సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి.. దిల్లీ హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం కోర్టు

  • 13 నవంబర్ 2019
సుప్రీంకోర్టు Image copyright Getty Images

బుధవారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అనే పిటిషన్‌పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వ్ చేసింది.

‘‘న్యాయ స్వతంత్రతను పారదర్శకత తక్కువ చేయలేదు’’ అని ఈ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

అయితే, సమాచార హక్కు, గోప్యత హక్కు మధ్య.. గోప్యత, న్యాయ స్వతంత్రత మధ్య చక్కని సమన్వయం ఉండాలని వెల్లడించింది.

పారదర్శకతే న్యాయ స్వతంత్రతను బలోపేతం చేస్తుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.

సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(హెచ్) ప్రకారం సీజేఐ కార్యాలయం పబ్లిక్ అథారిటీనే అని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన తరపున అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. సమాచారం సరైన రీతిలో అందరికీ అందాలంటే కోర్టుల్లో సరైన వ్యక్తుల నియామకం జరగాలి అని ఆయన అన్నారు.

"సుప్రీంకోర్టులో నియామకాలు, బదిలీలు అంతా రహస్యమే. చాలా కొద్దిమందికే వాటి గురించి తెలుస్తుంది. పారదర్శకత ఆవశ్యకత గురించి కోర్టు ఎన్నో సందర్భాల్లో తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పింది. కానీ సుప్రీంకోర్టు దగ్గరకి వచ్చేసరికి, అది వ్యవహరిస్తున్న తీరు హర్షణీయం కాదు. జడ్జిల నియామకం, బదిలీల్లో పారదర్శకత అవసరం ఎంతో ఉంది. ఇదంతా జరగాలంటే సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి రావాలి" అని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

Image copyright PTI
చిత్రం శీర్షిక సీజేఐ రంజన్ గొగొయ్

అసలు వివాదం ఏంటి?

ఆర్టీఐ కార్యకర్త, 'మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్' వ్యవస్థాపక సభ్యుడు, సమాచార హక్కు ఉద్యమం (ఎన్సీపీఆర్ఐ) కో-కన్వీనర్ అయిన నిఖిల్ డే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

"సుప్రీంకోర్టులో జడ్జిలుగా నియామకమైన వారు తమ ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పిస్తారా లేదా అని ఆర్టీఐ ద్వారా అడిగాం. దీనిపై సమాచారం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. కానీ, ఇది ప్రభుత్వ కార్యాలయం, కాబట్టి సమాచారం ఇవ్వాల్సిందే అని సమాచార కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. వింత ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని హైకోర్టులో అప్పీల్ చేసింది. మొదట ఏక సభ్య బెంచ్, ఆ తర్వాత ఫుల్ బెంచ్ దీనిపై నిర్ణయాన్ని వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, జడ్జిలు తమ ఆస్తులను వెల్లడించాలని స్పష్టం చేసింది.

ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులోనే సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు తన ఆదేశాలను ఇప్పుడు వెల్లడించబోతోంది" అని నిఖిల్ అన్నారు.

"పారదర్శకత, ఆర్టీఐ.. సుప్రీం కోర్టు నుంచే ప్రారంభం కావాలి. ఆర్టీఐని కోర్టు పక్కన పెట్టకూడదు. జడ్జిల నియామకాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కొలీజియం తన నిర్ణయాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇక్కడ కూడా పారదర్శకత అవసరం. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి రావాలి" అని నిఖిల్ అభిప్రాయపడ్డారు.

"చట్టం చాలా స్పష్టంగా ఉంది. దాని పరిధి చాలా విస్తృతం. దీనిలోకి సుప్రీంకోర్టు వస్తుందా రాదా అనే అనుమానమే సరికాదు. కచ్చితంగా వస్తుంది" అని నిఖిల్ అన్నారు.

సమాచార హక్కు చరిత్ర

ఆర్టీఐ చట్టం ప్రపంచంలో మొదటిసారిగా స్వీడన్‌లో 1766లో అమల్లోకొచ్చింది. 1978లో ఫ్రాన్స్ దీన్ని అమలు చేసింది. 1982లో కెనడాలో, 2005లో భారత్‌లో ఈ చట్టం అమల్లోకొచ్చింది.

స్వీడన్‌లో సమాచారం తీసుకోవడానికి ఎలాంటి ఫీ చెల్లించనవసరంలేదు, సమాచారం వెంటనే ఇవ్వాలి. కానీ భారత్‌లో దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా నెల రోజుల వ్యవధి పడుతుంది.

వచ్చిన సమాచారంతో సంతృప్తి చెందకపోతే, అప్పీలేట్ ఆఫీసర్‌కు మొదటి అప్పీల్ చెయ్యవచ్చు. అక్కడా సరైన సమాచారం లభించకపోతే 90 రోజుల్లోపు రాష్ట్ర లేదా కేంద్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీల్ చేయవచ్చు.

కమిషన్ ఈ అప్పీళ్లపై 45రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

యువకుడిపై నలుగురి అత్యాచారం... ముంబైలో మూడు గంటల పాటు నరకం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ