'సుప్రీం కోర్టు తీర్పు సమాచార న్యాయ శాస్త్రంలో ఒక మలుపు' - అభిప్రాయం

  • 18 నవంబర్ 2019
సుప్రీంకోర్టు Image copyright Getty Images

సుప్రీంకోర్టులో సమాచార హక్కు చట్టం పనిచేస్తుందా, లేక సమున్నత న్యాయస్థానం ఆర్టీఐకి అతీతమా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది కనుక సమాచారం ఇవ్వాల్సిన పని లేదా, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి రావాలా- అనే అంశాల మీద సుప్రీంకోర్టుకు సందేహాలు వచ్చాయి. వాటిని తీర్చుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. సుప్రీంకోర్టు తన కోర్టులోనే కేసు వేసుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇదొక ప్రత్యేకత.

సుప్రీంకోర్టు స్వయంగా కేసు వేసి తానే తీర్పు చెప్పడమేమిటి, అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కదా, తన కేసులో తానే తీర్పు చెప్పకూడదని సుప్రీంకోర్టే చాలా సార్లు చెప్పింది కదా అని విమర్శలు వస్తాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ''నేను సమాచార హక్కు చట్టం కిందకు వస్తానా రానా, వస్తే అందరిలాగానే పరిమితులు ఉంటాయా? అనే విషయం నేనే చెప్పాలి'' కదా అన్న స్వతంత్ర లక్షణాన్ని నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లింది.

అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చే తన పాత్రను తానే నిర్ణయించుకోవడమే కాకుండా న్యాయవ్యవస్థలో, అన్ని ప్రభుత్వ సంస్థల్లో సమాచార అధికారులు ఎంత సమాచారం ఇవ్వాలి, ఏ సమాచారం ఇవ్వకూడదు అని వివరించే నిర్దేశ సూత్రాలను రూపొందించడానికి ఈ విధంగా తీర్పు మార్గాన్ని ఎంచుకుంది.

పార్లమెంటు 2005లో రూపొందించిన సమాచార చట్టానికి సుప్రీంకోర్టు ఈ విధంగా అర్థాన్ని అన్వయిస్తూ ఒక వినూత్న సమాచార హక్కు చట్టాన్ని అనుబంధంగా ప్రకటించింది.

రాజ్యాంగ అధికరణ 141 కింద సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పూర్వ న్యాయనిర్ణయం హోదాలో శాసనంగా దేశమంతటికీ వర్తిస్తుంది. కనుక సుప్రీంకోర్టు తీర్పు మరో ఆర్టీఐ చట్టాన్ని చేసింది. పార్లమెంటుతోపాటు తనకు సమమైన సార్వభౌమాధికారం ఉంది కనుక సుప్రీంకోర్టు తీర్పురూప శాసనాన్ని చేసింది. అది ఈ తీర్పు విశేషం.

Image copyright IMAGEDB/GETTY IMAGES

పరిధి విస్తరణ

తన ముందుకు తానే తెచ్చుకున్న వివాద అంశాలకే పరిమితం కాకుండా సుప్రీంకోర్టు తన విచారణాపరిధిని విస్తృతంగా విస్తరించి, మొత్తం అన్ని నియమాలపైన తన అన్వయాన్ని ప్రకటించి, ఆర్టీఐని ఈ విధంగానే అమలు చేయాలని మొత్తం ప్రజాసమాచార అధికారులను, ప్రభుత్వాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా సమాచార కమిషన్‌ను సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా శాసించిందన్నది అందరూ గమనించాల్సిన నిజం.

ఈ విధంగా సుప్రీంకోర్టు మరో ఆర్టీఐ చట్టాన్ని రచించింది. ఇందులో మొదట అర్థం చేసుకోవాల్సిందేమిటంటే న్యాయవ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా, రాదా అనే విషయంలో ధర్మాసనం కొత్తగా చెప్పిందేమీ లేదు.

ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి కూడా ఆర్టీఐ వర్తిస్తుందా అని ఎవరూ సవాలు చేయలేదు. పత్రికలు మీడియా అంతా గగ్గోలు చేసినట్టు ఆర్టీఐ సీజేఐకు వర్తిస్తుందని చెప్పలేదు. సీజే కార్యాలయం కూడా న్యాయవ్యవస్థలో ఒక భాగంగా ఉంది కనుక, సీజే తదితర న్యాయమూర్తులతో కలిపి ఉన్న వ్యవస్థ న్యాయవ్యవస్థ అని రాజ్యాంగ అధికరణ 124లో ఉంది కనుక, మొత్తం న్యాయవ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, సీజే కార్యాలయం సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధర్మాసనం వివరించింది.

Image copyright RTI.GOV.IN

అడిగిందేమిటి, సుప్రీంకోర్టు ఇచ్చిందేమిటి?

ఎంత మంది న్యాయమూర్తులు సీజేకు ఆస్తిపాస్తుల వార్షిక వివరాలు ఇచ్చారు, ఎంత మంది ఇవ్వాల్సి ఉందని సుభాష్ చంద్ర అగర్వాల్ ఆర్టీఐ కింద సమాచారం కోరారు. సీపీఐవో 'హమ్మో, ఈ సమాచారం ఇవ్వడమా' అని ఇవ్వలేదు.

ఒక న్యాయవాది చెన్నైలో న్యాయమూర్తులను ప్రభావితం చేసి అనుకూల తీర్పులు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఒక పత్రికలో వచ్చిన ఆరోపణపై న్యాయవ్యవస్థలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలని మరొక దరఖాస్తులో సుభాష్ చంద్ర కోరారు.

మూడో దరఖాస్తులో దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాను కాదని, ఆయన కన్నా జూనియర్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు ఎంపిక చేసిన కొలేజియం వివరాలను ఇవ్వాలని సుభాష్ చంద్ర కోరారు.

ఈ మూడు దరఖాస్తులను సీపీఐవో తిరస్కరించారు. మొదటి అప్పీలను అధికారులు కూడా తిరస్కరించారు. సుభాష్ రెండో అప్పీలును సమాచార కమిషన్ ముందు దాఖలు చేశారు. ఈ సమాచారం ఇవ్వాల్సిందేనని సమాచార కమిషన్ సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సమాచార కమిషన్ ఆదేశాలపై రిటి పిటిషన్ వేస్తూ, సుప్రీంకోర్టు ఆ సమాచారాల్ని ఇవ్వాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టులో వాదించారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ సమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు.

అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు వారు దిల్లీ హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, జస్టిస్ విక్రంజీత్ సేన్, జస్టిస్ ఎస్ మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం ఈ సమాచారం ఇవ్వాలని, సుప్రీంకోర్టు జవాబుదారీగా ఉండాలని, పారదర్శకత నియమాల నుంచి సుప్రీంకోర్టుకు మినహాయింపు లేదని తీర్పు చెప్పింది.

సుప్రీంకోర్టు అధికారులు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవడం ఒక విశేష సంఘటన. సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టు ఉత్తర్వును నిలిపివేసి, అప్పీలును స్వీకరించింది. కాని అనేక సంవత్సరాలపాటు విచారణ చేయలేదు. దానిపై కూడా సుభాష్ చంద్ర ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. 'అయ్యా, నా కేసు ఏమయింది' అని అడిగారు. దానికి సంబంధించిన కాగితాలను సుభాష్ చంద్రకు ఇచ్చారు.

ప్రతి ప్రధాన న్యాయమూర్తి ముందుకు ఇది రావడం, దానిపైన ఆయన సెలవుల తరువాత వేయాలని ఆదేశించడం, లేదా త్వరలో రాబోయే కొత్త ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకువెళ్లండి అని రాయడం జరిగిందని ఆ కాగితాల్లో తేలింది.

చివరికి అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించారు. 2010 నుంచి నలుగుతున్న ఈ సమస్యపై తుది తీర్పు నవంబర్ 13న వెలువడింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా పక్షాన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక తీర్పు రచించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ విడివిడిగా రెండు తీర్పులు రాశారు. కాని అయిదుగురు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆర్టీఐ కింద న్యాయవ్యవస్థ సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్న అంశంపై అయిదుగురు న్యాయమూర్తులది ఒకే అభిప్రాయం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

'విధ్వంస' అన్వయం కూడదు

న్యాయవ్యవస్థ ఆర్టీఐ చట్టంలోని 'పబ్లిక్ అథారిటీ' అన్న నిర్వచనం కిందకు వస్తుంది. కానీ ఆ నిర్వచనాన్ని రాజ్యాంగానికి విధ్వంసం కలిగించే విధంగా అన్వయించరాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒక పబ్లిక్ అథారిటీ అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సంస్థ అని ఆ నిర్వచనంలో ఉంది, పార్లమెంటు లేదా శాసనసభల ద్వారా ఏర్పాటైన సంస్థలు 'పబ్లిక్ అథారిటీ' అనే నిర్వచనంలో అన్వయించడానికి ఏమి ఉంటుంది? ఉన్నా రాజ్యాంగానికి విధ్వంసకరమైన అన్వయం ఏముంటుందనేది అర్థం కావడం లేదు.

న్యాయవ్యవస్థ కింద సుప్రీంకోర్టును 124వ అధికరణం లో ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ వ్యవస్థలో భాగమని అందులో ఉంది. వారు ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని, మినహాయింపులు, ఇతర నియమ నిబంధనలకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది అని చట్టంలో ఉంది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం చాలా సంతోషదాయకం.

పార్లమెంటు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా గౌరవించింది. న్యాయవ్యవస్థకు పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉందని గుర్తించింది. తమ అధికారులు దాఖలు చేసుకున్న అప్పీలును చాలా సమగ్రంగా విచారించి, చట్టంపై సమగ్రమైన వ్యాఖ్యానం చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రతి సెక్షన్‌పై అభిప్రాయాన్ని వివరిస్తూ, ఏ సమాచారం ఇవ్వవచ్చు, ఏది ఇవ్వకూడదు అనే అంశంపై ఒక మార్గదర్శకం వంటి తీర్పు ఇది.

ఇంతకూ సమాచారం ఇస్తారా?

ఇంతకూ ఈ తీర్పులో సుప్రీంకోర్టు వారు సుభాష్ చంద్ర అడిగిన సమాచారం ఇవ్వాలో, వద్దో చెప్పలేదు. ఈ తీర్పు ఆధారంగా ఆయన అభ్యర్థనలను మరోసారి పరిశీలించి, తమ విచక్షణను వినియోగించి సమాచారం ఇవ్వాలో, వద్దో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తన సీపీఐవోను ఆదేశించింది. అంటే ఆయన మరో 30 రోజుల్లో అంటే 13 డిసెంబర్ వరకు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోతే సుభాష్ మళ్లీ మొదటి అప్పీలు, రెండో అప్పీలు, దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులకు చట్టం ప్రకారం చేసుకోవచ్చు.

సుభాష్ చంద్ర వయసు దాదాపు 68 ఏళ్లు. సమాచారం అడిగిన తేదీ నుంచి లెక్కవేస్తే సుప్రీంకోర్టు కార్యాలయం వివరాలు ఇవ్వాలో, లేదో తేల్చుకోవడానికే మొత్తం 12 ఏళ్లు పట్టింది. పూర్తి సమాచారం రావడానికి ఇంకెంత కాలం పడుతుందో చెప్పలేం.

ముగ్గురు న్యాయమూర్తులు విడిగా రాసిన మూడు తీర్పుల వెనుక చాలా పరిశోధన, లోతైన పరిశీలన, హేతుబద్ధమైన వాదన ఉన్నాయి.

ఎన్నో ఉదాహరణలు, సూచనలు, జాగ్రత్తలు, ఆంక్షల వివరణలు, పరిమితులపై విశ్లేషణలు, అసలు సమాచారం అంటే అర్థం ఏమిటి, ఎంత వరకు ఏ సమాచారం ఇవ్వాలి, ఏ సమాచారం ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అనే వివరాలు 250 పేజీల్లో న్యాయమూర్తులు వివరించారు. సీపీఐవో చాలా జాగ్రత్త గా పరిశీలించాలని హెచ్చరిక కూడా చేశారు. కొన్ని ఉదాహరణలు ఇచ్చినా అవి సూచికలు మాత్రమేననీ, సంపూర్ణమైన చిట్టా కాదని ఒక వివరణ ఇచ్చారు.

Image copyright RTIONLINE.GOV.IN

ప్రజాప్రయోజనమే పరమావధి

ప్రజాప్రయోజనం అనే విశాల దృక్పథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని, ప్రజాశ్రేయస్సు మాత్రమే సమాచారం ఇవ్వాలో, వద్దో తేల్చడానికి వినియోగించాలని చెప్పారు.

గోపనీయత, నమ్మి ఇచ్చిన సమాచారం దాచడం, ఎంపిక కాని అభ్యర్థుల పరువు తీయని సమాచారం మాత్రమే ఇవ్వాలనీ, ఇవిగాక వ్యక్తిగతమైన, పూర్తిగా ఇంటిగుట్టు వంటి సమాచారాన్ని, కుటుంబ సమాచారాన్ని ఇవ్వకూడదనే జాగ్రత్తలు ఈ మూడు తీర్పుల్లో ఉన్నాయి.

సమాచార న్యాయశాస్త్రంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక మలుపు. సమాచార హక్కు చట్టానికి ఇక ఈ తీర్పు ఆధారంగా అన్వయం చెబుతారు.

పారదర్శకత పేరుతో న్యాయమూర్తుల స్వతంత్రతను దెబ్బ తీయరాదని, అయితే స్వతంత్రత, జవాబుదారీతనం రెండూ చెట్టపట్టాలేసుకుని సాగే అవకాశం ఉందని న్యాయమూర్తులు చెప్పారు. గోపనీయతను దెబ్బతీయకుండా సమాచారం ఇచ్చే విషయంలో ఆలోచించాలన్నారు.

ప్రజాప్రయోజనమే పరమావధిగా భావించి, అందుకు అనుగుణంగా ఉంటేనే సమాచారం ఇవ్వాలని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఎస్‌పీ గుప్తా కేసులో జస్టిస్ పీఎన్ భగవతి చెప్పినట్టు సమతౌల్యంతో, నిష్పత్తి సూత్రంతో పారదర్శకతను పాటించాలన్నారు.

సమాచార హక్కు చట్టం అమలులో ఈ తీర్పు ఎలా ఉపయోగపడుతుందో, సమాచార అధికారులు ఎంత మేరకు అర్థం చేసుకుంటారో, దీన్ని సమాచారం ఇవ్వడానికి వాడుకుంటారో లేక సమాచారం నిరాకరించడానికే వాడుకుంటారో వేచి చూడాల్సిందే.

(వ్యాసకర్త మాజీ కేంద్ర సమాచార కమిషనర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)