భారత టెలికాం రంగంలో ఏం జరుగుతోంది.. మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరముందా.

  • 17 నవంబర్ 2019
వొడాఫోన్ Image copyright Getty Images

వొడాఫోన్ ఐడియా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.51 వేల కోట్ల నికర నష్టం వచ్చినట్లు ప్రకటించింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఓ సంస్థకు ఒకే త్రైమాసికంలో ఇంత నష్టం రావడం ఇదే మొదటిసారి.

అసలు ఆ సంస్థకు ఈ స్థాయిలో నష్టాలు రావడానికి కారణమేంటి? వీటి గురించి వినియోగదారులు ఆందోళనపడాల్సిన అవసరం ఉందా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రముఖ ఆర్థికవేత్త ప్రాంజల్ శర్మను బీబీసీ ఇ-మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది.

ఆయన చెప్పిన సమాధానాలు ఇవి..

Image copyright pranjalsharma/twitter
చిత్రం శీర్షిక ప్రాంజల్ శర్మ

వొడాఫోన్ ఐడియా నష్టాలకు ప్రధాన కారణం ఏంటి?

స్పెక్ట్రమ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండటం, సంస్థల ఆదాయాన్ని ప్రభుత్వం పంచుకునే విధానం, వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోవడం వంటివి ఈ రంగంలో నష్టాలకు కారణాలు.

భారత టెలికాం రంగం పరిస్థితి గురించి ఈ పరిణామం ఏం చెబుతోంది?

చాలా పెద్ద మార్కెట్ అయినప్పటికీ, టెలికాం రంగం చాలా బలహీనంగా ఉంది.

అధిక ఖర్చులు, రుసుములకు తోడు చవక ధరలకే సేవలు అందించాల్సి రావడంతో సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి.

ప్రభుత్వం సహకరించాల్సింది పోయి 'సొమ్ము చేసుకునే' విధానం పాటిస్తోందన్న అభిప్రాయం ఉంది.

స్పెక్ట్రం అమ్మకాలు, ఆదాయం పంచుకోవడం, పన్నుల ద్వారా ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.

చవక ఛార్జీల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు సంస్థలకు ఉపయోగపడే నాన్-టెలికాం ఆదాయాలపైనా ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ఆదాయాన్ని పంచుకునే విధానం విస్తృతి నాన్-టెలికాం సేవలకూ వర్తిస్తోంది.

Image copyright Getty Images

రంగం ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

ఈ సమస్యల్లో అందరికీ పాత్ర ఉంది. ప్రభుత్వం స్పెక్ట్రంను అధిక ధరలకు విక్రయించడంతోపాటు ఆదాయంలో వాటా తీసుకుంటోంది.

స్పెక్ట్రం వేలం నిర్వహణలో ప్రణాళికపరమైన లోపాలు, అవినీతి ఆరోపణల వల్ల చాలా ఆపరేటర్ల లైసెన్సులను న్యాయవ్యవస్థ రద్దు చేసింది. ఫలితంగా కొన్ని ఆపరేటర్లు కనుమరుగయ్యాయి.

రెగ్యులేటింగ్ సంస్థ కఠినతరమైన నిబంధనలు విధించింది. నష్టదాయకంగా ఉన్న చవక ఛార్జీలను అనుమతించింది.

Image copyright Getty Images

టెలికాం రంగాన్ని జియో ఎలా దెబ్బతీసింది?

అధిక వ్యయ భారం ఎదుర్కొంటున్న తరుణంలో మార్కెట్‌ను జియో మరింత కుంచించుకుపోయేలా చేసింది.

ఇప్పటికే ఉన్న సంస్థల ఆదాయాలు మరింత తగ్గేలా జియో చాలా చవక ధరలకు సేవలను అందుబాటులోకి తెచ్చింది.

ఈ పరిణామం గురించి వినియోగదారులు ఆందోళనపడాల్సిన అవసరం ఉందా?

కచ్చితంగా ఉంది. 100 కోట్ల మంది యాక్టివ్ మొబైల్ వినియోగదారులతో భారత్ విజయవంతమైన మార్కెట్ అయ్యుండొచ్చు.

కానీ, టెలికాం సంస్థలు తగ్గిపోతుండటంతో వినియోగదారులకు ఎంచుకునేందుకు ఎక్కువ ఆప్షన్లు ఉండటం లేదు. ఆరోగ్యవంతమైన పోటీ, నూతన సాంకేతికతలపై పెట్టుబడులు లేకపోతే ప్రయోజనాలు కోల్పోతాం.

మార్కెట్‌లో ఏకస్వామ్య వైఖరి ఉంటే సేవల నాణ్యత తగ్గుతుంది. ధరలపైనా ప్రభావం పడుతుంది.

మొబైల్ ఫోన్స్ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం జనాలకు చేరవేయగలుగుతోంది. ఈ రంగంలో ఎక్కువ సంస్థలు లేకపోతే, దేశ ఆర్థిక వృద్ధికి మొబైల్ కనెక్టివిటీ దోహదపడదు.

నాలుగో పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరంలో మనం ఉన్నాం. జాతీయంగా ఆరోగ్యకర పోటీ ఉండటానికి, వ్యాపారాల స్థాపన సామర్థ్యం పెరగడానికి టెలికాం రంగం బలంగా ఉండటం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు