రఫేల్‌పై రివ్యూ పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు... రాహుల్ గాంధీకి మందలింపు

  • 14 నవంబర్ 2019
రఫేల్ విమానం Image copyright DASSAULT RAFALE

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు లేవంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ఫ్రాన్స్ కంపెనీ దసో నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2018 డిసెంబరు 14న కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ తీర్పును రివ్యూ చేయాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు పిటిషన్లు వేయగా సుప్రీంకోర్టు వాటినిప్పుడు కొట్టివేసింది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై..

రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పు తరువాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అంటూ ప్రధాని మోదీపై ఆరోపణలు చేసి వాటిని కోర్టుకు ఆపాదించారంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖీ అప్పట్లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

దీనిపై విచారించిన కోర్టు రాహుల్ గాంధీ భవిష్యత్తులో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ హెచ్చరించింది.

ఈ వ్యాజ్యంపై విచారణ సమయంలో రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు.

రఫేల్ ఒప్పందంపై గత ఏడాది తీర్పులో ఏం చెప్పింది?

రఫేల్ ఒప్పందంలో వాణిజ్య పక్షపాతం ఏమీ కనిపించలేదని, కాబట్టి వీటి కొనుగోళ్ల కేసులో జోక్యం చేసుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నిర్ణయ ప్రక్రియను అనుమానించేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని కోర్టు తెలిపింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2019 అక్టోబరులో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి తొలి రఫేల్ విమానాన్ని అందుకున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 2018 డిసెంబరు 14న తీర్పు పాఠం చదువుతూ.. ''36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఒప్పందంలోని చిన్న చిన్న క్లాజుల మార్పుల వల్ల మొత్తంగా ఒప్పందాన్నే రద్దు చేయకూడదు.

గతంలో నిర్ణయించిన 126 యుద్ధ విమానాల కొనుగోళ్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవటం వల్లనే 36 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద ప్రక్రియ మొదలయ్యింది. ఇదే అసలైన వాస్తవం. తాజా ఒప్పందంపై 2016 సెప్టెంబర్‌లో సంతకాలు జరిగాయి. ఈ (ఒప్పందం రద్దు చేయాలన్న) పిటిషన్లను (ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు) హోలండ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, దానిపై మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే వేశారు. వ్యక్తిగత దృక్కోణాలు న్యాయ పునః పరిశీలనకు ఆధారాలు కాదు. ఈ ఒప్పందానికి సంబంధించి భారతీయ భాగస్వామి కంపెనీతో ఒప్పందం చేసుకోవటంలో తమకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వం చెబుతోంది. భారతీయ భాగస్వామిని ఎంపిక చేసుకునేది ఈ విమానాలను విక్రయిస్తున్న దసో ఏవియేషన్. కాబట్టి న్యాయ పునఃపరిశీలన సాధ్యం కాదు.

తొలుత నిర్ణయించిన 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయకుండా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విచక్షణలోకి మేం వెళ్లం. ఈ ఒప్పందంలోని ప్రతి ఒక్క అంశంపైనా విచారణ జరిపేందుకు అప్పీలేట్ అథార్టీలాగా కోర్టు కూర్చోవటం సరికాదు. మేం మా న్యాయ పునఃపరిశీలన అధికారంతో రఫేల్ పాత ఒప్పందం, కొత్త 36 యుద్ధ విమానాల ఒప్పందాల ధరలను సరిపోల్చేందుకు ఉపయోగించకూడదు. పైగా, ఈ ఒప్పందం వాణిజ్యపరంగా మరింత ప్రయోజకరమని కేంద్ర ప్రభుత్వ వివరణ పత్రం చెబుతోంది. జాతీయ భద్రత దృష్ట్యా మేం ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేం.'' అంటూ తీర్పు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)