'అయోధ్య పీటముడిలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చిక్కుకుపోయింది’ : అభిప్రాయం

  • 14 నవంబర్ 2019
రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు, ఇందిరాగాంధీ Image copyright AFP

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎంత పురాతనమైనదో 'అయోధ్య వివాదం' కూడా అంతే పురాతనమైనది బహుశా అత్యంత విడ్డూరమైన కాకతాళీయం.

'జనమ్ ఆస్థాన్' గురించి ఫైజాబాద్ కోర్టులో మొట్టమొదటి కేసు దాఖలైంది 1885 జనవరిలో. అదే ఏడాది డిసెంబర్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే రాజకీయ సంస్థ ఏర్పాటైంది.

స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ వైఖరిని రెండు అంశాలు నిర్వచించాయి.

మొదటిది కాంగ్రెస్‌లో సంప్రదాయవాదులు అత్యధికంగా కాకపోయినా గణనీయ సంఖ్యలో ఉన్నారు. కానీ వారి సంప్రదాయవాదం దురభిమానంతో కూడుకున్నది కానీ.. ముస్లింల పట్ల ద్వేషంతో కూడుకున్నది కానీ కాదు.

ఈ సంప్రదాయవాద కాంగ్రెస్‌వాదులు ముస్లింలతో శత్రుత్వం లేకుండానే హిందూ మనోభావాలను గౌరవించటం సాధ్యమని విశ్వసించేవారు. గోవింద్ వల్లభ్ పంత్ సారథ్యంలోని ఈ నాయకులు తమ సొంత వివేక మార్గాన్ని నిజాయితీగా నమ్మారు.

రెండో పాయ - స్వతంత్ర భారతదేశం ఆధునిక రాజ్యంగా మాత్రమే ఉండాలని, మెజారిటీ, మైనారిటీ మనోభావాలతో నిమిత్తం లేకుండా చట్టాన్ని అమలు చేయాలని విస్పష్టంగా భావించేది. ఈ వర్గానికి సర్దార్ పటేల్ సారథ్యం వహించేవారు.

Image copyright Getty Images

ఈ నేపథ్యంలో ఫైజాబాద్‌లోని బాబ్రీ మసీదులో 1949 డిసెంబర్ 22-23 రాత్రి రామ్ లల్లా విగ్రహాలను దొంగతనంగా పెట్టినపుడు పంత్ సారథ్యంలోని యునైటెడ్ ప్రావిన్స్ ప్రభుత్వం వేగంగా హిందూ సమాజానికి చెందిన కలహప్రియులకు అండగా నిలిచింది. ఈ వైఖరి సర్దార్ పటేల్‌కు మింగుడుపడలేదు.

ఆయన 1950 జనవరి 9న పంత్‌కు ఒక లేఖ రాశారు. ఆధునిక రాజనీతి మొదటి సూత్రాన్ని పునరుద్ఘాటించారు: ''ఇటువంటి వివాదాలను బలప్రయోగం ద్వారా పరిష్కరించే ప్రసక్తే లేదు. అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే చట్టాన్ని అమలు చేసే బలగాలు ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతిని నెలకొల్పాల్సి ఉంటుంది. శాంతియుత, ఒత్తిడి పద్ధతులను అనుసరించాలంటే.. దురాక్రమణ, నిర్బంధ వైఖరి ప్రాతిపదికగా చేపట్టే ఎటువంటి ఏకపక్ష చర్యా ఆమోదనీయం కాదు.''

ఏదేమైనా, అవి స్వతంత్ర భారతదేశపు తొలి రోజులు. బాగా తెలిసిందే అయినా హానికరం కానిదిగా కనిపించిన ఈ వివాదం కన్నా అత్యవసర సమస్యలు జాతీయ నాయకుల ముందు చాలా ఉన్నాయి. జాతీయ నాయకులు కొత్త రాజ్యాంగానికి తుది మెరుగులు దిద్దటంలో తలమునకలై ఉన్నారు. రానున్న సంవత్సరాలు, దశాబ్దాల్లో ఒక నూతన లౌకిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పూర్తి ధీమాతో ఉన్నారు.

అయోధ్యలో న్యాయ ప్రక్రియ మొదలైనపుడు ఒక విధమైన యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. 'వివాదాస్పద స్థలాని'కి తాళాలు వేశారు. నెహ్రూ ఆశించిన భారతదేశం సాకారమవుతోంది. ఉదారవాద, సామ్యవాద, బహుళవాద, లౌకికవాద ఆదర్శాలు, సిద్ధాంతాలు, ఆచరణలు ఒక రకంగా అజేయమైన మేధో శక్తిని సంతరించుకున్నాయి.

హిందూ మహాసభ, కొత్తగా రూపొందిన భారతీయ జన సంఘ్ వంటి 'మత/మతతత్వ' శక్తులు తమను తాము హిందూ మెజారిటీల అధికారిక స్వరంగా ప్రతిష్ఠించుకోవటంలో స్పష్టంగా విఫలమయ్యాయి. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఈ సంస్థలు చాలా పేలవమైన ఫలితాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒరవడి మీద పూర్తి పట్టును నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది.

కాంగ్రెస్ మెజారిటీ సమాజానికి చెందిన పార్టీగా ఉంటూనే ముస్లిం నాయకులను, మనోభావాలను కూడా తేలికగా ఇముడ్చుకోగల నైపుణ్యాలు, సంసిద్ధత ఉన్నట్లు కనిపించింది.

కాంగ్రెస్ పార్టీ బలంగా, సమైక్యంగా, ఆధిపత్యంలో ఉన్నంతవరకూ, దేశంలోని మతతత్వ, మత శక్తులకు మన జాతీయ భావనలో చోటు లభించలేదు. అయితే 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులు అంతర్గత నాయకత్వ వివాదాలలో మునిగిపోయిన తర్వాతే ఆ పార్టీ లౌకిక విస్పష్టతను కోల్పోవటం మొదలైంది.

మరోవైపు ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజాభరణాలను రద్దు చేసిన తర్వాత రాజవంశాలను ఆమెకు వ్యతిరేకంగా మోహరించటంలో మతపరమైన హిందూ రాజకీయ శక్తులు తెలివిగా సఫలమయ్యాయి. ఇలా ఏకమైన భూస్వామ్య, మతతత్వ సంస్థల కూటమికి, నెహ్రూవాద వ్యవస్థకు బలమైన చాలెంజ్‌ను విసరగల సామర్థ్యం ఉండింది. కానీ, గణతంత్ర దేశ లౌకిక స్వభావాన్ని పునరుద్ధరించటానికి ఇందిరాగాంధీ వేగంగా, ఆలోచనాత్మకంగా ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులను ముందుకు నడిపించారు.

Image copyright Getty Images

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లౌకికవాద రాజనీతికి సంబంధించిన వ్యూహాత్మక స్పష్టతను కోల్పోవటం మొదలైంది.

అనుభవం లేని, ఎలాంటి రాజకీయ వాదాలంటని ఈ ప్రధానమంత్రిని అరకొర సలహాదారులు, నెహ్రూ-గాంధీల ఘన వారసత్వం గురించి ఏమాత్రం తెలియని వారు చుట్టూ చేరి అత్యంత తెలివైన నేతగా కీర్తించడం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ దూరం పెట్టిన చాలా శక్తులకు ఆయన రాక ఒక అవకాశంగా కనిపించింది.

అత్యంత తప్పుడు సలహాతో కూడినదే అయినా అత్యంత విజయవంతమైన 1984 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే మెజారిటీ మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ మట్టి కరిచినప్పటికీ (లోక్‌సభలో రెండు సీట్లకు దిగజారింది), సంఘ్ పరివార్ మాత్రం ఒక కచ్చితమైన నిర్థారరణకు వచ్చి ఉంటుంది. అది: కాంగ్రెస్ ఇలా చేయగలిగితే.. తామెందుకు చేయలేం?

అతి త్వరలోనే, ఒక కొత్త ఆచరణాత్మక ప్రధానమంత్రి, ఆయన ఆచరణాత్మక, సిద్ధాంత రహిత సలహాదారుల బృందం - వారికి దేవుడు పంపిన అవకాశం అన్నట్లుగా లభించింది.

Image copyright EPA

షా బానో ఉదంతం జరిగింది. ఆ తర్వాత 1986 ఫిబ్రవరిలో అయోధ్య తాళాలు తెరిచారు. అకస్మాత్తుగా, మతతత్వ వాదనలు, మతతత్వ వ్యక్తులు, మతతత్వ ప్రదర్శనలు గౌరవప్రదంగా మారిపోయాయి. రాజీవ్‌గాంధీ తప్పులు, తప్పుడు లెక్కలు.. అయోధ్య చర్చ పునరుద్భవానికి మార్గం పరిచాయి. ఆ చర్చ విధివిధానాలను సంఘ్ పరివార్ శాసిస్తుంది.

ఇందిరాగాంధీ రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎల్.ఫోతేదార్ తన స్వీయ జ్ఞాపకాలు 'ది చినార్ లీవ్స్'లో విచారంగా ఇలా రాశారు: ''ఇందిరాజీతో ఎంతో సన్నిహితంగా పనిచేసివున్న నాకు, నెహ్రూ-గాంధీ కుటుంబ స్వభావానికి ఏమాత్రం సంబంధం లేని పనులు రాజీవ్‌జీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.''

రాజీవ్‌ గాంధీ స్వల్ప, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమాయకంగా ప్రయత్నిస్తోంటే.. సంఘ్ పరివార్ తన పాత దుగ్ధను - 'ఈ నేల హిందువులకు చెందుతుంది.. రాజ్యాంగ నిర్మాణం హిందువులకు సంతృప్తికరంగా ఎలా పనిచేయాలో నిర్దేశించాల్సింది హిందువులే (సంఘ్ పరివార్ నిర్వచించినట్లుగా కానీ.. 'లౌకిక' మంద నిర్వచించినట్లు కాదు)' అనేది - పునరుద్ధరించటానికి భీష్మించుకుంది.

రాజీవ్ గాంధీ తర్వాత పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు, భారతదేశ తక్షణ ప్రాధాన్యం ... పేలికలై దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యవంతమైన స్థితికి పునరుద్ధరించటమని ఆయన సూక్షబుద్ధితో గ్రహించారు.

రెండు వైపుల యుద్ధాలు చేసే శక్తి గానీ, మద్దతు గానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఆయనకు లేవు. అయోధ్యలో మందిర్ గుంపు విధ్వంసం దాని స్థానిక ముగింపునకు - బాబ్రీ మసీదు కూల్చివేతకు - తీసుకెళ్లనిచ్చారు. 1992 డిసెంబర్ 6వ తేదీ నాటి విధ్వంసం ముందే నిర్ణయమైన ముగింపు.

Image copyright PRAVEEN JAIN

అప్పటి నుంచి బీజేపీని, దాని మతతత్వ అజెండాను ఢీకొట్టటానికి కాంగ్రెస్ తన లౌకిక నటనల ధైర్యాన్ని ఎన్నడూ ప్రోది చేసుకోలేదు. అయోధ్య బంతిని సుప్రీంకోర్టు ఆవరణలోకి నెట్టి సరిపుచ్చుకుంది. పర్యవసానంగా, అయోధ్య మీద సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని, ఆమోదించాలనే మంత్రం జపించటం ఆ పార్టీకి ఊరటగానూ, సౌకర్యవంతంగానూ కనిపించింది.

ఇక 2014 ఎన్నికల అనంతరం 'ఎ.కె.ఆంటోని సిద్ధాంతం' అని పిలిచే - కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓడిపోయిందంటే అందుకు కారణం అది తనను తాను హిందూయేతర సంస్థగా చూసేందుకు అనుమతించటం వల్లనే అనే సిద్ధాంతం - భారాన్ని మోస్తోంది.

కాబట్టి, మందిర్ వహీ బనేగా (అక్కడే మందిరం నిర్మితమవుతుంది) అని సుప్రీంకోర్టు చెప్పినపుడు, కోర్టు తీర్పును అంగీకరించటం మినహా కాంగ్రెస్‌కు గత్యంతరం లేకపోయింది. రాజీవ్‌గాంధీ తప్పులు, పొరపాట్లకు అది మూల్యం చెల్లిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)