శబరిమల: మహిళల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు నేడే

  • 14 నవంబర్ 2019
శబరిమల Image copyright Getty Images

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెల్లడించనుంది. ఇటీవలి అయోధ్య తీర్పుతో శబరిమల సంప్రదాయాన్ని సమర్థించే వారిలో ఆశాభావం పెరిగినట్లు అనిపిస్తోంది.

10 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించే 'విశ్వాసం' అలాగే కొనసాగేలా న్యాయస్థానం తీర్పు ఉంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంలోకి మహిళలందరూ వెళ్లి పూజలు చేసేలా అనుమతిస్తూ 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దాదాపు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తన తీర్పును రిజర్వు చేసింది. దానిని ఇవాళ వెల్లడించనుంది.

ఈ నేపథ్యంలో కేరళలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 10,000 మందికి పైగా పోలీసులను సన్నిధానం, శబరిమల, పంబా, నీలక్కల్ పరిసర ప్రాంతాలలో కేరళ ప్రభుత్వం మోహరించింది.

ఈ సీజన్‌లో లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధరిస్తారు. శబరిమల ఆలయంలో ఈ సీజన్‌కు సంబంధించి మొదటి పూజ శనివారం సాయంత్రం జరగాల్సి ఉంది.

Image copyright Getty Images

``అయోధ్య తీర్పు తరువాత, ఆర్టికల్ 25 ప్రకారం విశ్వాసాల గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు జోక్యం చేసుకునే హక్కు న్యాయస్థానానికి లేదని తేలింది. దాంతో మాలో ఆశాభావం పెరిగింది. న్యాయస్థానం తన తీర్పును సమీక్షిస్తుందన్న నమ్మకంతో మా న్యాయవాదులు ఉన్నారు'' అని మహిళల తరఫున మాట్లాడే పద్మా పిళ్ళై బీబీసీతో చెప్పారు.

అయ్యప్ప స్వామిని 'శాశ్వత బ్రహ్మచారి'గా ప్రకటించినప్పటికీ, అయ్యప్ప ఆలయంలో ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి వివక్ష ఉండరాదని 2018 సెప్టెంబర్ 28న వెల్లడించిన తీర్పు ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు కేరళలో భారీ నిరసనలకు దారితీసింది. ఆలయంలో ప్రార్థన చేసేందుకు పోలీసు రక్షణతో కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలను నిరసనకారులు అడ్డుకున్నారు. కొందరి మీద భౌతిక దాడులు చేశారు.

బిందు యామిని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు జనవరి 2న సన్నిధానం వరకూ వెళ్లి ఆలయంలోకి వెళ్లగలిగారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాత చిత్రం

"ఒకరకంగా శబరిమల కేసు కూడా అయోధ్య కేసుతో సమానమే, కాస్త భిన్నంగా ఉంది అంతే" అని కార్యకర్త రాహుల్ ఈశ్వర్ బీబీసీతో చెప్పారు.

``చట్టం కంటే విశ్వాసం ముఖ్యమని మేము అనడం లేదు. ఆర్టికల్ 25, 26ల ప్రకారం మాత్రమే చట్టపరమైన రక్షణ కావాలని మేము అడుగుతున్నాం. అయ్యప్ప స్వామి హక్కులు పరిరక్షించాలని మాత్రమే అడుగుతున్నాం. ఎందుకంటే, ఆయన శాశ్వత బ్రహ్మచారి'' అని రాహుల్ అన్నారు.

తమకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఉంటుందన్న ఆశాభావంతో ఈశ్వర్ ఉన్నారు.

"ఒకవేళ కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా లేకపోతే క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే, తన సంప్రదాయాలను పరిరక్షించేందుకు శబరిమలకు మతపరమైన ప్రత్యేక హక్కులను కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేలా ప్రభుత్వంతో పోరాడుతాం'' అని ఆయన చెప్పారు.

``పూరీ జగన్నాథ ఆలయంతో పాటు దేశంలోని మరికొన్ని ఆలయాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అవి శబరిమలకూ లభించాలి. అప్పుడు ఆర్టికల్ 24, 25 ప్రకారం, ఆలయంలోకి ఎవరు ప్రవేశించవచ్చు, ఎవరు ప్రవేశించకూడదు అన్నది నిర్ణయించే అధికారం మా చేతుల్లో ఉంటుంది" అని ఈశ్వర్ వివరించారు.

అయోధ్య తీర్పును ప్రజలు ఎలా సంయమనంతో స్వీకరించారో... శబరిమల తీర్పునూ అలాగే అంగీకరించాలని శబరిమల కర్మ సమితి ప్రధాన కార్యదర్శి ఎస్.జె.ఆర్ కుమార్ విజ్ఞప్తి చేశారు

``ఎలాంటి హింసాత్మక ఘటనలు ఉండవు. ఒకవేళ నిరసనలు జరిగినా, శాంతియుతంగానే జరుగుతాయి. పోలీసుల వైఫల్యం వల్ల, కొందరు కుట్రపూరితంగా ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం వల్లే గతేడాది కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకానీ, మేము ఎప్పుడైనా శాంతినే కోరుకుంటాం'' అని కుమార్ బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images

ఈ తీర్పులో ఏవైనా లోపాలు ఉంటే చట్టబద్ధంగానే ముందుకెళ్తామని ఈశ్వర్, కుమార్ ఇద్దరూ చెప్పారు.

`` కోర్టు తీర్పు ఎలా వచ్చినా అందరూ సంయమనంతో వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాం. శబరిమల విషయంలో ఏదోఒకటి చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి, కోర్టు తీర్పు మాకు ప్రతికూలంగా వస్తే మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం" అని కుమార్ తెలిపారు.

"తీర్పు ఎలా వచ్చినా హింస జరుగుతుందని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే, లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ఆ పార్టీ కేరళలో ఒక్క చోట కూడా గెలవలేకపోయింది" అని సీపీఎం మాజీ లోక్‌సభ సభ్యుడు ఎంబీ రాజేష్ అన్నారు.

మరోవైపు, కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఎలాంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకుంది.

``సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉన్నా మేము పట్టించుకోం. భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, దేశంలో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది'' అని కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నిటాలా అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయాల్సి ఉంటుందని మా పార్టీ, మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది" అని రాజేష్ అన్నారు.

Image copyright Getty Images

ఇప్పటి వరకు ఏం జరిగింది?

కేవలం రుతుస్రావం కారణాలతోనే మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం 2018 సెప్టెంబర్ 28న తన తీర్పులో తెలిపింది. వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు, సంప్రదాయాలు తప్పక అనుమతించాలని కోర్టు ఆదేశించింది.

పురాతన ఆచారాలతో కొనసాగేందుకు శబరిమల ఆలయం ఒక మత సంప్రదాయం కాదని జస్టిస్ నారిమన్ చెప్పారు. ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పుతో న్యాయమూర్తులు నారిమన్, చంద్రచూడ్ ఏకీభవించారు. జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం దానిని వ్యతిరేకించారు.

మత విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదని ఇందూ మల్హోత్రా అన్నారు. దానివల్ల ఇతర ధార్మిక క్షేత్రాలపైనా ప్రభావం పడుతుందన్నారు.

లౌకిక ప్రజాస్వామ్యంలో.. అది హేతుబద్ధమైనదైనా, కాకపోయినా ప్రజలు తమ విశ్వాసాలను పాటించాలని అన్నారు. ఆరాధించేవారి మత ఆచారాలను న్యాయస్థానం ప్రశ్నించలేదని అన్నారు. శబరిమలలో పూజలు చేయడం అనేది ఒక మత సంప్రదాయమని, దానిని కాపాడాలని తెలిపారు. ఆచారం ప్రకారం పూజ చేసే హక్కును సమానత్వ సిద్ధాంతం అధిగమించలేదని వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాత చిత్రం

కేసు ఎవరు వేశారు? ఎందుకు వేశారు?

రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై కొన్ని శతాబ్దాలుగా నిషేధం ఉంది. లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

అయ్యప్ప స్వామి 'బ్రహ్మచారి' అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు.

శబరిమల దేవస్థానం మహిళలపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లోనే కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Image copyright K FAYAZ AHMAD

మహిళలను అనుమతించాలంటూ ఉద్యమం

ఫలానా మహిళ 'పవిత్రమే' (రుతుచక్రం మొదలు కానివారు, ఆగిపోయిన వారు) అని గుర్తించగల యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మాత్రమే ఆ మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామని 2015లో శబరిమల దేవస్థానం ఛైర్మన్ ప్రయర్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 2015లో విద్యార్థినులు ఉద్యమం ప్రారంభించారు.

"ప్రస్తుతం ఆయుధాలను గుర్తించేందుకు మనుషుల శరీరాల శరీరాలను స్కాన్ చేసే మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఫలానా మహిళ 'పవిత్రంగా' ఉన్నారా? లేదా? అని స్కాన్ చేసి చెప్పేసే రోజులు వస్తాయి. అలాంటి మెషీన్‌ కనుగొన్న తర్వాత, మహిళలను మందిరంలోకి అనుమతించే విషయంపై మాట్లాడదాం'' అని గోపాలకృష్ణన్ అన్నారు.

ఆయన వ్యాఖ్యలు మహిళలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, #HappyToBleed పేరుతో ఫేస్‌బుక్‌లో పెద్ద ఉద్యమమే జరిగింది.

Image copyright SABARIMALA.KERALA.GOV.IN

శబరిమల ఆలయం ప్రాముఖ్యత ఏంటి?

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే భక్తులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయకుండా ఆ 18 మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం.

మందిరంలోకి ప్రవేశించేముందు భక్తులు కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉపవాసం సమయంలో అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు (మాల) మాత్రమే ధరించాలి, అన్ని రోజులూ గడ్డం చేసుకోకూడదు. రోజూ ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...

ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ