ఆంధ్రప్రదేశ్: పంజాబ్, హ‌రియాణాల్లో పొలాల పొగ దిల్లీని క‌మ్మేస్తుంటే ఏపీ రైతులు ఏం చేస్తున్నారు?

  • 17 నవంబర్ 2019
వ్యవసాయం Image copyright Getty Images

దేశ రాజధాని దిల్లీలో కాలుష్య సమస్యకు పొరుగు రాష్ట్రాలు హరియాణా, పంజాబ్ రైతులే కారణమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

కాలుష్య నివారణకు త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పంజాబ్, హ‌రియాణా ప్ర‌భుత్వాలను సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది.

ఆ రాష్ట్రాల‌ రైతులు తమ పొలాల్లో పంట తరువాత గ‌డ్డిని త‌గుల‌బెట్ట‌డంతో ఆ పొగ దిల్లీని కమ్మేస్తోందన్న కారణంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

మరి, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమస్య ఉందా? రైతులు పంట వ్యర్థాలను ఏం చేస్తున్నారు? ముఖ్యంగా వరి ఎక్కువగా పండే గోదావ‌రి జిల్లాల్లో రైతులు ఏం చేస్తున్నారో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో వ‌రి విస్తారంగా పండుతుంది. ఈసారి ఖ‌రీఫ్ లో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో క‌లిపి 9.2 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో వ‌రి పంట రైతుల చేతికొస్తోంది. కొన్నిచోట్ల కూలీల‌తో వ‌రి కోత‌లు, నూర్పిళ్లు సాగిస్తుండ‌గా, అత్య‌ధికులు వరికోత, నూర్పిడి యంత్రాలను వినియోగిస్తున్నారు.

Image copyright Getty Images

గ‌తంలో కొడవళ్లలో పంటను కోసి కుప్పలు వేసి, ఆ త‌ర్వాత నూర్చేవారు. యంత్రాల రాక‌తో ఈ ప‌రిస్థితి మారింది. వ్య‌వ‌సాయ శాఖ అంచ‌నాల ప్రకారం వ‌రిసాగులో యంత్రాల వినియోగం 62 శాతం వ‌ర‌కూ పెరిగింది. ఇది అత్య‌ధికంగా కృష్ణా, గోదావ‌రి డెల్టాల్లో ఉంది. మెట్ట ప్రాంతాల‌లోనూ వేగంగా విస్త‌రిస్తోంది.

ధాన్యం సేక‌రించిన త‌ర్వాత గ‌డ్డి కోసం కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతులు ప్రాధాన్య‌మిస్తున్నారు.

ఒకప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో వరి పంట నూర్పిళ్ల తరువాత గ‌డ్డి నిల్వ చేసుకునేవారు. కానీ ఇప్పుడు యంత్రాలతో కోత వల్ల గడ్డి దిగుబడి తగ్గుతుంది.

కేవ‌లం ధాన్యం మాత్ర‌మే సేక‌రిస్తున్న వ‌రి కోత యంత్రాలు దుబ్బుల‌ను తొక్కేయ‌డంతో అవి ప‌శువుల మేత‌కు పనికిరాదు. అలాంటి వృథా గడ్డిని పొలాల్లోనే వదిలేసేవారు.

ప‌శుగ్రాసం కొర‌త కార‌ణంగా మారిన ప‌రిస్థితులు

వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రభావం పశుపోషణపై పడుతోంది. యంత్రాలతో పంట కోతల వల్ల వరి గడ్డి లభ్యత తగ్గిపోతోంది. దీంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది.

అయితే, ఇటీవల ధాన్యం సేక‌ర‌ణ కోసం యంత్రాల‌ను ఉప‌యోగించిన పొలాల్లోనూ ఎండుగడ్డి సేక‌ర‌ణ కోసం నూత‌న యంత్రాల‌ను సిద్ధం చేశారు. కోత కోసిన త‌ర్వాత మిగిలిన గ‌డ్డిని ద‌గ్గ‌ర‌కు చేర్చి, తాళ్ల‌తో క‌ట్ట‌లుగా మార్చే యంత్రాలు అందుబాటులోకి వ‌చ్చాయి. దాంతో ఎండుగ‌డ్డి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని రైతులు ఆశిస్తున్నారు.

Image copyright Reuters

పంట వ్యర్థాలు తగలబెట్టరు

పంట వ్యర్థాలను తగలబెట్టే పద్ధతి ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ. యంత్రాల‌తో కోసిన త‌ర్వాత పొలంలో గ‌డ్డి మిగిలిపోయిన‌ప్ప‌టికీ త‌గుల‌బెట్టే ఆన‌వాయితీ త‌మ ప్రాంతంలో లేద‌ని గోదావ‌రి డెల్టా రైతులు చెబుతున్నారు.

'వ్య‌వ‌సాయానికి అనుబంధంగా ప‌శువులు పెంచుతాం. వాటికి గ‌డ్డి కావాలి. కాబ‌ట్టి ధాన్యానికి ఎంత ప్రాధాన్య‌ం ఉంటుందో గ‌డ్డీ అంతే ముఖ్యం. కొంతకాలంగా మిష‌న్ల కోత వ‌ల్ల గ‌డ్డి దొరక్కుండా పోవ‌డంతో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాం. ఇప్పుడు దానిని అధిగ‌మించే మార్గం దొరికింది. కాబ‌ట్టి ప‌శువుల‌కు గ్రాసం లోటు లేకుండా ఉంటుంది. పొలంలో గడ్డిని కాల్చితే కాలుష్య స‌మ‌స్య సృష్టించ‌డ‌మే కాకుండా ప‌శువుల‌కు మంచి ఆహారం కూడా దూరం చేసిన‌వాళ్లం అవుతాం'' అన్నారు తేత‌లి శ్రీనివాస‌రెడ్డి అనే రైతు.

Image copyright Getty Images

చెరకు వ్య‌ర్థాలు త‌గుల‌బెట్టేవాళ్లం.. ఇప్పుడు అదీ మానేశాం

''గ‌తంలో చెరకు పంట నరికిన తరువాత మిగిలే వ్య‌ర్థాలు త‌గుటబెట్టేవాళ్లం. ఇప్పుడు దానినీ పశుగ్రాసంగా వాడుతున్నాం అంటున్నారు పి. కృష్ణారెడ్డి. ''మా ప్రాంత వ్య‌వ‌సాయ విధానంలో వృథా చేసే అల‌వాటు లేదు. భూమికి బ‌లం కోసం కృత్రిమ ఎరువుల‌తో పాటు స‌హ‌జ వ‌న‌రులనూ వాడుకుంటాం. కానీ పంట ద్వారా వ‌చ్చే ప్రతిదీ వినియోగించుకోవ‌డం, ప‌శువుల‌కు మేత‌గా వాడుకోవ‌డం అల‌వాటు. గ‌తంలో మాదిరిగా చెరకు సాగులోనూ వ్య‌ర్థాలు త‌గుల‌బెట్టే ప‌ద్ధ‌తి మానేశాం. వాటినీ ప‌శువుల మేత‌గా వాడుతున్నాం'' అన్నారాయన.

'గ‌తంలో అల‌వాటు ఉండేది.. ఇప్పుడు పూర్తిగా మానేశారు'

గోదావ‌రి డెల్టా రైతులూ గతంలో ధాన్యం సేకరణ తరువాత భూమికి మేలు చేస్తుంద‌నే ఉద్దేశంతో గ‌డ్డిని త‌గుల‌బెట్టేవారని వ్య‌వ‌సాయ శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎన్‌వీవీ రామ‌సాయి చెబుతున్నారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ, ''వ్య‌వ‌సాయంలో ఏదీ వృథా చేయ‌కూడ‌దు. పంట కోత తర్వాత‌ దుబ్బులు ఉండిపోతే వాటిని తొల‌గించ‌డానికి సూప‌ర్ ఫాస్ఫేట్ గానీ ఇత‌ర ర‌సాయ‌నాలు గానీ వాడొచ్చు. వాటిని ఉప‌యోగించి భూములు మ‌ళ్లీ సాగుకి అనుకూలంగా మార్చుకోవ‌చ్చు. ఖ‌రీఫ్ పంట త‌ర్వాత వెంట‌నే ర‌బీ వేయాలంటే పొలం దున్న‌డానికి ముందుగా కొన్ని పద్ధతులు పాటించ‌డం ద్వారా గ‌డ్డి త‌గుల‌బెట్టే ప‌ద్ధ‌తి మానుకోవ‌చ్చు. వీటిపై రైతుల్లో అవగాహ‌న పెరిగింది ఇప్పుడు ఎవ‌రూ అలా త‌గుల‌బెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు'' అన్నారు.

మెట్ట‌ ప్రాంతాల్లోనూ..

డెల్టా ప్రాంతాల్లోనే కాకుండా మెట్ట‌ ప్రాంతంలోనూ ధాన్యం సేక‌ర‌ణ త‌ర్వాత గ‌డ్డిని త‌గుల‌బెట్టే ప‌ద్ద‌తిని రైతులంతా దాదాపుగా మానుకున్నారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి ప్రాంతానికి చెందిన రైతు ఉలిసే రాజు 'బీబీసీ'తో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. ''వ‌రి సాగు త‌గ్గుతోంది. ఆక్వా, పామాయిల్ వంటివి పెరుగుతున్నాయి. దాంతో ప‌శువుల గ‌డ్డికి డిమాండ్ పెరిగింది. ఎండు గడ్డికి రేటు ఉంది. దాంతో సొంత అవ‌స‌రాల కోసం గానీ, అమ్ముకోవ‌డానికి గానీ గ‌డ్డి సేక‌రించ‌డం పెరిగింది.

ఇక త‌గుల‌బెట్టాల‌నే ఆలోచ‌న కూడా అంతా మానేసుకున్నారు. వ‌ర‌ద‌లు, వ‌ర్షాల కార‌ణంగా పంట పూర్తిగా కుళ్లిపోయిన స‌మ‌యంలో మాత్రం కొందరు ఇలా చేస్తుంటారు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE హైదరాబాద్ రేప్ ఎన్‌కౌంటర్: ఒకవైపు హర్షాతిరేకాలు.. మరోవైపు అనాగరికం అంటూ విమర్శలు

సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

ప్రెస్‌రివ్యూ: అత్త,మామల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే అల్లుళ్లు, కోడళ్లకూ జైలు, జరిమానా

గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ