‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - రామ్‌ లల్లా తరపు న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్

  • 13 నవంబర్ 2019
అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం ఒక గుడారం ఏర్పాటు చేసి, అందులో లామ్ లల్లా విరాజ్‌మాన్ (చిన్నారి రాముడు, దేవుడు) విగ్రహాన్ని పెట్టి పూజలు ప్రారంభించారు. ఇక్కడ రక్షణగా సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. 1992 డిసెంబర్ 8వ తేదీన తీసిన చిత్రం. Image copyright Getty Images
చిత్రం శీర్షిక అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం ఒక గుడారం ఏర్పాటు చేసి, అందులో రామ్ లల్లా విరాజ్‌మాన్ (చిన్నారి రాముడు) విగ్రహాన్ని పెట్టి పూజలు ప్రారంభించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ.. ఇక్కడ రక్షణగా సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. 1992 డిసెంబర్ 8వ తేదీన తీసిన చిత్రం ఇది

సి.ఎస్.వైద్యనాథన్.. అయోధ్య కేసులో రామ్ లల్లా (దేవుడు) తరఫున సుప్రీంకోర్టులో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ప్రకటించగా.. దాని మీద న్యాయ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తీర్పు మీద విమర్శల నేపథ్యంలో వైద్యనాథన్ బీబీసీతో మాట్లాడారు. కొన్ని కీలక పరిశీలనల గురించి వివరణ ఇచ్చారు.

ప్రశ్న: సుప్రీంకోర్టు తీర్పులో 'హక్కు' యోగ్యత అనే దానికన్నా 'విశ్వాసం' అనేది నిర్ణయాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు ఏమంటారు?

వైద్యనాథన్: కక్షిదారుడు దేవుడు. ఈ స్థల వివాదంలో ఆ వివాదాస్పద స్థలానికి రామజన్మభూమి న్యాస్ ప్రాతినిధ్యం వహించింది. ఈ కేసులో ఒక మధ్యవర్తి ప్రాతినిధ్యం కావాలి కనుక న్యాస్ ఆ పని చేసింది. దేవుడు వచ్చి కేసును వాదించలేడు. కాబట్టి దేవుడి తరఫున మేం వాదించి పరిష్కారం పొందాం.

ప్రశ్న: విశ్వాసం అనేది ఒక కోణం. కానీ కొందరు న్యాయ కోవిదులు ఎత్తిచూపినట్లు.. హక్కు యోగ్యత అనేది ఈ తీర్పులో ఇంకా అస్పష్టంగానే ఉంది.

వైద్యనాథన్: కేవలం విశ్వాసం మాత్రమే ఈ తీర్పుకు ప్రాతిపదికగా ఉందనటం తప్పు. ఆలయ నిర్మాణం కోసం నెలకొల్పబోయే ట్రస్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో విశ్వాసానికి ఎటువంటి పాత్రా లేదు.

చిత్రం శీర్షిక సి.ఎస్.వైద్యనాథన్

ప్రశ్న: మీరు విశ్వాసం అనే వాదనను ఆశ్రయించారని న్యాయ నిపుణుల్లో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. హక్కు కేసులో యోగ్యత కోణం మీద మీకు విశ్వాసం లోపించిందని ఇది సూచించటం లేదా?

వైద్యనాథన్: ఈ హక్కు కేసును 1989లో వేశారు. అప్పుడు దేవుడి తరఫున మాజీ న్యాయమూర్తి దేవికీనందన్ జీ ప్రాతినిధ్యం వహించారు. ఆరంభంలో ఆయన 'విశ్వాసం' గురించి గట్టిగా పట్టుపట్టారు. కానీ ఆ తర్వాత ఆ అంశాన్ని విడిచిపెట్టారు. ఈ కేసులో 'విశ్వాసం' అనేదాని పాత్ర ఏమీ లేదు.

ప్రశ్న: ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు.. విశ్వాసం వాదన నుంచి తప్పుకున్నారు. దానివల్ల.. అది కేవలం ఒకే ఒక న్యాయమూర్తి రాసిన, చేవ్రాలు లేని ఒక అనుబంధంగా మారిపోయింది.

వైద్యనాథన్: రామ జన్మభూమి సరిగ్గా ప్రధాన గోపురం కిందనే ఉందని ఐదో న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు తన ముందు ప్రవేశపెట్టిన నిజాలు, ఆధారాలతో సంతృప్తి చెందిన తర్వాతే ఈ పరిశీలనలు వచ్చాయి. దాని మీద తమ అభిప్రాయాలు రాయటం ముఖ్యమని మిగతా న్యాయమూర్తులు భావించలేదు.

ప్రశ్న: వివాదాస్పద స్థలాన్ని న్యాయపరిధిలో వ్యక్తిగా గుర్తించాలన్న మీ వాదనను కోర్టు తిరస్కరించింది.

వైద్యనాథన్: అక్కడ ఇద్దరు కక్షిదారులు ఉన్నారు. ఒకరు దేవుడు. మరొకరు జన్మస్థలం. కోర్టు మొదటి కక్షిదారుని న్యాయపరిధిలో వ్యక్తిగా అంగీకరించింది. అలా అంగీకరించటానికి కోర్టు 15 నుంచి 20 కారణాలు తెలిపింది.

భక్తుల హక్కులను కాపాడటానికి న్యాయపరిధిలో వారిని వ్యక్తిగా అంగీకరించానని చెప్పింది. కోర్టు ఇలా అంగీకరించినపుడు.. జన్మస్థలానికి వేరేగా లేదా అదే న్యాయపరిధి వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదు.

Image copyright Getty Images

ప్రశ్న: మసీదు పూర్తిగా స్వాధీనంలో ఉందనటానికి సాక్ష్యాలు లేవన్న వాదనలను చూసినపుడు.. హిందువుల హక్కును అవి బలపరుస్తాయా? ఆలయం పూర్తి స్వాధీనంలో ఉందనటానికి కూడా సాక్ష్యాలు లేవు కదా?

వైద్యనాథన్: భారతదేశంలో ఎక్కడైనా కానీ, ఆమాటకొస్తే ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ.. స్వాధీనంలో ఉండటానికి సంబంధించి ఎన్నడూ లిఖిత సాక్ష్యం ఉండేది కాదు.

మేము కోర్టుకు సమర్పించిన లిఖిత సాక్ష్యం.. వివాదాస్పద స్థలం నుంచి సేకరించిన రాళ్లలో ఒక దానిపై గల 12వ శతాబ్దపు శాసనం. తవ్వకాల సందర్భంగా వెలికితీసిన శాసనాలు, ఆ కాలానికి చెందిన వివిధ యాత్రికులు, చరిత్రకారుల పరిశీలనలను మేం సాక్ష్యాలుగా సమర్పించాం.

ఆ స్థలాన్ని రామ జన్మభూమిగా పరగణించేవారని, అక్కడ పూజలు చేసేవారని వాళ్లందరూ అంగీకరించారు. ఇది మా సాక్ష్యం. ఆ కాలంలో హిందువులు నిరంతరం పూజలు నిర్వహించేవారని మేం నొక్కిచెప్పాం. కోర్టు మా వాదనతో సంతృప్తి చెందింది.

ప్రశ్న: వెలుపలి ఆవరణ మీద స్వాధీన హక్కును, సుదీర్ఘ కాలం నిరంతరం పూజలు చేస్తున్నారని కోర్టు నిర్ణయించటం సరైనదేనని అంగీకరించినప్పటికీ.. తుది తీర్పులో ముస్లింల స్వాధీనంలో ఉండిన లోపలి ఆవరణ గురించిన ఇతర నిర్థారణలకు అనుగుణంగా ఉన్నట్లు కనిపించదు.

వైద్యనాథన్: అదంతా ఒకే సంపూర్ణ మొత్తమని, దానిని వేరువేరుగా చూడరాదని, భాగాలుగా విభజించరాదని మేం వాదించాం. ఈ వాదనను కోర్టు అంగీకరించింది. 1855 సంవత్సరానికి ముందు మేం లోపలి ఆవరణలో పూజలు చేస్తుండేవారిమని కోర్టు అంగీకరించింది.

బ్రిటిష్ వాళ్లు అడుగుపెట్టి లోపలి ఆవరణను, వెలుపలి ఆవరణను విభజించారు. కానీ లోపలి ఆవరణలో కూడా హిందువులు పూజలు చేశారనే సాక్ష్యాలను మేం సమర్పించాం.

పది అడుగుల నలుచదరపు విస్తీర్ణం గల ఒక గదిని.. కౌశల్య రాముడికి జన్మనిచ్చిన కాన్పుగది అని చెప్పలేం. అది ఓ పెద్ద రాజభవనంగా ఉండేది. ఎవరైనా సరే.. ఈ వాస్తవాన్ని విస్మరించి ఈ తీర్పును విమర్శించాలని నేను అనుకోను.

Image copyright KK MUHAMMED

ప్రశ్న: 1588 - 1857 మధ్య నమాజ్ చేసినట్లు సాక్ష్యాలు లేవని తీర్పు చెప్తోంది.

వైద్యనాథన్: బాబ్రీ మసీదు లేదా సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన వారు కూడా.. 1856 తర్వాత మాత్రమే నమాజు చేసేవారని అంగీకరించారు.

ప్రశ్న: ఒక మసీదును 1528లో నిర్మించారు.. 1992లో ధ్వంసం చేశారు - అనేది నిర్వివాదాంశం. విగ్రహాలు పెట్టటం, కూల్చివేయటం అపవిత్రం చేయటమని, చట్టవ్యతిరేకమని కూడా అంగీకరించింది.

వైద్యనాథన్: చూడండి, విగ్రహాలు లేకుండా కూడా పూజలు జరిగాయి. హిందువుల ప్రకారం.. విగ్రహం అనేది కేవలం ప్రతీకాత్మకమే. మా విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపటానికి మాకు ఒక విగ్రహం అవసరం లేదు.

అది మా భక్తి స్థలం అయినట్లయితే, అక్కడికి పూజలు చేయటానికి మేం వెళుతున్నట్లయితే, అక్కడ మేం సాంత్వన పొందుతున్నట్లయితే.. ఒక విగ్రహం అవసరం లేదు. అక్కడ విగ్రహాలు ఎవరు పెట్టారనే దానివల్ల తేడా ఏమీ ఉండదు.

ప్రశ్న: 1528 - 1857 మధ్య హిందువులు అక్కడ పూజలు చేసేవారని అనటానికి సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా?

వైద్యనాథన్: ఉన్నాయి. సాక్ష్యాలున్నాయి. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన యాత్రికులు రాసిన చాలా యాత్రావిశేషాల్లో.. ఆ వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేయటం గురించి ఉటంకించారు.

అందుకే కోర్టు యాత్రికుల రచనలను పరిగణనలోకి తీసుకుని, ఆ కాలంలో హిందువులు నిరంతరం పూజలు చేసేవారని అంగీకరించింది.

Image copyright MANSI THAPLIYAL

ప్రశ్న: అలాంటపుడు.. 1949లో విగ్రహాలను పెట్టటం, 1992లో మసీదును కూల్చటం చట్టవిరుద్ధమని ఈ తీర్పు చెప్తోంది. ఇది గందరగోళం సృష్టిస్తోంది.. ఒకదానిని చట్టవిరుద్ధంగా గుర్తించి- ఆ పనిచేశారన్న అభియోగాలు ఉన్న వారికి హక్కులు దఖలు పరిచారు.

వైద్యనాథన్: నేను.. 142వ అధికారణకు మినహా.. 1992 ప్రస్తావన అవసరం లేదని అనుకుంటున్నా. ముస్లింలకు పరిహారం ఇవ్వాలని కోర్టు కోరుకుందని.. అందుకోసమే తీర్పులో 1992 గురించి ప్రస్తావించిందని నేను భావిస్తున్నా.

అయినా దీనిని ఇలా చూడవచ్చు.. హక్కు కేసు ఎప్పుడు నమోదు చేశారు? 1950లో, 1961లో, 1989లో. దాని తర్వాత ఏం జరిగిందనే దానితో.. ఈ కేసుకు సంబంధించినంతవరకూ నిమిత్తం లేదు.

ఆర్టికల్ 142 కింద ముస్లింలకు పరిహారం ఇవ్వటం కోసం మాత్రమే సుప్రీంకోర్టు 1992 అంశాన్ని చేర్చినట్లు కనిపిస్తోంది. ఇది ఒక లౌకిక దేశం. చట్టపాలన అమలులో ఉంది. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి వీలు లేదు.

అపవిత్రం చేసిన ఆ రెండు సంఘటనలూ అసలంటూ జరిగి ఉండరాదని ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడటానికి ఇదే కారణం. హక్కు కేసును నిర్ణయించటానికి ఇది అవసరం లేదు. కానీ.. ఆర్టికల్ 142 కింద ముస్లిం పక్షాలకు పరిహారం ఇవ్వటం కోసం మాత్రమే దీనిని ఉటంకించారని నేను భావిస్తున్నా.

Image copyright MANSI THAPIYAL

ప్రశ్న: కోర్టు ఆ మొత్తం నిర్మాణాన్ని విభజించటానికి బదులుగా ఒక సంపూర్ణ మొత్తంగా పరిగణించింది.

వైద్యనాథన్: ఆ స్థలాన్ని మూడు పక్షాల మధ్య విభజించాలని అలహాబాద్ హైకోర్టు నిర్ణయించటం తప్పు. దానిని సుప్రీంకోర్టు సరిచేసింది. సంపూర్ణ నిర్మాణం మొత్తం దేవుడి స్వాధీనంలోకి రావాలని మేం వాదించాం. సుప్రీంకోర్టు అంగీకరించింది.

ప్రశ్న: చాలా మంది స్వతంత్ర పురాతత్వశాస్త్రవేత్తలు తప్పుపట్టిన ఏఎస్ఐ తవ్వకాల నిర్ధారణలను మీరు విస్తారంగా ఉదహరించారు.

వైద్యనాథన్: మసీదు గోపురం కింద.. గతంలో ఎటువంటి నిర్మాణం లేదని, దేని మీదా ఆ మసీదును నిర్మించలేదని ముస్లింలు తమ వాదనలో చెప్పారు. కానీ.. అక్కడ విస్తృతమైన నిర్మాణం ఉందని తవ్వకాలు చూపాయి.

కొందరు చరిత్రకారులు వచ్చి.. ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న గోడ ఒక ఈద్గా గోడ అని చెప్పారు. అది ఖాళీ స్థలమని ముస్లింలు చేసిన వాదన తప్పు అని నిరూపితమైంది.

ప్రశ్న: కానీ.. మసీదును నిర్మించటానికి దాని కింద ఉండిన ఆలయాన్ని కూల్చివేశారని ఏఎస్ఐ నివేదిక చెప్పటం లేదు కదా. మీరు ఏమంటారు?

వైద్యనాథన్: అవును. ఒక ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదును నిర్మించారని ఏఎస్ఐ నివేదిక చెప్పటం లేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నానావతి కమిషన్: గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్.. ‘హింస నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు’

పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా.. శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా

సుప్రీం కోర్టు: ‘హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ’

సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని

BHU: సంస్కృతం ప్రొఫెసర్ ఫిరోజ్ ఖాన్ రాజీనామా.. ధర్నా విరమించుకున్న విద్యార్థులు

రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది

ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి

తీహార్‌ జైల్లో దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌... బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లు