అని మాలిక్ వ్యాఖ్యానించారు.

అందరూ ఊహించినట్లుగానే గడువు ముగిశాక గవర్నర్, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల ఘన విజయం

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి'

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి