నరేంద్ర మోదీ: కరసేవకుడి నుంచి ప్రధానమంత్రి వరకు... నరేంద్ర మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?

  • 14 నవంబర్ 2019
నరేంద్ర మోదీ Image copyright Kalpit S Bhachech

"ఒకప్పుడు అయోధ్య అనేది స్థానిక భూ వివాదం మాత్రమే. కానీ, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల కారణంగా అది జాతీయ అంశంగా మారింది. వాళ్లు రామ్ రథ యాత్ర చేపట్టారు. దాంతో, దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది" అని సీనియర్ జర్నలిస్టు రామ్‌దత్ త్రిపాఠీ అన్నారు.

1990లో గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయం నుంచి అడ్వాణీ 'రామ్ రథ యాత్ర' చేపట్టారు. ఆ యాత్రలో అయోధ్య వివాదమే ప్రధాన అంశం. ఆ తర్వాత 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కార్యక్రమం జరిగింది.

అడ్వాణీ చేపట్టిన రథ యాత్రలో నరేంద్ర మోదీ కరసేవకుడి పాత్ర పోషించారు, సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీలో సభ్యుడు అయ్యారు.

Image copyright Kalpit S Bhachech

బీజేపీ, రామ మందిరం

1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 49.10% ఓట్లతో 404 సీట్లతో భారీ విజయం సాధించింది. బీజేపీ రెండు సీట్లకే పరిమితం అయ్యింది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ప్రయత్నిస్తామని 1989లో హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ ప్రకటించింది.

అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీజేపీ ఆ విషయాన్ని పొందుపరిచింది. ఫలితంగా, 1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ, 1989లో 85 స్థానాలను కైవసం చేసుకుంది.

హిందూ రాజ్య స్థాపనకు అది ఆరంభమని సీనియర్ జర్నలిస్టు షకీల్ అక్తర్ అభిప్రాయపడ్డారు.

"ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ద్వారా ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పును అడ్వాణీ గుర్తించారు. రామ జన్మభూమి ఉద్యమంతో జాతీయవాదం క్రమంగా బలపడింది. అది హిందూ రాజకీయ జాతీయవాద ఉద్యమంగా మారింది. భారత్‌లో తొలిసారిగా హిందూ జాతీయవాదం ప్రజా ఉద్యమంగా మారిపోయింది" అని షకీల్ వివరించారు.

Image copyright Kalpit S Bhachech
చిత్రం శీర్షిక అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు

బీజేపీ ఎదుగుదల

1989 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎల్.కె.అడ్వాణీ 10,000 కిలోమీటర్ల సుదీర్ఘ రథ యాత్రను 1990 సెప్టెంబర్ 25న ప్రారంభించారు.

ఆ యాత్ర గుజరాత్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య వరకు సాగాల్సి ఉంది. అయితే, ఆ యాత్ర బిహార్ చేరుకోగానే, అక్కడి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది.

ఆ యాత్ర అడ్వాణీ, బీజేపీలకు ఎనలేని శక్తినిచ్చి ముందుకు నడిపించిందని అహ్మదాబాద్‌కు చెందిన జర్నలిస్టు భార్గవ్ పారిఖ్ అన్నారు.

"ఆ యాత్ర దేశంలో అనేకమంది మూడ్‌ను మార్చేసింది. అఖిల భారత రాజకీయ పార్టీగా బీజేపీ మారేందుకు ఆ యాత్ర కొత్త మార్గాన్ని చూపింది" అని సీనియర్ జర్నలిస్టు వీరేంద్ర నాథ్ భట్ అభిప్రాయపడ్డారు.

"ఆలయం, మసీదులకు సంబంధించిన ఒక స్థానిక భూ వివాదాన్ని అడ్వాణీ రథ యాత్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. 1949 నుంచి 1986 వరకు అది స్థానిక భూ వివాదం. అక్కడి భూమి కోసం ఇరువర్గాలూ కోర్టులో పోరాడుతున్నాయి. ఆ తర్వాత అడ్వాణీ దానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ వివాదాన్ని రాజకీయ అంశంగా మార్చడంలో అడ్వాణీ కీలకపాత్ర పోషించారు. దాంతో, 1991 సార్వత్రిక ఎన్నికల్లో 120 స్థానాలు గెలుచుకుంది. అదే ఏడాది తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు" అని అయోధ్యకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామ్‌దత్ త్రిపాఠీ వివరించారు.

1992లో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ కేసులో అడ్వాణీతో పాటు మరికొందరు ఇప్పటికీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.

Image copyright Pti

మోదీ, అడ్వాణీ రథ యాత్ర

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు నరేంద్ర మోదీ ఎల్.కే.అడ్వాణీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయోధ్య వివాదంపై తుది తీర్పు వెలువడింది.

నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన సమన్వయంతో తొలిసారిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.

మీడియా మేనేజ్‌మెంట్ నుంచి అడ్వాణీ యాత్ర కోసం ప్రత్యేక రథాన్ని రూపొందించడం, యాత్ర సాగే మార్గమంతా ఏర్పాట్లు చేయడం వరకు సమన్వయకర్తగా నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని జర్నలిస్టు భార్గవ్ పారిఖ్ చెప్పారు.

అయితే, అడ్వాణీ చేపట్టిన పూర్తి యాత్రకు మోదీ సమన్వయకర్తగా వ్యవహరించారనడం అవాస్తవమని నరేంద్ర మోదీ ప్రయాణం గురించి పుస్తకం రాసిన నిలంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. గుజరాత్‌లో సాగిన యాత్రకు మాత్రమే సమన్వయకర్తగా మోదీ పనిచేశారని ఆయన చెప్పారు.

"నరేంద్ర మోదీ 1987-88లో బీజేపీలో చేరారు. కార్మికులకు ఉపాధి కల్పన, మెరుగైన వేతనాల కోసం ఆయన తొలుత 'న్యాయ యాత్ర' చేపట్టారు. ఆ తర్వాత అడ్వాణీ చేపట్టిన రథ యాత్రలో గుజరాత్ నుంచి ముంబయి వరకు సమన్వయకర్తగా పనిచేశారు. గుజరాత్‌లో యాత్రను విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ యాత్రకు ప్రధాన సమన్వయకర్తగా ప్రమోద్ మహాజన్ పనిచేశారు'' అని బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా బీబీసీతో చెప్పారు.

అడ్వాణీ రథ యాత్ర తర్వాత, 1991-1992 మధ్య కాలంలో మురళీ మనోహర్ జోషీ 'ఏక్తా యాత్ర' చేపట్టారు. కన్యాకుమారిలో ప్రారంభమై శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ వరకు సాగిన ఆ యాత్రలోనూ నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు.

Image copyright Getty Images

బాబ్రీ మసీదు కూల్చివేత

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను బీబీసీ ఇండియా పూర్వ ప్రతినిధి మార్క్ టలీ దగ్గరగా చూశారు.

"మసీదు సమీపంలో గుమిగూడిన దాదాపు 15,000 మంది ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. మసీదు దగ్గర మోహరించిన పోలీసు రక్షణ వలయాన్ని తోసుకుంటూ ఓ ప్రవాహంలా మసీదు పైకి వెళ్లి ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఆ గుంపులను అదుపు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. మరోవైపున పోలీసులపై రాళ్లవర్షం మొదలైంది. దాంతో తమ షీల్డ్‌లను తలలకు అడ్డుగా పెట్టుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేనొక చారిత్రక ఘటనకు సాక్షిగా ఉన్నట్టు నాకు అప్పుడే అర్థమైంది. ఈ ఘటనతో హిందూ జాతీయవాదులు విజయం సాధించినా లౌకికవాదం ఓడిపోయింది'' అని మార్క్ టలీ చెప్పారు.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల అల్లర్లు చెలరేగాయి. ముంబైలో 900 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ క్రమంగా బలపడింది. 1999లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

Image copyright Getty Images

మోదీ, రామ మందిరం

"రామాలయ అంశం ఖచ్చితంగా నరేంద్ర మోదీకి ప్రయోజనం చేకూర్చింది. 1990లో పార్టీలో నరేంద్ర మోదీ సీనియర్ నాయకుడేమీ కాదు. కానీ అడ్వాణీ రథ యాత్ర తర్వాత ఏక్తా యాత్రకు కూడా సమన్వయకర్తగా పనిచేశారు. నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణంలో అయోధ్య వివాదం కీలకపాత్ర పోషించిందని చెప్పొచ్చు" అని నిలంజన్ ముఖోపాధ్యాయ్ బీబీసీ ప్రతినిధి హరితా కందపాల్‌తో అన్నారు.

అడ్వాణీ రథ యాత్రలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం కొన్నాళ్లకే 2002లో గోధ్రా రైలు దహనం ఘటన జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులు ఆ మారణకాండలో ప్రాణాలు కోల్పోయారు. సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్-6 బోగీలో వారు సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత గుజరాత్‌లో భారీ ఎత్తున హింసాత్మక అల్లర్లు జరిగాయి.

అధికారిక లెక్కల ప్రకారం, 2002 గుజరాత్ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోయారు. 223 మంది అదృశ్యమయ్యారు, 2,500 మందికి పైగా గాయపడ్డారు.

2002 అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రకు సంబంధించి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సుదీర్ఘ విచారణ తరువాత ఆయనకు కోర్టుల నుంచి క్లీన్ చిట్ లభించింది. ఆ అల్లర్లను ఆపేందుకు తనవంతు ప్రయత్నం చేశానని నరేంద్ర మోదీ చెప్పారు.

ఆ తరువాత, 2002 డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీ 127 సీట్లను కైవసం చేసుకుంది, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారం కోల్పోయింది.

ఆ సమయంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో వాజ్‌పేయి మాట్లాడుతూ... గుజరాత్ అల్లర్లు దేశం అంతటా ఫలితాలను ప్రభావితం చేశాయని, గోధ్రా సంఘటనల తరువాత తాము నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఉంటే బాగుండేదని చెప్పారు. కానీ, మోదీని ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాలన్న ఆలోచనను అడ్వానీ వ్యతిరేకించారు.

Image copyright Getty Images

"అడ్వాణీ వల్ల నరేంద్ర మోదీ ప్రయోజనం పొందారు" అని సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ ఎన్. షా అంటారు.

"దూకుడు రాజకీయాలు నరేంద్ర మోదీకి ప్రయోజనం చేకూర్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయోధ్య ఉద్యమ ఫలాలు ఆయన అందుకున్నారు" ఆయన అభిప్రాయపడ్డారు.

"తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో నరేంద్ర మోదీ చాలా సంయమనంతో వ్యవహరించారు. ఈ తీర్పును ఒకరి విజయంగానో, మరొకరి పరాజయంగానో చూడొద్దని, అందరూ సోదరభావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాంటి సంయమనం, వివేకాన్ని ఆయన అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది" అని షా అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి మోదీ సంయమనంతో వ్యవహరిస్తున్నారు. దానిని ఆయన కొనసాగించాలి. అయోధ్య ఏక్ జన్‌కీ హై, కాశీ మధుర బాకీ హై లాంటి నినాదాలను నిలువరించాలి. ఈ విషయంలో ఆయన విఫలమైతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది" అని షా అన్నారు.

రామ మందిరం అంశంతో నరేంద్ర మోదీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరలేదని సీనియర్ జర్నలిస్టు కింగ్‌షుక్ నాగ్ అంటున్నారు. కానీ, ఆయన హిందుత్వ రాజకీయాలకు 'ఆధునిక వారసుడు' అని చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు.

"అయోధ్య అంశం, న్యాయస్థానం తీర్పు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు, దాని అధినేత మోహన్ భాగవత్‌కు ప్రయోజనం చేకూర్చాయి. 1980లో ఈ అంశాన్ని విశ్వ హిందూ పరిషత్ నుంచి స్వీకరించి, దానిని రాజకీయ అంశంగా మార్చింది. ఆ తర్వాత హిందుత్వ కేంద్రబిందువుగా మారింది, బీజేపీ సిద్ధాతం మారింది. రామ మందిరం అంశం బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. ఆ కోణంలో చూస్తే ఆ పార్టీ నేత నరేంద్ర మోదీ ప్రయోజనం పొందారు" అని కింగ్‌షుక్ నాగ్ అన్నారు.

‘‘అడ్వాణీ 'మానసపుత్రుడు' నరేంద్ర మోదీ. హిందుత్వ ఎజెండాను వారసత్వంగా స్వీకరించిన పాలకుడు ఆయన. అయోధ్య తీర్పు ఆయన హయాంలోనే వెలువడింది. అందుకు ఆయన ప్రశంసలు అందుకుంటారు. కానీ, ఈ అంశంతో ఎక్కువగా లాభం చేకూరేది మాత్రం సంఘ్ పరివార్, మోహన్ భాగవత్‌లకే’’ అని నాగ్ చెప్పారు.

Image copyright Getty Images

సీనియర్ జర్నలిస్టు అజయ్ నాయక్‌తోనూ బీబీసీ మాట్లాడింది.

"అయోధ్య వివాదం మొదలైనప్పుడు నరేంద్ర మోదీ అధికారంలో లేరు. అప్పుడు ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కూడా కాదు. కానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఈ వివాదం ముగింపు దశకు వచ్చింది కాబట్టి, దాని ప్రయోజనాలు నేరుగా ఆయనకే అందుతాయి. ఈ అంశాన్ని అర్థం చేసుకోవడంలో, దానిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో నరేంద్ర మోదీ సమర్ధవంతంగా పనిచేశారు. దాని ఫలాలు రామ మందిరం నిర్మాణం కొనసాగినంత కాలం ఆయనకు అందుతాయి" అని అజయ్ నాయక్ వివరించారు.

సీనియర్ జర్నలిస్టు ప్రకాశ్ ఎన్ షా లాంటి వారు మాత్రం, తాజా తీర్పుతో సంఘ్ పరివార్‌లోని నేతలు మరింత బలపడే అవకాశం ఉందని అంటున్నారు.

అయోధ్య తీర్పు తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాల మీద సంఘ్ పరివార్‌లోని ఆఫీస్ బేరర్ల ప్రభావం పెరుగుతుందని అజయ్ నాయక్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, తాజా తీర్పుతో అయోధ్య అంశానికి ముగింపు పడినట్లుగా అనిపిస్తోందని సీనియర్ జర్నలిస్టు రాజ్ గోస్వామీ అన్నారు.

"అయోధ్య వివాదంతో నరేంద్ర మోదీ, అడ్వాణీ, వాజ్‌పేయీలతో పాటు బీజేపీ పార్టీ మొత్తానికి ప్రయోజనం చేకూర్చింది. అయితే, తాజా తీర్పుతో ఇక ఆ విషయానికి ముగింపు పడినట్లు అనిపిస్తోంది. ఇక నుంచి ఈ అంశం మీద బీజేపీ పెద్దగా మాట్లాడకపోవచ్చు" అని గోస్వామీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

రేప్ కేసుల విచారణలో భారత న్యాయవ్యవస్థ ప్రభావవంతంగా పని చేస్తోందా...

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి