హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?

  • 14 నవంబర్ 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: దివ్యని వచ్చే సంవత్సరం నుంచి తమ మిగతా పిల్లలు ఉన్న హాస్టల్‌లో వేయాలి అనుకున్నారు లక్ష్మణ్. ఇప్పుడు ఈ ఫొటో చూసి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చారు

''నేనూ అనాధగానే పెరిగిన. ఆ పెయిన్ ఎట్లా ఉంటదో నాకు ఎరుకే. కూలి నాలి చేసుకొని.. కష్టపడి.. అలాంటి బతుకు నా పిల్లలకు రావద్దని, నేను వాలందరినీ చదివిస్తున్న'' అని చెప్పారు లక్ష్మణ్.

లక్ష్మణ్, ఐదేళ్ల దివ్య తండ్రి. ఇటీవల హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ వద్ద ఒక ప్రభుత్వ పాఠశాల బయట ఒక గిన్నె పట్టుకొని క్లాస్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్న ఫోటో 'ఆకలి చూపు' అనే కాప్షన్‌తో ఈనాడు దినపత్రిక టాబ్లాయిడ్‌లో ప్రచురితమవటంతో దివ్య కథనం ఆసక్తిగా మారింది. దివ్యని ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకున్నారు.

''వర్షాకాలం కావటంతో డెంగీ వంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అని చూసేందుకు వెళ్ళాను. భోజనం సమయం కావటంతో ఒక పాప మధ్యాహ్న భోజనం కోసం ఒక గిన్నెతో బయట నిలబడి ఉండటం చూశాను. అక్టోబర్‌లో ఫొటో తీశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నం మిగిలితే తినే స్థితి నుంచి కలిసి కూర్చొని తినే స్థితికి వచ్చింది పాప" అని అంటున్నారు ఆ ఫొటో తీసిన ఫోటోగ్రాఫర్ ఆవుల శ్రీనివాస్.

ఆ ఫోటో చూసి సోషల్ మీడియాలో ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకట్‌రెడ్డి ఈ పాప బడికి ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించటంతో హుటాహుటిన అధికారులు దివ్యను అదే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చుకున్నారు. నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి దివ్య స్కూల్‌కి వెళుతోంది.

''టీచర్లను కూడా సెన్సిటైజ్ చేయవలిసిన అవసరం ఉంది. ఆ బడి కేంద్రంగా అక్కడ నివసిస్తున్న వారికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టటం అవసరం'' అంటున్నారు వెంకట్ రెడ్డి.

Image copyright Avula Srinivas/Eenadu

అయితే అసలు ఆ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు.. దివ్య తల్లిదండ్రులు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, ఫొటో తీసిన ఫోటోగ్రాఫర్ - అందరితో మాట్లాడింది.

గుడిమల్కాపూర్‌లోని నవోదయ కాలనీలో ప్రభుత్వ పాఠశాల. స్కూలుకి ఒక వంద మీటర్ల దూరంలో ఒక బస్తీ. ఇరుకు గుడిసెలు, మురుగు నీరు పోయేందుకు ఏర్పాటు చేసుకున్న చిన్న కాలువలు. ఒక గుడిసె మురుగు నీరు ఇంకొకరి గుడిసెకు వాకిలి. ఈగలు, దోమలు, నిలిచి ఉన్న మురుగు నీరుతో వచ్చే వాసన - ఇది ఇక్కడి ప్రజల జీవిత సత్యం. ఇక్కడ రోజుకూలి పనికి వెళ్లే వాళ్లే ఎక్కువ. ఇక్కడి బడికి వెళ్లే వయసు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.

''నేనూ ఈ స్కూల్ లోనే చదువుకున్న. టెన్త్ అయిపోయింది. ఇప్పుడు కాలేజీకి పోతున్న. కానీ మా ఫ్రెండ్స్‌కి తెలియదు నేను ఎక్కడ ఉంటాను అన్నది. ఉండటానికే మేము హైదరాబాద్‌లో ఉంటున్నాము. కానీ మేము ఉండేది ఎతైన బిల్డింగుల మధ్య ఒక స్లమ్‌లో'' అంటూ పాఠశాల నుంచి ఆ బస్తీకి దారి చూపించింది రోజా.

ఇక్కడ ఉన్న దాదాపు 300 గుడిసెలలో లక్ష్మణ్‌ది కూడా ఒక గుడిసె. లక్ష్మణ్ చెత్త ఏరుకునే పని చేస్తాడు. భార్య యశోద జాడూ పనికి వెళ్తుంది. వీరికి నలుగురు సంతానం - ముగ్గురు ఆడ బిడ్డలు, ఒక మగ బిడ్డ. ఆఖరి బిడ్డ దివ్య. దివ్య మినహాయించి ఇద్దరు బిడ్డలు దూద్‌బౌలిలోని ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకుంటున్నారు. కొడుకు పదో తరగతి పూర్తి చేసుకొని కాలేజీకి వెళ్లే ప్రయత్నం చేస్తూ.. తండ్రికి సహాయం చేస్తున్నాడు.

ఈ ఐదుగురు కాక లక్ష్మణ్ తన అన్న పిల్లలను కూడా చదివిస్తున్నాడు. ''మా అన్నా, వదినా పోయారు. మరి ఆ పిల్లలు అనాథలు అవ్వకూడదని హాస్టల్‌లో వేశాను. వాళ్ళు మొత్తం ఐదుగురు పిల్లలు'' అని తెలిపారు లక్ష్మణ్.

ఒకటే గది ఉన్న గుడిసెలో కావాల్సిన అత్యవసర సామన్లు, ముఖ్యమైన పాత్రలు తప్ప పెద్దగా ఏమీ లేవు. గుడిసె బయట చెత్త నుంచి వేరు చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఒక బస్తా, గాజు సీసాలు ఒక బస్తా, ప్లాస్టిక్ కవర్లు ఒక బస్తా ఇలా వేరు వేరు మూటలు చేసి ఉన్నాయి. ''ఇవన్నీ జమచేసి అమ్ముతాము. ఇలా చెత్త అమ్మగా వచ్చే డబ్బు, భార్య చేసే పని నుంచి వచ్చే డబ్బు అంతా కలిపితే ఒక పది వేల దాకా వస్తది నెలకి. వాటితోనే మేం బతకాలి, పిల్లలందరికి బట్టలు, తదితర అవసరాలు చూడాలి'' అని వివరించారు లక్ష్మణ్.

ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ కూడా పిల్లల చదువులు కూడా ముఖ్యమే అని భావించినట్లు చెప్పారు లక్ష్మణ్. అయితే మరి దివ్య ఫొటో ఎలా వచ్చింది అని అడిగితే.. ''ఇక్కడ బస్తీలో పిల్లలందరూ మధ్యాహ్నం భోజనం సమయానికి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు. అందులో ఎక్కువ మంది చిన్న పిల్లలు. ఇంకా స్కూల్‌కి వెళ్లే వయసు రాని పిల్లలు ఎక్కువ. తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోవటం, వాళ్ళ అక్కలో అన్నలో స్కూల్‌లో చదువుతుండటంతో మధ్యాహ్నం భోజనానికి స్కూల్‌కి వెళ్తారు. ఆలా ఆ రోజు మా దివ్య కూడా వెళ్ళింది. మాకు తెలిసి ఎపుడు వెళ్ళలేదు. కానీ ఆ రోజు వెళ్లటం, ఎవరో ఫొటో తీయటం అన్నీ జరిగిపోయాయి" అని చెప్పుకొచ్చారు.

దివ్యని వచ్చే సంవత్సరం నుంచి తమ మిగతా పిల్లలు ఉన్న హాస్టల్‌లో వేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటో చూసి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చారు.

''ఆ ఫొటో చూసి మస్తు బాధ అయ్యింది. తల్లిదండ్రులు ఉండి, నేను వాళ్ల భవిష్యత్తు కోసం ఇంత కష్టపడుతుంటే కూడా ఎదో అనాథ పిల్ల అన్నట్టు అర్థం వచ్చేట్టు వేశారు. సరే ఏదైతే అది, ఇప్పుడు దివ్యని చూసి బస్తీలో మిగితా పిల్లలు కూడా స్కూల్‌కి పోతున్నారు. అది సంతోషం'' అంటున్నారు లక్ష్మణ్.

ఈలోపు అక్కడ గుమికూడిన బస్తీ ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారిలో ఒకరు గీత. ''మేము ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నాము. అయినా ఇదే, మా జీవితాలు. తినే దగ్గరే మురికి కాలువ. పాయకానాలు లేవు. మేము పనులు చేసుకోవాలె, పిల్లలని సాకాలే. మరి ఇక్కడ ఒక క్రెచ్ కానీ అంగన్‌వాడీ కానీ ఎదో పెడితే మా పిల్లలు ఇలా అడుక్కునే వారిలా ఆ స్కూల్‌లో ఏదో పెడతారని వెళ్ళరు కదా?'' అని ప్రశ్నించారు.

స్కూల్ ఏం చెప్తోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వెళ్లినప్పుడు స్కూల్‌కి మధ్యాహ్న భోజన సమయం. పిల్లందరూ రోడ్డు మీద ఆడుకుంటున్నారు. అక్కడే వేగంగా బైకులు కార్లు తిరుగుతున్నాయి. అయినా పిల్లల ఆటలు, కేరింతలతో అక్కడంతా కోలాహలంగా ఉంది. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవటంతో ఈ పరిస్థితి అని తెలిపారు ఒక టీచర్. ప్రాథమిక పాఠశాలలో ఉన్న స్టాఫ్ రూమ్'లోనే ఒక క్లాస్ రూమ్ నడుస్తోంది. అక్కడ గోడల పైన పిల్లలకు నేర్పేందుకు టీచర్లు రాసిన అక్షరాలు, అంకెలు, చార్ట్ పేపర్లు అతికించి ఉన్నాయి. ఒక పెద్ద టీవీ, నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి. గోడ మీద టీచర్ల పేర్లు వారి అర్హతలు అలాగే రోజు వారీగా మధ్యాహ్న భోజనానికి వేసుకున్న వంతుల బాధ్యుల టీచర్ల పేర్లు.

బీబీసీ తెలుగుతో మాట్లడిన ఒక టీచర్.. ''మేము మధ్యాహ్న భోజనం పెడతాం. అయితే కొంత మంది పిల్లలు డబ్బాలు ఇంటి నుంచే తెచ్చుకుంటారు. దాంతో కాస్త భోజనం మిగులుతుంది. దాన్ని వృధా చేయటం ఇష్టం లేక మేము పక్కన్నే ఉన్న బస్తీ పిల్లలను మధ్యాహ్నం పూట పిలిచి వారికీ పెడతాము. పిల్లలు ఎవరైనా పిల్లలే కదా. అందులో ఇక్కడ దగ్గరలో అంగన్‌వాడీ లేకపోవటం వల్ల చిన్నపిల్లలు ఇక్కడికి వస్తారు. దాని ఫొటో తీసి ఆలా వేయటం మాకు చాలా బాధ కలిగింది'' అని చెప్పారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలకు, గ్రామాలల్లో ఉండే పాఠశాలలకు తేడా ఉందని వివరించారు అక్కడ ఒక టీచర్. "ఇక్కడ వలస కార్మికులు ఎక్కువ. దాంతో ఈ సంవత్సరం ఉన్న పిల్లలు వచ్చే ఏడాది ఉండరు. నా అనుభవం లోనే ఒక తరగతి నుంచి పదో తరగతి వరకు ఇదే స్కూల్‌లో చదువు పూర్తి చేసుకున్న పిల్లలు 20 శాతం ఉంటారు. అంతేకాక ప్రతి ఏటా వచ్చే విద్యార్థులు వయసు పెద్దదయినా కొన్నిసార్లు వారికి అక్షరాలు కూడా రావు. కానీ వారిని వారి వయసుకు తగ్గట్టు తరగతిలోనే చేర్చుకోవాలి. అంతేకాక మేము వేసవి సెలవుల్లో చుట్టు పక్కల అన్ని ప్రాంతాలు తిరిగి, ఇంటి ఇంటికి వెళ్లి స్కూల్ వయసు ఉన్న పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్స్ ఇస్తాము. కానీ దానికి సరిపడా మౌలిక సదుపాయాలు కూడా లేవు. సరిపడా టీచర్లు లేరు, సరిపడా క్లాస్‌ రూమ్‌లు లేవు. కంప్యూటర్లు అని ఇచ్చారు. అవి పని చేయవు. టీవీ పని చేయదు. ఆఖరికి స్కూల్‌లో ఆయా కోసం మేము టీచర్లం తలా ఇంత డబ్బు పోగేసి పెట్టుకున్నాము. ఇక్కడ స్కూల్‌కి ప్రహరీ గోడ లేదు. పిల్లలు ఆడుకుంటుంటే మేము ఎంత సేపని కాపలా నించోగలం? ఇవన్నీ వాస్తవాలు. అయినా సరే మేం పిల్లలకు చదువులు చెబితే రేపు వీరి భవిష్యత్తు కొంతలో కొంతన్నా మెరుగుగా ఉంటుందని చాలా ప్యాషన్‌తో ఈ ఉద్యోగం చేస్తున్నాం'' అని వివరించారు.

అయితే ఈ సమస్యకు మూలకారణం పేదరికం. పేదరికంలో ఉన్న వారి పట్ల ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం అంటున్నారు సీనియర్ పాత్రికేయులు పద్మజ షా. ''ఎంతో మంది ఇలా ప్రభుత్వ పథకాలు అందక ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ముందుగా చేయవలిసిన పని అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలలో పెట్టి నిర్వహించాలి. ఒక సమగ్ర వ్యూహం అవసరం. అందరినీ ఒక వ్యవస్థ కిందకి తేవలసిన అవసరం ఉంది'' అని అభిప్రాయపడ్డారు.

బడిలో పిల్లల సంఖ్య ఎక్కువైనా, దివ్య లాంటి పిల్లలు ఇప్పుడు కొత్తగా బడికి రావటం సంతోషం అంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు