భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'

  • 15 నవంబర్ 2019
భాయిచంద్ పటేల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక తన ఇంట్లో పార్టీలో భాయిచంద్ పటేల్

సెక్స్ అంటే భాయీచంద్ పటేల్‌కు మొదట్లో చాలా ఆసక్తి ఉండేది. బహుశా, అవసరం కంటే ఎక్కువే ఉండేది.

50వ దశకంలో దిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదువుకుంటున్నప్పుడు ఆయనకు ఎదురైన అతిపెద్ద బాధ ఏంటంటే, ఆ కాలేజీలోని 800 మంది అబ్బాయిల్లో ఒకే అమ్మాయి ఉండేది. అప్పట్లో అమ్మాయిలను డేట్‌కు తీసుకెళ్లడం కాదు, వాళ్ల చెయ్యి పట్టుకున్నా దాన్నొక పెద్ద 'స్కాండల్‌'గా భావించేవారు.

అబ్బాయిల హాస్టల్‌కు అమ్మాయిలు రావడం అనేది దాదాపు అసాధ్యం. భాయీచంద్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకోడానికి వెళ్లినప్పుడు అమ్మాయిల లోటు తీరింది.

ఆరోజులను వర్ణిస్తూ ఆయన, 'అయామ్ ఎ స్ట్రేంజర్ హియర్ మైసెల్ఫ్' అనే పుస్తకం రాశారు. భాయీచంద్ పటేల్ అందులో, "అమ్మాయిలు ఎల్ఎస్ఈలో వర్కింగ్ క్లాసుకు వచ్చేవాళ్లు. వాళ్లు మేకప్, బట్టల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. బహుశా వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్లేమో. కానీ, నేను 'ఇన్నర్ టెంపుల్‌'లో న్యాయశాస్త్రం చదవడానికి వెళ్లినపుడు, "ఒక పిల్లాడిని తీసుకెళ్లి చాక్లెట్ల షాపులో వదిలేసినట్టు అనిపించింది". ఆ కాలంలో బ్రిటన్‌లో జాతివివక్ష చాలా తీవ్రంగా ఉండేది. అప్పుడు కూడా అమ్మాయిలు మాలాంటి నల్ల అబ్బాయిలను కలుస్తుంటే, గర్భవతులు అవుతారని, మాతో ప్రేమలో పడతారని వాళ్ల అమ్మలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కాదు" అని చెప్పారు.

Image copyright Getty Images

భారత, పాక్ అమ్మాయిలకు తెల్లవారిపైనే ఆసక్తి

భాయీచంద్ పటేల్ ఫ్రాంక్‌నెస్‌ గురించి ఒక ఉదాహరణ చెప్పుకుంటే, "మేం ఆ రోజుల్లోనే మా పర్సుల్లో కండోమ్ పెట్టుకుని తిరిగేవాళ్లం. ఎప్పుడు దాని అవసరం పడుతుందో చెప్పలేం కదా. కానీ, అన్నిటికంటే ధైర్యమైన పనేంటంటే 'బూట్స్' షాపుకు వెళ్లి కౌంటర్లో ఉన్న సేల్స్ గర్ల్‌ను కండోమ్ అడగడమే. అది ఆ రోజుల్లో అంత చౌకగా వచ్చేది కాదు. అది మాలాంటి విద్యార్థుల జేబును మించిపోయే వస్తువు".

"ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, మా కాలేజీలో చదివే భారత, పాకిస్తాన్ అమ్మాయిలకు మాపైన అసలు ఆసక్తి ఉండేది కాదు. మేం వాళ్ల తోడు కోసం తపించిపోయేవాళ్లం. వాళ్లు మాత్రం, తెల్లవాళ్లతో తిరిగేవారు. తిరిగి దేశానికి వచ్చినపుడు మాత్రం మనలాంటి వారిని పెళ్లి చేసుకునేవారు" అని చెప్పారు.

Image copyright BHAICHAND PATEL

ఫిజీ పాస్‌పోర్ట్ ఇప్పటికీ ఉంది

పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్నదేశమైన ఫిజీ నుంచి జీవితం ప్రారంభించిన భాయీచంద్ పటేల్‌కు ప్రధానమంత్రులు, మహారాణులు, నటులు, అందగత్తెలు లాంటి ఎంతోమంది ఆసక్తికరమైన వ్యక్తులను కలిసే అవకాశం దొరికింది. రచయిత, జర్నలిస్ట్, చిత్ర విమర్శకులు అయిన భాయీచంద్ పటేల్ వకీలుగా కూడా పనిచేశారు.

ఆయన యునైటెడ్ స్టేట్స్‌లో ఒక పెద్ద పదవిలో పనిచేశారు. ఆయన ప్రస్తుతం దిల్లీలో ఒక చిన్న 'సోషలైట్'. ఆయన ఇచ్చే విందుల్లో పాల్గొనడానికి దిల్లీలోని ఉన్నత వర్గాలవారు పోటీపడుతుంటారు.

ముంబయి, లండన్, న్యూయార్క్, మనీలా, కాహిరాలో నివసించిన భాయీచంద్ పటేల్ దాదాపు గత 20 ఏళ్లుగా దిల్లీలోనే ఉంటున్నారు. కానీ ఆయన ఇప్పటికీ తన ఫిజీ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Image copyright BHAICHAND PATEL
చిత్రం శీర్షిక భాయిచంద్ పటేల్ పార్టీలో రాహుల్ సింగ్(కుడి చివర), సుహైల్ సేఠ్(ఎడమ చివర)

"ఫిజీ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ రావడంతో నేను చిన్నవయసులోనే చదువు కోసం భారత్ వచ్చేశాను. తర్వాత లండన్ వెళ్లాను. అక్కడ ఐదేళ్లు ఉన్నా. అక్కడే ఉండిపోదామా అనిపించింది. నేను ఫిజీ పౌరుడిని, ఫిజీ పౌరుడుగానే ఉండిపోవాలని అప్పుడు నిర్ణయించుకున్నా. కానీ, నేను అక్కడ ఉండలేకపోయాను. ఎందుకంటే అది చిన్న ప్రాంతం. అక్కడి జనాభా పది లక్షలకంటే తక్కువే".

"ఇప్పటికీ ప్రతి రెండేళ్లకోసారి ఫిజీ వెళ్తుంటా. నా చెల్లెలు ఇప్పటికీ అక్కడే ఉంటోంది. ఒకసారి ఎవరైనా ఫిజీ వెళ్తే, దాన్ని మర్చిపోలేరు. అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. స్థానికులు చాలా ఉల్లాసంగా ఉంటారు. నేను ఫిజీలోనే పెరిగాను. హిందీ అర్థమవుతుంది. అయితే, హిందీ నా మాతృభాష కాదు. నా భాష భోజ్‌పురి. మా అమ్మనాన్న ఇద్దరూ గుజరాత్ నుంచి వచ్చారు. నేను వాళ్లతో కూడా భోజ్‌పురిలోనే మాట్లాడేవాడిని" అని భాయిచంద్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్

రజనీ పటేల్ అసిస్టెంట్

1966లో భారత్ వచ్చిన భాయీచంద్ పటేల్ ముంబయిలోని ప్రముఖ వకీల్ రజనీ పటేల్‌ అసిస్టెంట్ అయ్యారు. అప్పట్లో ఆయన మార్క్స్‌వాది. తర్వాత ఆయన కాంగ్రెస్ సభ్యులు అయ్యారు. ఇందిరాగాంధీ ఆయనను బొంబాయిలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నియమించారు.

భాయీచంద్ పటేల్ దాని గురించి చెబుతూ "ఆ కాలంలో ఆయనను 'ముంబయి కా దాదా' అనేవారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పవర్ ఉండేది. ఆయన చాలా ప్రముఖ, సమర్థులైన వకీల్. నేను ఫిజీ నుంచి వచ్చినపుడు, ఆయన గురించి అసలు తెలీదు. నాకు ఆయన గురించి చెప్పిన ఒక వ్యక్తి.. రజనీ పటేల్‌కు ఫోన్ చేసి ఫిజీ నుంచి నా స్నేహితుడు వచ్చారు. ఆయన మీతో పని చేయాలనుకుంటున్నారు అని చెప్పారు".

Image copyright BHAICHAND PATEL
చిత్రం శీర్షిక రజనీ పటేల్ కాంగ్రెస్ అగ్ర నేత, దేశ ప్రముఖ న్యాయవాది

"రెండో రోజే నన్ను పిలిపించిన రజనీ పటేల్ పనిచ్చారు. రెండు మూడేళ్ల తర్వాత నేను ఆయనను, 'మీరు నన్ను పెట్టుకోడానికి ఎందుకు ఒప్పుకున్నారు' అని అడిగాను. దానికి ఆయన 'మీరు ఫిజీ నుంచి వచ్చారు. మీకు ఇక్కడ ఎవరి గురించీ తెలీదు. మీకు సాయం చేయడం నా బాధ్యత' అన్నారు".

రజనీ పటేల్‌తో పనిచేస్తున్నప్పుడే భాయిచంద్ ప్రముఖ నటి మీనాకుమారిని కలిశారు. రజనీ పటేల్ అప్పట్లో ఆమె భర్త కమాల్ అమ్రోహీకి వ్యతిరేకంగా కేసు వాదించేవారు.

భాయీచంద్ దాని గురించి చెబుతూ, "నా అనుభవం ప్రకారం ఎంత పెద్ద స్టార్ అయినా, బ్యాంక్ బాలెన్స్ మామూలుగానే ఉంటుంది. మీనా కుమారికి కూడా అలాగే జరిగింది. ఆ సమయంలో ఆమె తన 'పీక్స్' నుంచి దిగుతున్నారు. ఆమె వళ్లు చేశారు. ఆఫర్లు రావడం ఆగిపోయింది" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కార్టూనిస్ట్ మారియో మిరాండా

మారియో మిరాండా, ఆర్కే లక్ష్మణ్ విరోధం

ముంబయిలో ఉన్న రోజుల్లో భాయీచంద్, ప్రముఖ కార్టూనిస్ట్ మారియో మిరాండా మధ్య స్నేహం మొదలైంది. ఆర్కే లక్ష్మణ్, మిరాండా ఇద్దరూ ఒకే దగ్గర 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో పనిచేసేవారు. ఇద్దరి మధ్యా చాలా శత్రుత్వం ఉండేది. మిరాండా అంటే లక్ష్మణ్‌కు అసలు పడేది కాదు. ఆయనకు ఎప్పుడూ అడ్డంకులు సృష్టించేవారు

మిరాండా కార్టూన్లను లక్ష్మణ్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రచురించకుండా చూసుకునేవారు. దాంతో మిరాండా కార్టూన్లు ఫిల్మ్ ఫేర్ లేదంటే ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో మాత్రమే వచ్చేవి. మారియో నా స్నేహితుడు. తరచూ పార్టీలు ఇచ్చేవాడు. వాటికి నేను అప్పుడప్పుడూ వెళ్లేవాడిని. తను అప్పట్లో ఇండియాలో నిషేధించిన 'ప్లేబాయ్' పత్రిక ప్రతి ఎడిషన్‌ చదివేవాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భాయిచంద్ పటేల్ స్నేహితుడు రాహుల్ సింగ్

డాయ్నా బేకర్‌ను మోటార్ సైకిల్లో తిప్పిన రాహుల్ సింగ్

భాయీచంద్ లండన్‌లో చదివేటప్పుడు ఖుష్వంత్ సింగ్ కొడుకు రాహుల్ సింగ్ పరిచయం అయ్యాడు. వారి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ముంబయిలో ఇద్దరూ 'నైన్ అవర్స్ టూ రామా' హీరోయిన్ డాయ్నా బేకర్‌తో డేట్ చేసేవారు. ఒకసారి ఆమె తాజ్ హోటల్లో ఒక రెస్టారెంట్‌లో కూర్చుని ఉన్నారు. అప్పుడే భాయీచంద్ బాత్రూం వెళ్లారు. ఆయన తిరిగొచ్చేసరికే, రాహుల్ సింగ్ డాయ్నా బేకర్‌ను తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లిపోయాడు. రాహుల్ సింగ్‌కు ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది.

"డాయ్నా బేకర్ చాలా ప్రముఖ ఫిల్మ్ స్టార్. ఆమె ముంబయి వచ్చారు. భాయీచంద్ ఆమెను తాజ్ హోటల్లోని 'సీ లాంజ్' రెస్టారెంట్‌కు పిలిచారు. నేను కూడా వెళ్లాను. తర్వాత డాయ్నాతో బయటికెళ్లాలని ముంబయి అంతా తిప్పిచూపించాలనేది భాయీచంద్ ప్లాన్."

"నా దగ్గర ఆ కాలంనాటి ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉండేది. భాయీచంద్ బాత్రూం వెళ్లగానే డాయ్నా నాతో 'నాకు భాయీచంద్‌తో వెళ్లాలని లేదు. నాకు ముంబయి నువ్వే చూపించచ్చుగా' అంది. అంతే మేమిద్దరం మోటార్ సైకిల్లో అక్కడ్నుంచి జారుకున్నాం" అని రాహుల్ సింగ్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఖుష్వంత్ సింగ్

ఖుష్వంత్ సింగ్ స్వర్ణయుగం

రాహుల్ సింగ్ ద్వారా భాయీచంద్ పటేల్ ఖుష్వంత్ సింగ్‌ను కలిశారు. తర్వాత జీవితాంతం ఆయనకు అభిమానిగా ఉండిపోయారు. ఖుష్వంత్ ఎవరినైనా సరిగ్గా 7 గంటలకు డ్రింక్స్‌కు పిలిచేవారు. 8 గంటలకు భోజనం వడ్డించేవారు. రాత్రి 9 గంటలకు పడుకోడానికి వెళ్లిపోయేవారు. టైం అయిపోవడంతో ఒకసారి ఆయన రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌తో కూడా "ఇక మీరు వెళ్లచ్చు" అన్నారట.

రాహుల్ సింగ్ తన 50వ జన్మదినం సందర్భంగా ఇచ్చిన పార్టీకి భాయీచంద్ పటేల్ వెళ్లారు. దానికి ఆయన రాజీవ్ గాంధీని కూడా పిలిచారు. రాహుల్ సింగ్ ఆ రోజులు గుర్తుచేసుకుంటూ "రాజీవ్ గాంధీ మా ఇంటికి భోజనానికి వచ్చారు. దాదాపు గంటన్నరపాటు మా ఇంట్లో ఉన్నారు. మా నాన్న ఖుష్వంత్ సింగ్ ఆయన్ను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. రాజీవ్‌తో 'మీ అమ్మ, మీ తమ్ముడు వచ్చిన ఈ ఇంట్లో మీ అడుగులు కూడా పడ్డాయి, కానీ, మీతో నేను ఎక్కువ సేపు కూచోలేను. పడుకునే టైమయ్యింది' అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆర్నెళ్ళకే బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ చనిపోయారు" అని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐక్యరాజ్యసమితిలో స్వర్ణ సింగ్

స్వర్ణ సింగ్ గ్లాస్‌లో నీళ్లు పోయించారు

భాయీచంద్ పటేల్ ఆత్మకథ ఇలాంటి ఎన్నో భాగాలతో నిండి ఉంటుంది. ఈ పుస్తకంలో కనిపించే ప్రత్యేకత ఆయన ఫ్రాంక్‌నెస్. దీనిపై మాట్లాడిన రాహుల్ సింగ్ "అది చదవాల్సిన పుస్తకం. చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ, అందులో చాలా హాస్యం కూడా ఉంది. మనం దానిని ఒకసారి చదవడం మొదలెడితే ఇక పూర్తి చేయకుండా ఆగలేం" అన్నారు.

1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భాయీచంద్ పటేల్ ఐక్యరాజ్యసమితి, న్యూయార్క్‌లో నియమితులై ఉన్నారు. అప్పట్లో భద్రతామండలిలో భారత ప్రతినిధి సమర్ సేన్, పాకిస్తాన్ ప్రతినిధి ఆగా షాహీ పగలంతా తీవ్రంగా గొడవపడేవారు. కానీ, సాయంత్రం అయితే ఇద్దరూ కలిసి ఒకే బార్లో మద్యం తాగేవారు.

ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిగా ఉన్న స్వర్ణ సింగ్ ఒకసారి ప్రసంగిస్తున్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధిని తన గ్లాసులో నీళ్లు పోయమని చెప్పడం భాయీచంద్‌కు నచ్చలేదు.

దాని గురించి చెబుతూ భాయిచంద్, "అది మనం ఇంట్లో నౌకరుకు గ్లాసులో నీళ్లు పోయమని చెబుతున్నట్లు ఉంది. స్వర్ణ్ సింగ్ ప్రసంగిస్తున్నారు. దానిని అంతా లైవ్ చూపిస్తున్నారు. అప్పుడు ఆయన వెనక్కు తిరిగి భారత ప్రతినిధిని తన గ్లాసులో నీళ్లు పోయమన్నట్లు సైగ చేశారు. నీళ్ల జగ్, గ్లాసు ఆయన ముందే ఉన్నాయి. ఆయన తన చేత్తో నీళ్లు పోసుకుని తాగవచ్చు. కానీ, అలా చేయలేదు. అంత పెద్ద స్థాయిలో పనిచేస్తున్న స్వర్ణ్ సింగ్ అలా చేయడం చూసి నాకు చాలా సిగ్గుగా అనిపించింది" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వీఎస్ నైపాల్

నైపాల్ పిసినారితనం

భాయీచంద్ పటేల్‌కు ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్‌ కూడా తెలుసు. "వినోద్ మెహతా, రాహుల్ సింగ్‌కు ఆయన బహుశా నాకంటే ఎక్కువ తెలుసు. కానీ, నా దగ్గర పెద్ద కారు, మంచి వంటగది ఉండడమే కారణం అనుకుంటా, నైపాల్ దిల్లీ వచ్చినపుడు, ఆయన్ను చూసుకునే బాధ్యతలు నాకు అప్పగించారు".

"నైపాల్‌లో నేను ఒక విషయం గమనించాను. వేరే వాళ్లతో ఎప్పుడు రెస్టారెంటుకు వెళ్లినా, మెనూలో అత్యంత ఖరీదైన వైన్ ఆర్డర్ ఇచ్చినా కూడా, ఆయన చేయి ఎప్పుడూ పర్సు దగ్గరకు వెళ్లేది కాదు. ఆయన ట్రినిడాడ్‌లో పుట్టారు. బ్రిటిష్ పౌరులు. ఆయనకు నోబెల్ పురస్కారం వచ్చినపుడు, తనకు హిందీ ఒక్క ముక్క రాకపోయినా, భారతీయులంతా నైపాల్ మా వాడని పోటీపడి చెప్పుకోవడం చూసి, నాకు చాలా నవ్వొచ్చింది" అని భాయిచంద్ చెప్పారు.

Image copyright Getty Images

భాయిచంద్ 'పార్టీ అనిమల్'

భాయీచంద్ పటేల్‌కు ప్రస్తుతం 83 ఏళ్లు. కానీ సెక్స్ అంటే ఆయన ఆసక్తి ఇంకా తగ్గలేదు. కానీ, తన సెక్స్ ఆసక్తిని ఇప్పుడు ఆయన "తాడుతో బిలియర్డ్స్ ఆడినట్టే అనుకోవాలని" అంటారు.

దిల్లీలో తను ఇచ్చే పార్టీలతో పటేల్ ప్రముఖులుగా మారారు. ఆయన ప్రతి ఏటా ఇచ్చే వేలైంటెన్స్ డే, క్రిస్మస్ పార్టీలకు దిల్లీలోని 27 నుంచి 92 ఏళ్ల వయసులో ఎంపిక చేసినవారు హాజరవుతారు.

చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో భాయిచంద్ పటేల్‌తో రేహాన్ ఫజల్

దాని గురించి చెప్పిన పటేల్, "నిజానికి నాకు ప్రజలంటే ఇష్టం. నేను దిల్లీలో ఒంటరిగా ఉంటాను. వారంలో మూడు నాలుగు సార్లు కొందరు నన్ను భోజనానికి పిలుస్తారు. అందుకే, నేను కూడా వాళ్లను భోజనానికి పిలవడం తప్పనిసరి. చిన్న పార్టీలో నేను దాదాపు 12 మందిని పిలుస్తాను. ఎందుకంటే నా డైనింగ్ టేబుల్‌ దగ్గర అంతమందే కూచోగలరు. నా పెద్ద పార్టీలు వేలైంటెన్స్ డే రోజున ఉంటాయి. నా గార్డెన్ చాలా పెద్దది"

"నేను ఆ పార్టీలకు సుమారు 150-200 మందిని ఆహ్వానిస్తాను. వాళ్లకు నా ఇంట్లో చేసిన వంటకాల రుచిచూపిస్తాను. ఎందుకంటే మా వంటిల్లు చాలా బాగుంటుంది. నేను ఇప్పటివరకూ ఎప్పుడూ, ఎవరికీ కేటరింగ్ భోజనం వడ్డించలేదు" అన్నారు.

నేను భాయిచంద్‌ను మీరు మీ అతిథులను ఎలా ఎంపిక చేస్తారు? అని అడిగాను. దానికి ఆయన "ఆసక్తికరమైన వాళ్లను. దిల్లీలో ఇన్నేళ్లు ఉన్న తర్వాత ఆసక్తికరమైన వాళ్లు ఎవరెవరో చెప్పగలిగే అనుభవం నాకుంది. నా పార్టీలో నాకు ఇష్టమైన వాళ్లే వస్తారు" అన్నారు.

Image copyright BHACHAND PATEL
చిత్రం శీర్షిక తన పార్టీలో డాన్స్ చేస్తూ భాయిచంద్ పటేల్

ఇప్పటి భారత్ సంతోషంగా లేదు

కానీ, ఇప్పటి భారత్ తాను యువకుడిగా ఉన్నప్పటి భారత్‌లా లేదని భాయిచంద్ పటేల్ బాధపడతారు.

"దేశం ఎలా వెళ్తోందో చూసి నాకు చాలా బాధగా ఉంటుంది. మా కాలంలో ఈ దేశం అందరి దేశంగా ఉండేది. హిందూ, ముస్లిం, సిక్కుల్లో ఎలాంటి తేడా కనిపించేది కాదు. ఇప్పుడు ప్రజలను మతం పేరుతో చితకబాదుతున్నారు."

"ఎవరైనా ఈ దేశం హిందూ దేశం అంటే, నేను దాన్ని ఎప్పటికీ ఒప్పుకోను. ఈ దేశాన్ని అందరూ కలిసి నిర్మించారు. దేశంలో అందరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే, ఇది ముందుకెళ్తుంది. ఆ మతం వారు ఇది తింటారు, అది తింటారు, వాళ్లకు ఉద్యోగాలు లభించవు అని మనం అంటే, అంతకంటే దారుణం ఏముంటుంది. మీరు ఇదే తినాలి అని మనం ఎలా చెప్పగలం" అన్నారు భాయిచంద్ పటేల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

''తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి'': ఆదివాసీల హక్కుల పోరాట సమితి

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి