కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?

  • 14 నవంబర్ 2019
మోదీ Image copyright Reuters

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు పెద్ద పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఒకటి ఆగస్టు 5న, మరొకటి నవంబర్ 9న జరిగాయి.

ఆగస్టు 5న ఆర్టికల్ 370ని సవరించి, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం తొలగించింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

సుదీర్ఘంగా సాగిన బాబ్రీ మసీదు-రామ మందిర వివాదంపై నవంబర్ 9న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివాదాస్పద భూమిని హిందూ పక్షానికి చెందుతుందని ప్రకటించి, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తదుపరి దృష్టి పెట్టే అంశం ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యాల్లో ఉమ్మడి పౌర స్మృతి అన్నింటికన్నా ముందుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం, పౌరసత్వ చట్టం చేయడం కూడా ఈ జాబితాలో ఉంటాయని చెబుతున్నారు.

Image copyright Getty Images

బీజేపీ ఎజెండాలో ఆర్టికల్ 370, అయోధ్య, ఉమ్మడి పౌర స్మృతి ప్రధానాంశాలని సీనియర్ పాత్రికేయుడు ప్రదీప్ సింగ్ అన్నారు.

ఈ మూడింటిలో రెండు దాదాపు పూర్తైపోయాయి. మిగిలింది ఉమ్మడి పౌర స్మృతి అంశమే.

కానీ, ఉమ్మడి పౌర స్మృతి కన్నా ముందు ఎన్ఆర్‌సీ అమలు, పౌరసత్వ బిల్లు తేవడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టొచ్చని ప్రదీప్ సింగ్ అంటున్నారు.

''వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎన్ఆర్‌సీ, పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా కృషి చేసింది. ఈ రెండు అంశాలకు ఇటీవల కాలంలో బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రజల అంగీకారం పొందాల్సి ఉంటుంది. అందుకే తర్వాత దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టొచ్చు'' అని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

ఉమ్మడి పౌర స్మృతి అంటే..

మతం, వర్గంతో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా వర్తించే పౌర చట్టం.

వివాహం, విడాకులు, ఆస్తుల పంపకం లాంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని మతాలకూ ఒకే లాంటి నియమనిబంధనలు ఉమ్మడి పౌర స్మృతి ద్వారా వర్తిస్తాయి.

ప్రస్తుతం స్థూలంగా చూసుకుంటే భారత్‌లోని చట్టాలు రెండు రకాలు. ఒకటి సివిల్, రెండోది క్రిమినల్.

వివాహం, ఆస్తులు, వారసత్వం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నీ సివిల్ చట్టాల కింద ఉంటాయి.

Image copyright Reuters

ఆర్టికల్ 370కి మించిన సవాలు

ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కొన్ని నెలల క్రితం అన్నారు.

ప్రస్తుత లోక్‌సభ మొదటి సమావేశంలోనే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్‌ను లేవనెత్తారు.

అయితే, ఈ ఉమ్మడి పౌరస్మృతిని తేవడం అంత సులువు కాదని ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.

''వివాహం, అస్తులకు సంబంధించి వ్యవహారాలకు ఇప్పుడు మతాన్ని బట్టి చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి. అందరికీ ఒకేలా నియమనిబంధనలు తెస్తే కొన్ని వర్గాలు నష్టపోవచ్చు. కొందరికి లాభం కలగొచ్చు. అందరినీ సమాన స్థాయికి తెచ్చేలా సర్దుబాట్లు చేయడం చాలా కష్టం'' అని అన్నారు.

ఆర్టికల్ 370 సవరణ కన్నా ఉమ్మడి పౌర స్మృతి తేవడం కష్టతరమైన అంశమని ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.

''ఆర్టికల్ 370 సవరణ పాలనాపరమైన చర్య. ప్రభుత్వం తమదైన పద్ధతిలో దాన్ని చేసేసింది. కానీ, ఉమ్మడి పౌర స్మృతి వివిధ మతాల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం. అందుకే అంత సలువు కాదు'' అని అన్నారు.

Image copyright Reuters

ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం ప్రభుత్వ (కేంద్రం, రాష్ట్రాలు) బాధ్యత అని రాజ్యాంగంలోని అర్టికల్ 44 చెబుతోంది.

రాజ్యాంగంలోని మార్గనిర్దేశక సూత్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారని, ఇంతవరకూ ఆ దిశగా పెద్దగా అడుగులేవీ పడలేదని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది విరాగ్ గుప్తా అన్నారు.

''ఉమ్మడి పౌర స్మృతిని ఎప్పడూ హిందువులు, ముస్లింలతో ముడిపెట్టి చూస్తాం. వివాహం, వారసత్వం వంటి అంశాల్లో హిందువులు, ముస్లింలకే కాదు.. హిందువుల్లోనూ వివిధ వర్గాల మధ్యా తేడాలున్నాయి'' అని చెప్పారు.

''ముస్లింలు, క్రైస్తవులే కాకుండా భారత్‌లో ఇంకా చాలా మైనార్టీ మతాలు ఉన్నాయి. భిన్నమైన వర్గాలు ఉన్నాయి. ఆచార సంప్రదాయాలకు భిన్నంగా ఏ అంశం ఉన్నా, అభ్యంతరాలు వ్యక్తమవుతాయి'' అని అన్నారు.

Image copyright PTI

ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చా?

అసోంలో ఎన్‌ఆర్‌సీని ప్రభుత్వం అమలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా దీన్ని తేవాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తోంది.

హరియాణాలో ఎన్‌ఆర్‌సీ తేవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇదివరకే వ్యాఖ్యానించారు.

మరి, దీన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కుదురుతుందా?

''ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా తెచ్చేందుకు ప్రభుత్వనికి ఇబ్బందేమీ లేదు. కానీ, అసోంలో సుప్రీం కోర్టు ఆదేశాలపై ఆ పని చేసింది. దేశవ్యాప్తంగా దీన్ని తెచ్చేకన్నా ముందు పౌరసత్వ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది'' అని ప్రదీప్ సింగ్ అన్నారు.

Image copyright Getty Images

పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది?

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. భారత్‌లో ఆరేళ్లు నివాసముంటే, వాళ్లు పౌరసత్వం పొందొచ్చు. ముస్లింలకు మాత్రం ఈ అవకాశం ఉండదు.

హిందువుల కోసం భారత్ తప్ప మరో దేశం లేదని ప్రభుత్వం భావిస్తోందని ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.

''ఇతర దేశాల్లో ఉండే హిందువులపై హింస, ఆకృత్యాలు జరిగి, వాళ్లు ఆ దేశాలు వదిలి రావాలనుకుంటే.. వారికి అండగా నిలిచే దేశం భారత్ ఒక్కటేనని ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వాళ్లు భారత్‌కే వస్తారు. వాళ్లు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఇవ్వాలి'' అని ప్రదీప్ సింగ్ అన్నారు.

అయితే, ముస్లింలకు ప్రభుత్వం ఈ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు.

''భారత్‌కు వచ్చే ముస్లింలలో హింసను తాళలేక వచ్చేవారు లేరని, ఇతర కారణాలతో వచ్చే వారేనని బీజేపీ భావిస్తోంది'' అని ప్రదీప్ సింగ్ అన్నారు.

మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేసింది. పార్లమెంటు తొలి సెషన్‌లోనే ఎన్ఐఏ, ఆర్టీఐ, యూఏపీఏ వంటి బిల్లులను ఆమోదించింది.

తమ ఎజెండాలో ఉన్న ప్రధానమైన అంశాల్లో ఒక్కోదానిపై మోదీ ప్రభుత్వం వేగంగా పని చేసుకుంటూ వస్తోంది.

అయితే, ఉమ్మడి పౌర స్మృతిని తెస్తుందా? లేక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించేందుకు దాన్ని ఓ అంశంగా మిగిల్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

దీనిపై సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ అయ్యర్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఆర్థిక మందగమనం, నిరుద్యోగం అని అన్నారు.

''ఆర్టికల్ 370 సవరణ ప్రభుత్వం తీసుకున్న చర్యే. కానీ, అయోధ్య వివాదంపై తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆర్థికవ్యవస్థను సంభాళించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...

ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ