రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్

  • 17 నవంబర్ 2019
రంజన్ గగోయ్ Image copyright Getty Images

అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు చాలా ఆగ్రహం, ఆందోళనతో రాసిన లేఖపై సంతకం చేసి, దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టిన నలుగురు సుప్రీకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఒకరు.

సుప్రీంకోర్టు ఊహించని కారణాలతో అప్పట్లో పతాక శీర్షికల్లో నిలిచింది. కేంద్రం దీపక్ మిశ్రా వారసుడుగా సీనియారిటీ సంప్రదాయాన్ని పక్కనపెట్టి గొగోయ్ స్థానంలో వేరే వారిని ముందుకు తీసుకురావచ్చని కూడా అనుకుంటున్నారు. కానీ, 2018 సెప్టెంబర్ 13న రాష్ట్రపతి భవన్ నుంచి జారీ అయిన లేఖ ఆ ఊహాగానాలకు తెరదించింది.

జస్టిస్ దీపక్ మిశ్రా ఫేర్‌వెల్ సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో "జస్టిస్ దీపక్ మిశ్రా పౌర స్వేచ్ఛ హక్కును ఎప్పుడూ కాపాడారని, మహిళల హక్కులను సమర్థించారని, ఆయన మాటలు ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చాయని" జస్టిస్ గొగోయ్ అన్నారు.

Image copyright ARVIND YADAV/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

రోస్టర్ వివాదం

చీఫ్ జస్టిస్ అవడానికి ముందే 2018 జనవరి 12న రోస్టర్ సిస్టం గురించి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుతో రంజన్ గొగోయ్ వార్తల్లో నిలిచారు.

రోస్టర్ అంటే సుప్రీంకోర్టులోని ఏ కేసు ఏ బెంచ్ దగ్గరకు వెళ్తుంది. దానిపై ఎప్పుడు విచారణ జరుగుతుంది అనే వివరాలు ఉండే ఒక జాబితా.

రోస్టర్ తయారు చేసే అధికారం చీఫ్ జస్టిస్ దగ్గర ఉంటుంది. ఆయన్ను 'మాస్టర్ ఆఫ్ రోస్టర్' అంటారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చీఫ్ జస్టిస్ ఆదేశాల ప్రకారం రోస్టర్ తయారు చేస్తారు.

2017 నవంబర్‌లో అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ 'మాస్టర్ ఆఫ్ రోస్టర్‌'గా ఉంటారని తీర్పు వినిపించింది.

Image copyright Getty Images

చీఫ్ జస్టిస్ అప్పగించేవరకూ ఏ జడ్జి అయినా ఏ కేసులోనూ విచారణలు జరపకూడదని ఆ తీర్పులో రాసుంది.

కానీ, జస్టిస్ గొగోయ్ సహా సుప్రీంకోర్టు నలుగురు జడ్జిలు మీడియా ముందు వచ్చి రోస్టర్ అంశాన్ని లేవనెత్తారు. "చీఫ్ జస్టిస్ దగ్గర రోస్టర్ తయారు చేసే, కేసులను జడ్జిలకు అప్పగించే అధికారం ఉంది. కానీ, ఆ కేటాయింపులు సమతూకంలో ఉండడం లేదని" ఆరోపించారు.

జస్టిస్ గొగోయ్ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత రోస్టర్ సిస్టంలో ఏవైనా మార్పులు వచ్చాయా?

దీనికి సమాధానంగా "జస్టిస్ గొగోయ్ ఆ అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టారు. రోస్టర్ అంశాన్ని ఒక విధంగా చల్లారిపోయేలా చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలంలో ఎలాంటి రోస్టర్ సిస్టం నడిచిందో, జస్టిస్ గొగోయ్ సమయంలో కూడా ఆ వ్యవస్థ అలాగే పనిచేస్తోందని" సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పీబీ సావంత్ అన్నారు.

Image copyright SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES

లైంగిక వేధింపుల కేసు

చీఫ్ జస్టిస్ బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల్లోనే జస్టిస్ గొగోయ్‌పై ఆయన మాజీ జూనియర్ అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు వేశారు. జస్టిస్ గొగోయ్ అప్పుడు దీనిని "న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు పెనుముప్పు. న్యాయవ్యవస్థను అస్థిర పరిచేందుకు ఇది ఒక పెద్ద కుట్ర" అన్నారు.

రంజన్ గొగోయ్‌కు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి సుప్రీంకోర్టు జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ(ఇన్ హౌస్ కమిటీ) ఎదుట హాజరు కావడానికి నిరాకరించారు.

ఫిర్యాదు చేసిన మహిళ తన వకీలుతో కలిసి ఇన్ హౌస్ కమిటీ ముందు హాజరవడానికి అనుమతి లభించలేదని ఆరోపించారు. న్యాయవాది, సహాయకులు లేకుండా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తుల ఎదుట తనకు నెర్వస్‌గా ఉంటుందని చెప్పారు. ఆ కమిటీ ద్వారా న్యాయం లభిస్తుందనే ఆశ తనకు లేదని, అందుకే ఆ విచారణలో భాగం కాలేనని చెప్పారు.

జస్టిస్ బాబ్డే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తర్వాత అందరికంటే సీనియర్ జడ్జి ఆయన తర్వాత కాబోయే చీఫ్ జస్టిస్.

దేశంలో మొదటిసారి ఒక జడ్జి తనపై వచ్చిన ఆరోపణలను స్వయంగా విచారిస్తుండడంతో ఇది చరిత్రాత్మక కేసుగా మారింది. ఇలా విచారణ చేయడం లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారిత ప్రక్రియ ఉల్లంఘించినట్లే అని న్యాయవాదుల్లోని ఒక వర్గం భావించింది.

Image copyright ARVIND YADAV/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

2019 ఏప్రిల్ తర్వాత

ఈ లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం - న్యాయ వ్యవస్థ సంబంధాల్లో మార్పు వచ్చిందని కొంతమంది చెబుతారు. జస్టిస్ గొగోయ్ తన చెడ్డపేరును తుడిపేసుకోడానికి ప్రభుత్వ వకీళ్లపై ఆధారపడ్డారని అంటారు.

అయోధ్యపై చరిత్రాత్మక తీర్పు

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన పదవీకాలం చివర్లో గత కొన్ని దశాబ్దాలుగా నడిచిన అయోధ్య 'మందిరం-మసీదు' వివాదంపై 2019 నవంబర్ 9న అంతిమ తీర్పు ఇచ్చారు.

జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 70 ఏళ్ల నాటి బాబ్రీ మసీదులో ముస్లింలు ప్రార్థించడాన్ని అడ్డుకోవడం తప్పని, 27 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదును చట్టవిరుద్ధంగా కూల్చారని చెప్పినప్పటికీ, హిందువుల పక్షాన మందిర నిర్మాణం కోసం తీర్పు ఇచ్చింది.

Image copyright VIPIN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

గొగోయ్ వారసత్వం

కానీ, భారత చీఫ్ జస్టిస్ పదవి నుంచి రిటైర్ అయిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను ఇదే అయోధ్య తీర్పు ద్వారా గుర్తు చేసుకుంటారనేది అక్షరాలా నిజం.

దీనిపై ద ట్రిబ్యూన్ వార్తా పత్రిక లీగల్ ఎడిటర్ సత్య ప్రకాష్ "మిగతావన్నీ ప్రజలు మర్చిపోతారు. వారికి అయోధ్య తీర్పు గుర్తుండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా కొలిక్కి రాని కేసులో ఈ తీర్పు ప్రతివాదులు కూడా దానిని స్వీకరించేలా పరిష్కారమైంది" అన్నారు.

"మనం ఏ జడ్జినైనా వ్యక్తిగతంగా గుర్తుంచుకోం, దానికి బదులు వారు ఇచ్చిన తీర్పులను బట్టే గుర్తుంచుంకుంటాం. అలాగే జస్టిస్ గొగోయ్‌ కూడా రామజన్మభూమి తీర్పుకు గుర్తుండిపోతారు అని గువాహటీ హైకోర్టులో జస్టిస్ గగోయ్‌తో కలిసి ప్రాక్టీస్ చేసిన సీనియర్ అడ్వకేట్ కేతన్ చౌధరి అన్నారు.

బహుశా చాలా మంది ఆయన్ను 2018 జనవరి 12న ఉదయం జస్టిస్ చలమేశ్వర్ ఇంట్లో జరిగిన మీడియా సమావేశం గురించి కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే, దేశంలోని నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఒకేసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, తమ బాస్, అంటే చీఫ్ జస్టిస్ పనితీరును తప్పుబట్టడం కూడా మామూలు విషయం కాదు.

సుప్రీంకోర్టులో సవరణలు

జస్టిస్ గొగోయ్ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు పనితీరులో ఏమీ మారలేదని కూడా చెప్పలేం.

"జస్టిస్ గొగోయ్ కొన్ని సవరణలు చేశారు. వాటిలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఒకటి. రిజిస్ట్రీలో కేసులు దాఖలు చేసే పద్ధతి పూర్తి చేస్తారు. జస్టిస్ గొగోయ్ ఇందులో సవరణలు తీసుకొచ్చారు. కేస్ లిస్టింగ్ ప్రక్రియ సరళతరం చేశారు. ఆ సమయంలో కొందరి ఉద్యోగాలు కూడా పోయాయి. ముందే అయిపోవాల్సిన కొన్ని కేసులకు ఆలస్యంగా తేదీ లభించేది. కొన్ని ఆలస్యం కావాల్సినవి ముందే వచ్చేవి. ఆయన అలాంటి వాటిని సరిదిద్దారు" అని సత్యప్రకాష్ చెప్పారు.

"జస్టిస్ గొగోయ్ కేసులను పరిష్కరించడానికి తక్కువ సమయం తీసుకునేవారు. వాటిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ కేసులకు సంబంధించిన కేసులు కూడా ఉండేవి. అయితే, తమ వాదన సరిగా వినడం లేదని కోర్టుకు వచ్చే వారి నుంచి ఫిర్యాదులు కూడా వస్తుండేవి" అని సుచిత్రా మొహంతి చెప్పారు.

Image copyright ARVIND YADAV/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ప్రభుత్వం, న్యాయవ్యవస్థ బంధం

జస్టిస్ దీపక్ మిశ్రా సమయంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ బంధాల గురించి చాలా వినిపించేవి. ఆ మాటలు ఇప్పుడు మరీ పాతబడిపోలేదు. విపక్షాల్లోని ఒక వర్గం అప్పటి చీఫ్ జస్టిస్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని కూడా సిద్ధమవుతుంటే, ప్రభుత్వా దానిని వ్యతిరేకించేది..

దానికి చాలా కాలం క్రితం నేషనల్ జుడిషియల్ ఎంపవర్‌మెంట్ కమిషన్ చట్టం ద్వారా న్యాయవ్యవస్థ హక్కుల పరిధిలో కోతలు విధించే ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి.

"ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ సంబంధాలు మొదటికీ, ఇప్పటికీ పెద్దగా తేడా లేదు. జస్టిస్ గొగోయ్ పదవీకాలంలో కూడా వాటిలో ప్రత్యేకంగా ఏ మార్పులూ రాలేదు. కనిపించే మార్పులు కూడా చాలా చిన్న చిన్నవి. సాధారణంగా జనం వాటి మధ్య బంధం మెరుగుపడింది అంటారు. లేదా కొన్నిసార్లు జ్యుడిషియరీ సరెండర్ అయిపోయిందని అంటారు. నాకు తెలిసి జుడిషియరీ ప్రభుత్వ అధికార పరిధిలో ఎక్కడ చొరబడిందో, అక్కడ నుంచి అది తొలగిపోలేదు. ప్రభుత్వం ఒక విధంగా తప్పనిసరి పరిస్థితిలో ఉంది. ఏం చేయలేకపోతోంది" అని సత్యప్రకాశ్ అన్నారు.

"జస్టిస్ దీపక్ మిశ్రా కాలంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఎలాంటి బంధం ఉండేదో, జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలంలో కూడా అలాంటి పరిస్థితే కొనసాగింది" అని సుచిత్రా మొహంతి అంగీకరిస్తున్నారు.

Image copyright Getty Images

రఫేల్, శబరిమల తీర్పులు

జస్టిస్ గొగోయ్‌ను కేవలం అయోధ్య తీర్పు కోసమే గుర్తు చేసుకోవాలా? కాదనడం ఎవరికీ అంత పెద్ద కష్టం కాదు. పదవీకాలం చివరి రోజుల్లో ఆయన అయోధ్య కేసు తర్వాత మరో పెద్ద తీర్పు కూడా ఇచ్చారు.

సుప్రీంకోర్టు రఫేల్‌పై అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. అంతకు ముందు రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రఫేల్ కేసులో దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, ఈ పిటిషన్లలో విషయం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.

అయితే రాజకీయంగా సున్నితమైన శబరిమల అంశంలో కూడా ఆలయంలో మహిళల ప్రవేశం తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పెద్ద బెంచ్ దగ్గరికి పంపించింది. కోర్టు పాత తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అంటే పాత తీర్పు అలాగే ఉంటుంది అని అర్థం. సుప్రీంకోర్టు ఇంతకు ముందు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

Image copyright PRAFUL GANGURDE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఆర్టీఐ జడ్జిమెంట్

ఇదే నవంబర్ 13న గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలో వస్తుందని చెప్పింది.

సుప్రీంకోర్టులో ఈ కేసు ఒక దశాబ్దం నుంచీ పెండింగులో ఉంది. ఎందుకంటే గత 9 మంది చీఫ్ జస్టిస్‌లు ఈ కేసులో విచారణ కోసం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయలేదు.

విచారణ తర్వాత రిజర్వులో ఉంచిన కేసుల్లో 3 నెలల్లో తీర్పు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈ కేసులో విచారణ తర్వాత తీర్పు రావడానికి 7 నెలల సుదీర్ఘ సమయం పట్టింది.

"ఆలస్యంగా వచ్చినా ఈ తీర్పులో చాలా మంచి కోణాలు ఉన్నాయి. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 2-ఎఫ్ ప్రకారం ఇప్పుడు చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా పబ్లిక్ అథారిటీ అయ్యింది. కానీ జడ్జిల ప్రైవసీ, ప్రివిలేజ్ పేరుతో ఈ తీర్పు అమలులో ఇఫ్పటికీ గందరగోళం జరగవచ్చు" అని సుప్రీంకోర్టు వకీల్ విరాగ్ గుప్తా అన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశ నేతలు, అధికారులు తమ ఆస్తుల గురించి బహిరంగంగా ప్రకటించాలి. సుప్రీంకోర్టు కూడా దీని గురించి 1997లో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. అయినా, జడ్జిలందరూ ఇప్పటికీ తమ ఆస్తుల గురించి ప్రకటించడం లేదు.

Image copyright KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
చిత్రం శీర్షిక జస్టిస్ కాట్జూ

రిటైర్డ్ జడ్జిని గొగోయ్ కోర్టుకు పిలిపించారు

కేరళలో జరిగిన సౌమ్య మర్డర్ కేసులో త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గోవింద స్వామికి మరణ శిక్ష విధించింది. కేరళ హైకోర్టు ఆయన మరణశిక్షను పునరుద్ధరించింది.

తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పులో గోవింద స్వామికి, ఆ యువతిని హత్య చేయాలనే ఉద్దేశం లేదని చెప్పింది. అతడిని హత్య కేసులో దోషిగా భావించి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

దానిపై జస్టిస్(రిటైర్డ్) మార్కండేయ కాట్జూ 2016 డిసెంబర్‌లో తన బ్లాగ్‌లో సౌమ్యా హత్య ఘటనపై సుప్రీం తీర్పును విమర్శించారు. ఈ తీర్పు విషయంలో కోర్టు తీవ్రమైన తప్పిదం చేసిందని రాశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న న్యాయమూర్తుల నుంచి ఇలాంటి తీర్పు ఆశించలేదన్నారు.

దీంతో సుప్రీంకోర్టు జస్టిస్ కాట్జూను వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని, చట్టపరంగా ఆయన కరెక్టా లేక కోర్టు కరెక్టా వాదించాలని కోరింది. సుప్రీంకోర్టు తమ తీర్పును విమర్శించిన ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని కోర్టుకు పిలిపించడం ఇదే మొదటిసారి.

తర్వాత జస్టిస్ కాట్జూ తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాల్సివచ్చింది.

Image copyright SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

చరిత్ర విద్యార్థి నుంచి చీఫ్ జస్టిస్ వరకూ

బాంబే హైకోర్టు జస్టిస్(రిటైర్డ్) చంద్రశేఖర్ ధర్మాధికారి ఒకసారి బీబీసీతో, "జస్టిస్ గొగోయ్ చీఫ్ జస్టిస్‌ కావడం సంతోషంగా ఉందని, ఎందుకంటే ఆయన ఆ పదవికి అత్యంత సమర్థులు" అని అన్నారు.

2001లో జస్టిస్ గొగోయ్ గువాహటి హైకోర్టులో ఒక జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో ఆయనను పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. ఏడాది ర్వాత ఆయన అక్కడి చీఫ్ జస్టిస్ అయ్యారు. 2012 ఏప్రిల్‌లో గొగోయ్ సుప్రీంకోర్టు జడ్జ్‌గా ప్రమోట్ అయ్యారు.

2018 అక్టోబర్ 3న భారత 46వ చీఫ్ జస్టిస్ అయిన రంజన్ గొగోయ్ ఈ పదవిలో నియమితులైన మొట్టమొదటి ఈశాన్య భారత వ్యక్తిగా చరిత్ర సృష్టిచారు.

ఆయన బాల్యం అంతా డిబ్రూగడ్‌లో గడిచింది. తర్వాత గొగోయ్ దిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి చరిత్ర గ్రాడ్యుయేషన్, లా ఫాకల్టీ నుంచి లా చదివారు.

గత ఏడాది విడుదలైన 'గువాహటీ హైకోర్టు, చరిత్ర, వారసత్వం'లో జస్టిస్ గొగోయ్ గురించి ఒక ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఒకసారి జస్టిస్ గొగోయ్ తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్( అసోం మాజీ ముఖ్యమంత్రి)ను ఆయన స్నేహితుడు "మీ కొడుకును కూడా మీలాగే రాజకీయాల్లోకి తీసుకొస్తారా" అని అడిగారు.

దానికి సమాధానంగా జస్టిస్ గొగోయ్ తండ్రి "నా కొడుకు మంచి వకీలు, అతడిలో దేశ చీఫ్ జస్టిస్ అయ్యే సామర్థ్యం ఉంది" అని చెప్పారు.

Image copyright Getty Images

కోర్ట్ నంబర్ ఒకటి

దిల్లీలో జరిగిన రామ్‌నాథ్ గోయంకా స్మారక ఉపన్యాసంలో జస్టిస్ గొగోయ్ న్యాయవ్యవస్థను ఎప్పుడూ విశ్వాసానికి చివరి కోటగా చెప్పారు. న్యాయవ్యవస్థ పవిత్రంగా, స్వతంత్రంగా, విప్లవాత్మకంగా ఉండాలని చెప్పారు.

జస్టిస్ గొగోయ్‌ను పారదర్శకత పాటించే జడ్జిల్లో ఒకరుగా చెబుతారు. ఆయన ఆస్తులు, ఆభరణాలు, నగదుకు సంబంధించిన వివరాలే ఆయన ఎంత సాధారణ జీవితం గడుపుతారో చెబుతాయి. గొగోయ్ దగ్గర ఒక్క కారు కూడా లేదు. తల్లి, అసోం ప్రముఖ స్వచ్ఛంద కార్యకర్త శాంతి గొగోయ్ నుంచి అందిన కొన్ని ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి. వాటితోపాటూ సంపదకు సంబంధించిన సమాచారంలో ఏ మార్పు వచ్చినా ఆయన వాటిని ప్రకటిస్తుంటారు కూడా.

చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఆయన ఈ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు.

తీర్పులను బట్టి చరిత్రలో న్యాయమూర్తులు గుర్తుండిపోతారనే విషయంలో మరో మాట ఉండదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు నంబర్ వన్ నుంచి వచ్చిన తీర్పులు కూడా అలాంటి పరీక్షలనే ఎదుర్కొంటాయి. అయోధ్య తీర్పు కచ్చితంగా శాశ్వతంగా గుర్తుండిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ చేస్తున్న వాదనలో నిజమెంత...

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ : అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా ఈ బిల్లులో ఏముంది?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

అయోధ్య కేసులో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు

అభిప్రాయం: పౌరసత్వ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేయవచ్చా...

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?